Best Web Hosting Provider In India 2024
Pesarapappu Payasam: సంక్రాంతికి నైవేద్యంగా పెసరపప్పు పాయసాన్ని సమర్పించండి, ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది
Pesarapappu Payasam: మకర సంక్రాంతికి నైవేద్యంగా స్వీట్లను సమర్పించాల్సిందే. ఇక్కడ మేము పెసరపప్పు పాయసం రెసిపీ ఇచ్చాము. దీన్ని ఫాలో అవ్వండి.
సంక్రాంతి పండుగకు తీపి రుచులు ఉండాల్సిందే. సున్నుండలు, అరిసెలు వంటి వాటితో పాటు పెసరపప్పు పాయసాన్ని కూడా చేయండి. దీన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు. ఎప్పుడూ పరమాన్నం, సేమియా పాయసం వంటివే కాదు పెసరపప్పు పాయసం కూడా చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పు నుంచి వచ్చే సువాసన పాయసానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది. పెసరపప్పు పాయసం టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకోండి.
పెసరపప్పు పాయసం రెసిపీకీ కావలసిన పదార్థాలు
పెసరపప్పు – ఒక కప్పు
బెల్లం తురుము – ఒక కప్పు
నెయ్యి – నాలుగు స్పూన్లు
జీడిపప్పులు – గుప్పెడు
కిస్‌మిస్‌లు – గుప్పెడు
యాలకులు – నాలుగు
కొబ్బరి తురుము – అరకప్పు
పాలు – అర లీటరు
పెసరపప్పు పాయసం రెసిపీ
1. ఇతర పాయసాలతో పోలిస్తే పెసరపప్పు పాయసం చాలా రుచిగా ఉంటుంది.
2. ఇందుకోసం మీరు స్టవ్ మీద కళాయి పెట్టి పెసరపప్పు వేసి అది సువాసన వచ్చేదాకా వేయించాలి.
3. మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఆ పెసరపప్పును తీసి పక్కన పెట్టుకోవాలి.
4. అదే కళాయిలో నెయ్యి వేసి జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు వేసి మరిగించాలి. పాలు మరిగాక అందులో పెసరపప్పు వేసి బాగా ఉడికించాలి.
6. అవసరం అయితే అరకప్పు నీళ్లు కూడా వేయవచ్చు. పెసరపప్పు ఉడకడానికి సమయం తీసుకుంటుంది కాబట్టి నీళ్లను కలిపితేనే మంచిది.
7. అలా నీళ్ళను కలిపిన తర్వాత పెసరపప్పు ఎనభై శాతం ఉడికే వరకు అలా ఉంచండి.
8. తర్వాత బెల్లం తురుమును వేసి బాగా కలపండి.
9. బెల్లం కరిగి ద్రవంలా తయారవుతుంది. అది పాయసంలాగా చిక్కగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికించండి.
10. అందులోనే కొబ్బరి తురుమును, యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపండి.
11. ఈ మిశ్రమం దగ్గరగా పాయసంలాగా అయ్యేవరకు ఉంచండి.
12. ఆ తర్వాత పైన జీడిపప్పులను, కిస్ మిస్‌లను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి.
13. అంతే రుచికరమైన పెసరపప్పు పాయసం రెడీ అయినట్టే. దీన్ని స్వీట్ గా తినవచ్చు లేదా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఎలా చేసినా ఇది మీకు నచ్చడం ఖాయం.
సంక్రాంతి వస్తే అందరూ బెల్లం పరమాన్నం లేదా సేమియా పాయసం వంటివే చేసేందుకు ఇష్టపడతారు. ప్రతిసారి అవే చేయడం వల్ల తినేందుకు ఆసక్తి కలగకపోవచ్చు. కాబట్టి ఒకసారి పెసరపప్పు పాయసాన్ని ప్రయత్నించండి. నెయ్యిని మరి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా రుచి అదిరిపోతుంది. డ్రైఫ్రూట్స్ గా కేవలం జీడిపప్పు, కిస్ మిస్‌లే కాదు పిస్తాలు, బాదం పప్పు, గుమ్మడి గింజలు కూడా వేసుకోవచ్చు. ఎన్ని వేసినా ఈ పాయసం రుచిగా ఉంటుంది. కోవాను కూడా వేసి చేస్తే రుచిగా ఉంటుంది. ఎలా చేసినా ఈ పాయసం అద్భుతంగా ఉండటం ఖాయం.