Best Web Hosting Provider In India 2024
Vegetables: ఈ 5 కూరగాయలను తొక్క తీయకుండానే తింటేనే ఆరోగ్యం, కానీ తొక్క తీసి పడేస్తున్నాం
Vegetables: కూరగాయలు కొన్ని తొక్కతీసి తింటే, మరికొన్నింటినీ తొక్కతో పాటూ తింటూ ఉంటారు. అయితే కొన్ని కూరగాయలు వాటి తొక్కలతోనే తింటేనే ఆరోగ్యకరం. ఏ కూరగాయలను తొక్కతో పాటూ తినాలో తెలుసుకోండి.
ఎన్నో రకాల కూరగాయలు మన ఆహారం భాగంగా ఉంటాయి. వాటిని తింటేనే సమతుల ఆహారం తీసుకున్నట్టు. వీటిలో అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. మన ఆరోగ్యానికి కూరగాయలు అనేక విధాలుగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. సాధారణంగా కూరగాయలు కొన్నింటినీ తొక్కతో పాటూ తింటే, మరికొన్ని తొక్క తీసి తింటాము. అయితే తెలియక కొన్ని రకాల కూరగాయలను తొక్క తీసి తింటూ ఉంటాము, కానీ వాటిని తొక్కతోనే తినడం మంచిది.
కూరగాయల్లోని తొక్కతో ఎన్నో పోషకాలు ఉంటాయి. పైన తొక్కను తీసేయడం వల్ల పోషకాలు చాలావరకు నాశనం అవుతాయి. కాబట్టి తొక్క తీయకుండా తినాల్సిన కూరగాయలు కొన్ని ఉన్నాయి. వీటిని తొక్కతో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బంగాళాదుంపలు
బంగాళదుంపలతో చేసిన వంటకాలు అందరికీ ఎంతో నచ్చుతాయి. ముఖ్యంగా పిల్లలకు ఇవి ఎంతో నచ్చుతాయి. చాలా ఇళ్లలో బంగాళాదుంపలను తొక్క తీసి వండుతారు. బంగాళాదుంప తొక్కలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు నిండుగా ఉంటాయి. దానిలో ఐరన్ నిండుగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల పనితీరును మెరుగుపరచడానికి పనిచేస్తుంది. అలాగే, బంగాళాదుంప తొక్కలలో దాని గుజ్జు కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే, బంగాళాదుంపలను చర్మంతో పాటూ వండే ముందు వాటిని పరిశుభ్రంగా కడగడం మర్చిపోవద్దు.
బీరకాయ
బీరకాయలో కూడా పోషకాలు ఎక్కువ. బీరకాయ తొక్కలను కూడా బయటపడేస్తారు. నిజానికి బీరకాయ తొక్కలో ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. పిల్లలకు ఇది నచ్చకపోవచ్చు, కానీ ఆరోగ్యానికి మాత్రం ఎన్నో అందిస్తుంది. ఈ ఆకుపచ్చ కూరగాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బీరకాయను ఎల్లప్పుడూ తొక్కతోనే వండుకోవాలి. దీని తొక్కలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. దీన్ని తొక్కతో పాటూ తినడం వల్ల పొట్ట ఆరోగ్యం, ఎముక ఆరోగ్యం, గుండె ఆరోగ్యంతో సహా మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
క్యారెట్లు
పిల్లలు ఇష్టంగా తినేవాటిలో క్యారెట్లు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి. అందుకే దీన్ని వివిధ రకాలుగా ఆహారంలో చేర్చుకుంటారు. అయినప్పటికీ, క్యారెట్లను దాదాపు అన్ని వంటకాల్లో వాడుతూ ఉంటారు. వాడే ముందు పైన తొక్కను చెక్కేస్తారు. దీని వల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయి. క్యారెట్ తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి, బి 3, ఫైటోన్యూట్రియెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యారెట్ల లక్షణాలను మరింత పెంచుతాయి. మీరు క్యారెట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, దానిని తొక్క తీయకుండా తినండి.
కీరాదోసకాయ
కీరాదోసకాయను సలాడ్ లలో కలిపి తింటూ ఉంటారు. కీరదోసకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాని నుంచి పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, ఎల్లప్పుడూ తొక్క తీయకుండా తినండి. కీరదోసకాయ తొక్కలలో ఫైబర్, విటమిన్లు, అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి జుట్టు, గోళ్ళ నుండి రక్త ప్రసరణను నిర్వహించడానికి సహాయపడతాయి.
వంకాయ
వంకాయ కూర కొంతమందికి నచ్చుతుంది, మరికొంతమందికి నచ్చదు. ముఖ్యంగా పిల్లలకు వంకాయ కూర నచ్చదు. మీరు దానిని కూడా తొక్కకుండానే వండాలి. వంకాయ తొక్కలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా తొక్కలో ఉండే ఫైబర్ పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే సమయంలో దీన్ని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. వంకాయ తొక్కలు కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముందుంటుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్