Best Web Hosting Provider In India 2024
Pawan Kalyan : ప్రజలు ఎన్టీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, అభివృద్ధి అంటే ఆంధ్రానే అనే స్థాయికి – పవన్ కల్యాణ్
Pawan Kalyan : ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మినందుకు…ప్రధాని మోదీ సారథ్యంలో 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan : భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దెందుకు ప్రధాని మోదీ అహర్నిశలు శ్రమిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో ప్రజావేదిక బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ….ఒక బలమైన భారత్ కోసం, ఒక ధృడమైన దేశం కోసం, జగత్ అంతా వసుదైక కుటుంబం అనే భావన కోసం నాలుగున్నర దశాబ్దాలుగా పరితపిస్తున్నారన్నారు. ఆ దారిలో ఎదుర్కొన్న ప్రతి పరాజయాన్ని, ప్రతీ అవమానాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తూ వాటినే విజయానికి ఇంధనంగా వాడుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రసంశించారు.
విద్యార్థి నాయకుడిగా మొదలై రెవెన్యూ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగుదేశానికి రథ సారథి అయి, నాలుగో సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు…రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పవన్ కల్యాణ్ కొనియాడారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, నిలబడ్డారన్నారు. అలా నిలబడినందుకే ప్రధాని మోదీ సారథ్యంలో 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయన్నారు.
“అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రం ఇబ్బంది పడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు. అందుకే ఈ రోజు 2 లక్షల కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి పనులు, ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు అందుతున్నాయి. ఇందుకు కారకులైన ప్రధాని మోదీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దక్షిణ కోస్తా రైల్వే జోన్, కృష్ణ పట్నం ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు ఇతర ప్రాజెక్టులు అన్నిటికీ కలిపి ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి.”- పవన్ కల్యాణ్
“గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయినప్పుడు…ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను నిలబెడదాం, అభివృద్ధి పథంలో నడిపిద్దామని ప్రధాని మోదీ ఆశా జ్యోతిలా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి ఆస్కారమే లేదు అనే స్థితి నుంచి అభివృద్ధి అంటే ఆంధ్రానే అని చెప్పుకునేలా చంద్రబాబు నాయకత్వంలో ప్రధాని నిర్దేశకత్వంలో ఎన్డీఏ మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారు. ప్రజలు అందించిన విజయం…కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, అమరావతి రాజధాని పెట్టుబడులు, పోలవరం నిధులు, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించే గొప్ప సంకల్పాలకు బలం ఇచ్చింది”- పవన్ కల్యాణ్
రాష్ట్రానికి ప్రధాని మోదీ ఆక్సిజన్ అందించారు- మంత్రి లోకేశ్
సీఎం చంద్రబాబు విజన్ 2020 అంటే నాడు కొంత మంది ఎగతాళి చేశారని, ఇప్పుడు విజన్ 2020 నిజం అయ్యిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇప్పుడు చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్ తో ముందుకు వచ్చారన్నారు.
“రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నెరవేర్చుతున్నారు. ఒకేసారి వెయ్యి పెన్షన్ పెంచారు, మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. త్వరలోనే మిగతా హామీలు కూడా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్లిపోయింది. ప్రతి నెల రూ.4 వేల కోట్ల లోటుతో రాష్ట్రం నడుస్తుంది. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ప్రధాని మోదీ ఆక్సిజన్ అందించారు”- మంత్రి నారా లోకేశ్
టాపిక్