Best Web Hosting Provider In India 2024
TG Rythu Bharosa Scheme : ‘రైతు భరోసా ‘ అమలు ఎలా…? ప్రధానమైన 8 సందేహాలు, సర్కార్ ఏం చేయబోతుంది..?
Telangana Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీమ్ పట్టాలెక్కబోతుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే ఈ స్కీమ్ అమలపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా దరఖాస్తులు ఉంటాయా..? సాగు చేస్తేనే డబ్బులు ఇస్తారా..? సాగు యోగ్యతకు ప్రతిపాదికత ఏంటి వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
తెలంగాణలో పంట పెట్టుబడి సాయం స్కీమ్ మళ్లీ పట్టాలెక్కబోతుంది. గతంలో మాదిరి రైతుబంధుగా కాకుండా.. రైతు భరోసా పేరుతో అమలు కాబోతుంది. ఈ స్కీమ్ కు సంబంధించి తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఏటా రూ. 12 వేల పంట పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది.
రైతు భరోసా స్కీమ్ ను జనవరి 26, 2025 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ స్కీమ్ అమలుపై ప్రాథమికంగా కొన్ని సందేహాలు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. మొన్నటి కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రైతు భరోసా స్కీమ్ పై కీలక నిర్ణయాలను వెల్లడించారు. సాగు యోగ్యత ఉన్న భూములకే పంట పెట్టుబడి సాయం అందిస్తామంటూ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై కొన్ని విషయాలు చర్చకు వస్తున్నాయి.
రైతు భరోసా స్కీమ్ – 8 ప్రధాన సందేహాలు..
- రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా సాయం అందిస్తారని ప్రభుత్వం చెప్పింది. ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తామని ప్రకటన చేసింది. అయితే వ్యవసాయ యోగ్యమైన భూములను ఎలా గుర్తిస్తారు..? అనేది ప్రధాన ప్రశ్నగా మారింది.
- సాగు యోగ్యత విషయానికొస్తే… సాగు చేయటం వేరు, సాగు యోగ్యత వేరు. ఈ క్రమంలో సాగు చేయకున్నా… సాగు యోగత్య ఉంటే రైతు భరోసా దక్కుతుందా..? అనేది కూడా మరో ప్రశ్నగా ఉంది.
- ఉదాహరణకు ఓ రైతుకు మూడెకరాల పొలం ఉంటే రెండు ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నాడు. మరో ఎకరం సాగుకు యోగ్యత ఉన్నప్పటికీ చేయటం లేదు. సదరు రైతుకు రెండు ఎకరాలకే పంట పెట్టుబడి సాయం అందుతుందా..? లేక 3 ఎకరాలకూ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
- రైతు భరోసా కోసం మళ్లీ దరఖాస్తు తీసుకుంటారా..? గతంలో సేకరించిన వివరాల మేరకే చెల్లింపు ఉంటాయా..? అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంటుంది.
- రైతు భరోసా స్కీమ్ ను జనవరి 26, 2025 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు చేసే అవకాశం ఉంటుందా..? ఈ తేదీలోపు అసలైన అర్హులను ఎలా గుర్తిస్తారు..? అనే సందేహాం కూడా రైతుల్లో వ్యక్తమవుతుంది.
- వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలకు సంబంధించి… రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరిస్తారని ప్రభుత్వం తెలిపింది. ధరణి లోపాల కారణంగా గతంలో కొంతమందికి ఈ రకంగానూ రైతు బంధు నిధులు అందాయని పేర్కొంది. ఇలాంటి భూములకు చెక్ పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ ఎలా ఉండబోతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
- ఆదాయపు పన్ను చెల్లించే వారు కూడా రైతులుగా ఉంటారు. అయితే వీరికి పంట పెట్టుబడి సాయం అందుతుందా..? లేదా..? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
- ఓ భూమిని మరో కూలీ రైతు కౌలుకు తీసుకుంటే… అసలు రైతుకు పంట పెట్టుబడి సాయం ఇస్తారా..? లేక కౌలుకు తీసుకున్న రైతుకే “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా” పథకం కింద సాయం అందిస్తారా..? అనే విషయంపై కూడా సందేహాం నెలకొంది.
పైప్రశ్నలే కాకుండా మరికొన్ని అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయి మార్గదర్శకాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కేబినెట్ నిర్ణయాలు మాత్రమే వెల్లడికాగా… రేపోమాపో గైడ్ లైన్స్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. మార్గదర్శకాలు వస్తే… రైతు భరోసా అమలులో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది…! మొత్తంగా రైతు భరోసా స్కీమ్ అమలుపై ప్రభుత్వం ఏం చేయబోతుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
సంబంధిత కథనం
టాపిక్