Best Web Hosting Provider In India 2024
Renu Desai: అది చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చేశాయి.. రేణు దేశాయ్ కామెంట్స్
Renu Desai About 1000 Words Movie And Climax: సీనియర్ హీరోయిన్, నటి రేణు దేశాయ్ 1000 వర్డ్స్ మూవీ స్పెషల్ ప్రీమియర్‌కు ముఖ్య అతిథుల్లో ఒకరిగా హాజరయ్యారు. 1000 వర్డ్స్ సినిమా క్లైమాక్స్ చూసిన తనకు కూడా కన్నీళ్లు వచ్చేశాయంటూ ఇటీవల కామెంట్స్ చేశారు. 1000 వర్డ్స్ మూవీపై తన అభిప్రాయం చెప్పుకొచ్చారు.
Renu Desai About 1000 Words Movie: బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యా, అరవింద్ కృష్ణ, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘1000 వర్డ్స్’. విల్లర్ట్ ప్రొడక్షన్ హౌజ్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. కే రవి కృష్ణా రెడ్డి కో- ప్రొడ్యూసర్‌గా పని చేశారు.
1000 వర్డ్స్ స్పెషల్ ప్రీమియర్
1000 వర్డ్స్ సినిమాకు డా. సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించగా.. శివ కృష్ణ సంగీతం సమకూర్చారు. సినిమాటోగ్రఫర్‌గా శివ రామ్ చరణ్ పని చేశారు. సోమవారం (జనవరి 6) నాడు స్పెషల్‌గా ఈ 1000 వర్డ్స్ మూవీని ప్రదర్శరించారు. ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్‌కు రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్ (గుప్పెడంత మనసు జగతి), సుకు పూర్వాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్పెషల్ షోను వీక్షించిన అనంతరం తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
బాగానే అనిపించింది. కానీ,
రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. “రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది. కానీ, ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా” అని అన్నారు.
కన్నీళ్లు వచ్చాయి
“ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీశారు. సినిమా, దాని క్లైమాక్స్ చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. ఇంత మంచి సినిమాను తీసిన టీమ్‌కు ఆల్ ది బెస్ట్. రమణ గారికి ఇది ఆరంభం మాత్రమే. ఆయన్నుంచి ఇంకా ఇలాంటి మంచి చిత్రాలు రావాలని ఆశిస్తున్నాను” అని రేణు దేశాయ్ కోరారు.
అవార్డులు వస్తాయి
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “1000 వర్డ్స్ అద్భుతమైన చిత్రం. అందరినీ కంటతడి పెట్టించారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయి. ప్రతీ ఒక్కరి హృదయాల్ని కుదిపేస్తుంది. చాలా రోజులకు ఓ చక్కటి సినిమాను చూశానని అనిపిస్తుంది” అని అన్నారు.
హృదయాన్ని హత్తుకుంది
దివి మాట్లాడుతూ.. “నన్ను ఇంత అందంగా చూపించిన రమణ గారికి థాంక్స్. సినిమా చివర్లో నేను ఏడ్చాను. చివరి పది నిమిషాలు హృదయాన్ని హత్తుకుంది. అందరినీ ఈ మూవీ కట్టి పడేస్తుంది. కథ విన్నప్పుడు ఇంత ఎఫెక్టివ్‌గా ఉంటుందని అనుకోలేదు. తెరపై అలా చూస్తుంటే ఓ తల్లి మాతృత్వాన్ని ఫీల్ అయ్యాను” అని తెలిపింది.
తల్లి కాకుండానే మాతృత్వం
నటి మేఘన మాట్లాడుతూ.. “1000 వర్డ్స్‌లో ఇంత మంచి పాత్రను రమణ గారు నమ్మకంగా నాకు ఇచ్చినందుకు థాంక్స్. సినిమా చూస్తుంటే నిజంగానే తల్లి కాకుండానే మాతృత్వాన్ని అనుభవించినట్టుగా అనిపించింది. అరవింద్, దివి గార్లతో నటించడం ఆనందంగా ఉంది. ఇలాంటి మరిన్ని మంచి పాత్రలను నేను చేయాలని కోరుకుంటున్నాను” అని చెప్పింది.
“1000 వర్డ్స్ సినిమాలో నూరి కారెక్టర్‌ను ఇచ్చిన రమణ గారికి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్” అని చైల్డ్ ఆర్టిస్ట్ విజయ్ అలియాస్ నూరి అన్నాడు.