ఇకపై కార్యకర్తలను గొప్పగా చూస్తాం

Best Web Hosting Provider In India 2024

పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

మీపై అన్యాయాలు చేసిన వారిని ఉపేక్షించం

వారిని చట్టం ముందు నిలబెడతాం.

కార్యకర్తలకు భరోసా ఇచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయస్‌.జగన్  

నెల్లూరు జిల్లా ప్ర‌జాప్ర‌తినిధుల‌తో వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశం 

తాడేప‌ల్లి: పార్టీ జెండా మోసిన ప్ర‌తీ కార్యకర్తను గొప్ప‌గా చూస్తాన‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా ఇచ్చారు. కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని అధినేత హ‌మీ ఇచ్చారు.  అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇవాళ తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు, పార్టీ నేతలతో వైయ‌స్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా  కూట‌మి స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతూ..భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.
 

అరు నెలలకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు. కానీ కేవలం ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ప్రతి ఇట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను 8 నెలల్లో పూర్తిగా గాలికొదిలేశారు.గతంలో మనం ఇచ్చిన పథకాలను రద్దు చేశారు. అవేవీ అమలు కావడం లేదు.

కూటమి నేతలు ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్లి… చిన్నపిల్లల దగ్గర నుంచి నీకు రూ.15 వేలు అని మొదలు పెట్టి… అదే ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లులు బయటకు వస్తే నీకు రూ.18 వేలు, అదే ఇంట్లో ఆ తల్లుల అత్తలు, పెద్దమ్మలు బయటకు వస్తే నీకు రూ.48వేలు, అదే ఇంట్లో నుంచి 20 ఏళ్ల పిల్లాడు బయటకు వస్తే నీకు రూ.36వేలు అని, రైతు కండువా వేసుకుని వస్తే నీకు రూ.20వేలు అని అందరికీ హామీలు ఇస్తూ వచ్చారు. మనవాళ్లు చాలామంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని నాతో చెప్పారు. మనం కుటుంబమంతటికీ మంచి చేశాం.. వాళ్లు కుటుంబంలో ప్రతి మనిషికి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. మనం కూడా చెబుదామన్నారు. కానీ ఆ రోజు మనం అబద్దాలు చెప్పలేదు. కారణం రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలి. అలాంటి వారికే విలువ ఉంటుంది. ఒక నాయకుడిగా మనం ఒక మాటచెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు.ఆ మాట నిబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారు. ఆ మాట అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుంది. అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. 

బడ్జెట్ తో  పాటే సంక్షేమ కేలండర్
ఎన్నికల సమయంలో మన మేనిఫెస్టో సందర్భంగా ఇవీ మన పథకాలు అని ప్రజంటేషన్‌ ఇచ్చాను. మనం రాకముందు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం. తొలిసారిగా మేనిఫెస్టో అన్న పదానికి కేవలం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే అర్ధం చెప్పాం. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడే సంక్షేమ కేలండర్ కూడా విడుదల చేస్తూ…ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో ముందే చెప్పి.. ఆ పథకాన్ని తూచా తప్పకుండా ఆ నెలలో నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల మొహాల్లో సంతోషం చూడాలని.. కేవలం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మాత్రమే తాపత్రయపడింది. 


వైయ‌స్ జగన్‌ కరెక్టుగానే చెప్పాడు అంటున్నారు..
చంద్రబాబు హామీల అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలి అని చెప్పాను. ఇది అయ్యే పని కాదు ఆయన చెప్పినవన్నీ మోసాలు, అబద్దాలు అని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పాను. ఆయన్ను నమ్మడమంటే.. పులినోట్లో తలకాయపెట్టడమే అని చెప్పాను. ఇవాళ  ఆ వీడియోలు చూస్తే.. వైయ‌స్ జగన్‌ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతినెలా ఏదో పథకం ద్వారా ప్రజలకు మేలు చేశాం. 

వైయ‌స్ జగన్ ఉన్నప్పుడు పలావు పెట్టాడు.ఇప్పుడు చంద్రబాబు పెడతానన్న బిర్యానీ పోయింది. జగన్‌ పెడుతున్న పలావూ పోయింది. చంద్రబాబుకూ, జగన్‌కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. మన ప్రభుత్వంలో ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్‌డెలివరీ జరిగేది. మరి చంద్రబాబుకాలంలో ఎందుకు ఇలా జరగడంలేదు?. తేడా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. 
చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ గాలికెగిరిపోయాయి. ఇవాళ ప్రతి ఇంట్లో ఒక్కటే చర్చ.. ఎనిమిది నెలలు అయింది, సంక్రాంతి వచ్చింది. ఇప్పుడు వైయస్పార్సీపీ‌ ప్రభుత్వం ఉండిఉంటే.. ప్రతినెలా ఏదో పథకం వచ్చేది. 


గత ప్రభుత్వ పథకాలన్నింటికీ మంగళం…
ఏప్రిల్ నెలలో వసతి దీవెన, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ, మే నెలలో జగనన్న విద్యాదీవెన, రైతులకు ఉచిత పంటల బీమా, రైతుభరోసా, మత్స్యకారులకు మత్సకార భరోసా వచ్చేది. డీజిల్ మీద సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా జరిగి ఉండేది. జూన్ నెల వచ్చేసరికి అమ్మఒడి వచ్చేది, జూలైలో వాహనమిత్ర,కాపునేస్తం, చిరువ్యాపారులకు జగనన్న తోడు వచ్చి ఉండేది. ఆగష్టులో జగనన్న విద్యాదీవన, నేతన్ననేస్తం డబ్బులుపడేవి. సెప్టెంబరు వచ్చేసరికి వైయస్ఆర్‌ చేయూత డబ్బులతో అక్కచెల్లెమ్మెల మొహాలు కళకళలాడుతూ ఉండేవి. అక్టోబరులో వైయస్సార్ రైతుభరోసా రెండో విడత, నవంబరులో జగనన్నవిద్యాదీవెన, రైతులు సున్నావడ్డీ డబ్బులు జమ అయ్యేవి. డిసెంబరు నెల వచ్చేసరికి ఈబీసీ నేస్తం, లా నేస్తంతో పాటు 8వతరగతి చదువుతున్న పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేవి. జనవరి నెల వచ్చేసరికి రైతులకు చివరిదఫా రైతుభరోసా, చిరువ్యాపారులకు జగనన్న తోడుతో పాటు సంక్రాంతి సమయానికి అక్కచెల్లెమ్మలకు ఆసరా డబ్బులు కూడా జమ అయ్యేవి. ఫిబ్రవరిలో విద్యాదీవెన, జగనన్న చేదోడు వచ్చేవి. ఐదేళ్లు ప్రతి సంవత్సరం, ప్రతి నెలా ఇలా షెడ్యూల్ ఇచ్చి చేసి చూపించాం. కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవి ఇప్పుడు జరగడంలేదు. ప్రతి ఇంట్లో ఈ చర్చ ప్రారంభమైంది. 

ఇవాళ మన పార్టీలో ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా వెళ్లగలడు. కారణం మనం చెప్పినవి చేసి చూపించాం. వీళ్ల మాదిరిగా మనం అబద్ధాలు చెప్పలేదు, మెసాలు చేయలేదు. వీళ్ల మాదిరిగా అధికారంకోసం ఏ గడ్డైనా తినడానికి మనం సిద్ధంగా లేము. ఎనిమిది నెలలు అయింది.ఇప్పుడు కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరు, వారికీ ఆ ధైర్యంకూడా లేదు. వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లాడు దగ్గర నుంచి పెద్దవాళ్లు వరకు ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఇస్తామన్న రూ.15వేలు ఏమైందని చిన్నపిల్లలు, రూ.18 వేలు ఏమైందని తల్లులు, మా రూ.48 వేలు ఏమైందని ఆ తల్లుల అత్తలు, పెద్దమ్మలు, మా రూ.20వేలు ఏమైందని రైతులు, మా రూ.36వేలు ఏమైందని యువత ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండడంతో వీళ్లు పోలేని పరిస్తితి.


మరోవైపు బాదుడే బాదుడు 
ఆరునెలల తిరక్కముందే రూ.15వేలు కోట్ల కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు. కరెంటు బిల్లులతో పాటు ఏం చూసినా బాదుడే బాదుడు కనిపిస్తోంది. నేషనల్ హైవేల మీద టోల్ వసూలు చేయడం చూశాం. రాబోయే రోజుల్లో గ్రామీణ రోడ్లలో టోల్‌గేట్లు పెట్టి టోల్ వసూలు చేసే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడుతున్నాడు. 
రిజిస్ట్రేషన్‌ ఛార్జీలూ పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజులు స్ధలాల మీదనే కాకుండా పాతఇళ్ల మీదకూడా ఛార్జీలు వేస్తున్నారు. పది, పదిహేను సంవత్సరాల నాటి ఇంటికి కూడా తొలిసారిగా రేట్లు పెంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విలువ కట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా ఏం తీసుకున్నా బాదుడే బాదుడు కార్యక్రమం చేస్తున్నారు. 

మరోవైపు చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించడంలేదు. మనం ప్రతి మూడునెలలకూ విద్యాదీవెన కింద చెల్లించాం. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన విద్యాదీవెన ఏప్రిల్ లో వెరిఫికేషన్ చేసి మే నెలలో పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయాలి. మన హయాంలో ప్రతి మూడు నెలలకొకసారి… ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా, ఏ పిల్లాడి చదవు ఆగిపోకుండా మనం అడుగులు వేశాం. ఇవాళ జనవరి, పిబ్రవరి, మార్చి త్రైమాసికం నుంచి నాలుగు క్వార్టర్స్ కు సంబంధించిన ఫీజులు రూ.2,800 బకాయిలు పెట్టారు. వసతి దీవెన కింద ప్రతి సంవత్సరం ఏఫ్రిల్ నెలలో రూ.1100 కోట్లు కూడా ఇవ్వలేదు. మొత్తానికి విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు అందక పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


రెడ్ బుక్ రాజ్యాంగం…
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని నెలకి రూ.౩౦౦ కోట్లుతో… 1000 ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం. ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలోనే ఏకంగా మార్చి నుంచి రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు. పేదవాడు ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి. నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుకునే పరిస్థితి ఎక్కడా లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది.ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇ-క్రాప్ అసలు కనిపించడం లేదు. రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదు. వాస్తవానికి విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలన.. ఈ నాలుగు రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం బాధ్యత. కాని ఈ నాలుగు రంగాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అన్నీ గాలికెగిరిపోయి రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. 

ఇంటివద్దకే డోర్‌డెలివరీ పరిపాలనుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు తిరాల్సిన పాలన జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అందుకే వారికి అండగా నిలబడే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రజల సమస్యలను పట్టించుకుని, వారికి తోడుగా ఉన్నవారే నాయకులుగా ఎదుగుతారు. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసింది.  
చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన వల్ల మనం ప్రజలకు తోడుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.ఇప్పటికే ప్రతి గ్రామంలో కూడా పార్టీ నిర్మాణం ఉంది. దీన్ని వ్యవస్థీకృతంగా తీర్చిదిద్దాలి. ఈ సంక్రాంతి నాటికి పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల ఏర్పాట్లన్నీ కూడా పూర్తికావాలి. నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యనటకు వస్తాను. అక్కడే నిద్ర చేస్తాను.ప్రతి వారం మూడు రోజులు మంగళ,బుధ, గురువారాల్లో ఒక పార్లమెంటులో విడిదిచేస్తాను. ప్రతిరోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. మండలస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ పార్టీ బలోపేతం కావాలి.గ్రామస్థాయి కమిటీలు, బూత్‌ కమిటీలు ఇవన్నీకూడా బలోపేతం కావాలి. 


సోషల్ మీడియా బలమైన ఆయుధం 

సోషల్‌మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలి. మీరు నేను అందరం చర్చించి ఆ దిశగా అడగులు వేస్తాం. ఇవాళ మనం కేవలం చంద్రబాబుతో యుద్ధంచేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీ5 లాంటి చెడిపోయి ఉన్న మీడియాతోనూ యుద్ధంచేస్తున్నాం. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్‌మీడియా ద్వారానే సాధ్యం. మన దగ్గర నుంచి గ్రామస్థాయిలో ఉన్న ప్రతి కమిటీసభ్యుడు కూడా సోషల్‌మీడియాను వినియోగించుకోవాలి. ఫోన్ ఒక ఆయుధం కావాలి. ప్రతి ఒక్కరికీ వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టా, ఎక్స్, యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. ప్రతి గ్రామంలో ప్రతి కమిటీ సభ్యుడు ఆ గ్రామంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ పోస్టు పెట్టాలి. పిల్లవాడు నా రూ.15 వేలు ఏమయ్యాయని ప్రశ్నించాలి. సూపర్ సిక్స్ ఏమైందని ప్రశ్నించాలి. తొలగిస్తున్న పెన్షన్లు మీద కూడా ప్రశ్నించాలి. ఇలా ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నించాలి. ఇచ్చిన హామీల అమలుకు పట్టుబట్టాలి. 

మూడు లక్షల పెన్షన్లు తొలగింపు

ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేనాటికి మన హయాంలో 66,34,742 పెన్షన్లు ఉంటే ఇవాళ చంద్రబాబు వచ్చిన తర్వాత డిసెంబరు నాటికి 62.81 లక్షలకు తగ్గిపోయాయి. అంటే 3.53 లక్షల పెన్షన్లు తగ్గించారు. ఇవి కాక ఇక దివ్యాంగులమీదకూడా బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. వీరి మీద చంద్రబాబు నాయుడు కమిటీ వేసి… వాళ్ల పెన్షన్లు తగ్గించే కార్యక్రమం మొదలు పెట్టారు. అంటే ఈ మార్చి నాటికి మరో 3 లక్షల పెన్షలు తగ్గించడమే వీరి ఉద్దేశం. ఇలా పెన్షన్లు, ఊర్లో ఉన్న ఆసుపత్రులు, కాలేజీలు అన్నింటి మీదా గ్రామంలో ఉన్న కార్యకర్త నుంచి నియోజకవర్గంలో ఉన్న నాయకుడు వరకు ప్రతి సమస్య మీద నిలదీయాలి. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి.  


ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం..

మరోవైపు చాలా ముఖ్యమైన అంశం. కార్యకర్తల విషయంలో ఇంతవరకూ ఒకలా చూశాం.ఇకపై మరోలా చూస్తాం. వారిని గొప్పగా చూస్తాం.ఈ విషయంలో మనంకూడా కొంత నేర్చుకోవాల్సి ఉంది. వైయస్సార్సీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం.అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండి. వారిని చట్టంముందు కచ్చితంగా నిలబెడతాం. ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. వీళ్లే కొడుతున్నారు, మరలా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఒక మనిషిని పదిచోట్ల తిప్పుతున్నారు. ఇవన్నీ కళ్లెదుటే కనిపిస్తున్నాయి. కచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటానని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా ఇచ్చారు.

Best Web Hosting Provider In India 2024