Best Web Hosting Provider In India 2024
PM Modi : ఏపీలో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం, చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటామని హామీ
PM Modi : ఏపీలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. విశాఖ వేదికగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ…ఏపీ అభివృద్ధికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామన్నారు. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే, వీటిలో ఒకటి విశాఖకు కేటాయించామన్నారు.
PM Modi : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ శంకుస్థాపన చేశారు. విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన ప్రజావేదిక బహిరంగ సభలో… విశాఖ రైల్వేజోన్, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్‌పార్క్, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకు ప్రధాని ఇవాళ శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీనగర్ లైన్ల డబ్లింగ్ పనులు, గుత్తి-పెండేకల్లు రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 17 రోడ్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్ జాతికి అంకితం చేశారు.
అనంతరం ఈ సభలో మాట్లాడుతూ….సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఏపీ ప్రజల ఆశీర్వాదంతో 60 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. ఏపీని అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామన్నారు. 2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
“ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తాం. నేడు తలపెట్టిన ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధికి తోడ్పడతాయి. ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుంది. ఈ ప్రాజెక్టులు రాష్ట్రాభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తుంది. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మా లక్ష్యం. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే, వీటిలో ఒకటి విశాఖకు కేటాయించాం. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది” అని ప్రధాని మోదీ అన్నారు.
నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేశామని ప్రధాని మోదీ తెలిపారు. మూడు రాష్ట్రాల్లోనే ఇలాంటి బల్క్ డ్రగ్ పార్కులు వస్తున్నాయన్నారు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్ సిటీ భాగం అవుతుందన్నారు. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ముందుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు శంకుస్థాపనం చేశామని, రాష్ట్రాభివృద్ధిలో రైల్వే జోన్ కీలకం కానుందన్నారు. రైల్వే జోన్ ద్వారా ఏపీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని ప్రధాని చెప్పారు. రైల్వే జోన్ వల్ల వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని ఆకాంక్షించారు. ఏపీలో ఇప్పటికే 7 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. అమృత్ భారత్ కింద ఏపీలోని 70కి పైగా రైల్వేస్టేషన్లు ఆధునికీకరణ చేపట్టామని పేర్కొన్నారు.
అంతకు ముందు సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ఈ వాహనంలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ప్రయాణించారు. రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పూలు జల్లుతూ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.
టాపిక్