Best Web Hosting Provider In India 2024
Sankranthi Ariselu: సంక్రాంతికి అరిసెలు లేకపోతే పండగే లేదు, అరిసెలు మెత్తగా రావాలంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి
Sankranthi Ariselu: సంక్రాంతి పేరు చెబితే మొదటి గుర్తొచ్చేవి అరిసెలే. అరిసెల కోసమే సంక్రాంతి పండుగ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక్కడ మేము అరిసెల రెసిపి ఇచ్చాము.
సంక్రాంతి వస్తుందంటే ప్రతి ఇంట్లో అరిసెలు రెడీ అయిపోతూ ఉంటాయి. నగరాల నుంచి అతిధులు అంతా పల్లెటూర్లకు చేరుకుంటారు. పండక్కి కొత్త దుస్తులతో పాటు కొత్త రుచులు కూడా సిద్ధమైపోతాయి. వంటింట్లో అరిసెలు, సున్నుండలు, పాకుండలు, జంతికలు, గారెలు, బూరెలు ఇలా ఎన్నో రెడీ అవుతాయి. సంక్రాంతికి ఖచ్చితంగా తినాల్సిన వంటకం అరిసెలు. దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే పర్ఫెక్ట్ గా చేయగలరు. అరిసెలు మరీ మందంగా, గట్టిగా వస్తే తినలేరు. కాబట్టి అరిసెలు మెత్తగా టేస్టీగా ఎలా రావాలో తెలుసుకోండి. ఇక్కడ అరిసెలు రెసిపీ ఇచ్చాము.
అరిసెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యము – ఒకటిన్నర కిలో
బెల్లం – ఒక కిలో
నెయ్యి లేదా నూనె – ముప్పావు కిలో
గసగసాలు – ఒక స్పూను
నువ్వులు – ఒక స్పూను
అరిసెలు రెసిపీ
1. అరిసెలు చేసేందుకు బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగేయాలి.
2. మంచినీళ్లు వేసి నానబెట్టాలి. ఉదయం వరకు అలాగే ఉంచి ఉదయాన నీళ్లను ఒంపేసి ఆ బియ్యం తడిగా ఉన్నప్పుడే దంచాలి.
3. మిల్లులో ఆడించి తడిగా ఉన్నప్పుడే పిండిని తీసుకోవాలి.
4. ఇప్పుడు ఆ పిండిని జల్లెడతో జల్లించి ఒక గిన్నెలో వేయాలి.
5. బెల్లాన్ని కూడా చిన్నగా తురిమి పొడిలా చేసుకోవాలి.
6. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఈ బెల్లము, గ్లాసు నీరు వేసి పాకం వచ్చేదాకా బాగా మరగనివ్వాలి.
7. పాకం వచ్చాక ఈ బియ్యప్పిండిని వేసి కలుపుకోవాలి.
8. ఇది గట్టిగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
9. దాన్ని గోరువెచ్చగా అయ్యేదాకా వదిలేయాలి.
10. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి నెయ్యి లేదా నూనె వేయాలి.
11. అరిసెలు డీప్ ఫ్రై చేయడానికి సరిపడా వేయాలి.
12. ఇప్పుడు పాకం పిండిని తీసుకొని నిమ్మకాయ సైజులో చేత్తోనే లడ్డూలా చుట్టుకోవాలి.
13. దాన్ని చిన్న పూరీలాగా చేత్తోనే ఒత్తుకొని పైన గసగసాలు, కొంచెం నువ్వులు చల్లుకోవాలి.
14. రెండు వైపులా అలా చల్లుకున్నాక వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
15. ఆ తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. అదనపు నూనెను టిష్యూ పేపర్ పీల్చేస్తుంది.
16. ఇప్పుడు వీటిని గాలి చేరని కంటైనర్ లో వేసి దాచుకోవాలి.
17. రెండు మూడు వారాల వరకు అరిసెలు తాజాగా ఉంటాయి. పైగా చాలా రుచిగా కూడా ఉంటాయి.
అరిసెలు మెత్తగా రావాలనుకుంటే బెల్లం పాకం మరీ ముదరకుండా లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండిని వేసి కలుపుకోవాలి. ఇలా పాకం లేతగా ఉన్నప్పుడే చేస్తే ఆ అరిసెలు మెత్తగా వస్తాయి. పాకం మరీ మందంగా మారిపోతే అందులో వేసిన బియ్యప్పిండి కూడా బాగా మందంగా మారి అరిసెలు గట్టిగా అయిపోతుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో అరిసెలు చేసుకొని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి కూడా.
సంబంధిత కథనం