Best Web Hosting Provider In India 2024
Tirupati Tragedy: తిరుపతి దుర్ఘటనలో విశాఖకు చెందిన ముగ్గురు మహిళల మృతి
Tirupati Tragedy: తిరుపతిలో జరిగిన ఘోర దుర్ఘటన విశాఖలో విషాదాన్ని నింపింది. సమీప బంధువులైన ముగ్గురు మహిళలు టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖ నుంచి బృందంగా వచ్చిన వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి.
Tirupati Tragedy: తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో విశాఖపట్నంకు చెందిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
తిరుపతిలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు విశాఖ వాసులు ఉన్నారు. రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన బృందాలు బుధవారం ఉదయమే తిరుపతికి చేరుకున్నాయి. బుధవారం ఉదయం 5 గంటలకు తిరుపతి చేరుకున్న వీరంతా ఉదయమే బైరాగి పట్టెడలోని రామానాయుడు స్కూల్ ప్రాంగణానికి చేరుకున్నారు.
నర్సీపట్నంకు చెందిన బాబు నాయుడు భార్య, కుమారుడు, కోడలితో కలిసి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చారు. వారి బంధువులు ఇప్పటికే తిరుమలలో ఉన్నారు. బుధవారం రాత్రి క్యూ లైన్లలో భార్య చేయి పట్టుకుని వెళుతున్న క్రమంలో పోలీసులు జనాన్ని నియంత్రించేందుకు పెట్టిన తాళ్లను వదలడంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో బాబు నాయుడు కిందపడి పోవడంతో అతడిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఘటన జరిగిన గంట తర్వాత పోలీసులు సమాచారం అందించినట్టు బాధితురాలు తెలిపింది.
వైకుంఠ దర్శనానికి వచ్చి వైకుంఠం వెళ్లిపోయారు..
తొలిసారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం తాటిచెట్ల పాలెంకు చెందిన లావణ్య స్వాతి, కంచరపాలెంకు చెందిన శాంతి, మద్దెలపాలెంకు చెందిన రజనిలు మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వారంతా బుధవారం ఉదయం నుంచి టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం గేట్లను తెరిచిన సమయంలో తొక్కిసలాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతి చెందిన మహిళలకు చిన్న పిల్లలు ఉన్నారని, వారికి ఏమని చెప్పాలని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. రుయా మార్చురీ వద్ద బంధువుల రోదనలతో హృదయవిదారంగా ఉంది.
ప్రమాదంతో వెంటనే టోకెన్ల జారీ…
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో టీటీడీ అప్రమత్తమైంది. గురువారం తెల్లవారుజాము వరకు వారిని వేచి ఉంచడం సాధ్యం కాదని భావించి అప్పటికప్పుడు టోకెన్ల జారీ ప్రారంభించారు.
భక్తుల రద్దీ పెద్ద ఎత్తున ఉండటంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే టోకెన్ల జారీకి నిర్ణయించారు. భక్తులు భారీగా తరలిరావడంతో టోకెన్ల జారీ ప్రారంభించామని టీటీడీ ఈవో అన్నారు.భక్తుల రద్దీని అదుపు చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. అన్ని కేంద్రాల వద్దకు అదనపు బలగాలను తరలించారు.
ఏర్పాట్లు సరిగా చేయలేదని భక్తుల ఆగ్రహం:
వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు రోడ్లపై గుమికూడకుండా సిబ్బంది పార్కులో ఉంచారు. పద్మావతి పార్కు నుంచి భక్తులను క్యూలైన్లలోకి వదిలారు. భక్తులను క్యూలైన్లలోకి వదిలే సమయంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో తోపులాట జరిగింది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు సరిగా చేయలేదని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద షెడ్లు వేసి భక్తులను ఉంచారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న సీఎం చంద్రబాబు, టీటీడీ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఘటనాస్థలంలో సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్