Best Web Hosting Provider In India 2024
CM CBN Review: తిరుమలకు సీఎం చంద్రబాబు, బాధితులకు పరామర‌్శించనున్న ముఖ్యమంత్రి
CM CBN Review: తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. తొక్కిసలాట నేపథ్యంలో గురువారం ఉదయం సీఎం తిరుపతి వెళ్లనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు.
CM CBN Review: తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై సిఎం సమీక్షించారు. .ఆంధ్రప్రదేశ్ డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
విశాఖ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, ప్రధాని కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో టీటీడీ విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు…అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని టీటీడీ ఈవోతో పాటు అధికారులను సీఎం ప్రశ్నించారు.
లక్షలాది భక్తులు వచ్చే చోట విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మృతుల సంఖ్య పెరగడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి జిల్లా అధికారులు వివరించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సిఎం ఆదేశించారు.
టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గురువారం ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించనున్నారు.
మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల నేపథ్యంలో తిరుపతిలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచి వేసిందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇటువంటి అవాంచనీయ ఘటనలకు తావీయకుండా టిటిడి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
టీటీడీ ఛైర్మన్ రాజీనామాకు డిమాండ్…
టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు తక్షణం నైతిక బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తొక్కిసలాటలో మృతి చెందిన వారికిఒక్కొక్కరికి 50 లక్షలు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆయా కుటుంబాలలో ఒకరికి టీటీడీ లో ఉద్యోగం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
అధికారుల వైఫల్యమే… టీటీడీ ఛైర్మన్ నాయుడు
తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఈ ఘటనకు అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమే కారణమన్నారు. భవిష్యత్తులో పకడ్బందీగా ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. గురువారం ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారని టీటీడీ చైర్మన్ చెప్పారు. ఈ ఘటన అధికార యంత్రాంగం వైఫల్యమేనని బీఆర్ నాయుడు చెప్పారు.
దుర్ఘటన జరిగిన తీరుపై ముఖ్యమంత్రి టెలి కాన్ఫరెన్స్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచ చేశారని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వివరించారు. ఏర్పాట్లపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారని ప్రశ్నించినట్టు తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి సమీక్షిస్తారని తెలిపారు.
టాపిక్