‘‘చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే’’ 

Best Web Hosting Provider In India 2024

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట

మాజీ మంత్రి ఆర్‌కె రోజా స్పష్టీకరణ

తొక్కిసలాట ఘటనలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు

క్రిమినల్‌ కేసులు కాకుండా ప్రమాదవశాత్తు జరిగినట్టు ఎఫ్‌ఐఆర్‌ 

బీఎన్‌ఎస్‌–105 సెక్షన్‌ కింద కాకుండా 194 కింద కేసులు నమోదు

మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆక్షేపణ

ఘటనలపై పూర్తి పారదర్శకంగా దర్యాప్తు చేయాలి

నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

తొక్కిసలాట నిందితులకు శిక్ష పడేదాకా వదిలే ప్రసక్తే లేదు

మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన మాజీ మంత్రి ఆర్‌కె రోజా

తాడేపల్లి: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులేన‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తిరుపతిలో తొక్కిసలాట జ‌రిగింద‌ని, గతంలో కూడా చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింద‌ని పేర్కొన్నారు.  గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో రోజా మీడియాతో మాట్లాడారు. 

సినిమా ఈవెంట్ల‌పై ఉన్న శ్ర‌ద్ధ‌..భ‌క్తుల ప‌ట్ల లేదు

తిరుపతి తొక్కిసలాట ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనపడుతున్నా, ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా తక్కువ చేసి చూపి, చేతులు దులిపేసుకునే కుట్ర జరుగుతోందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆక్షేపించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజుల స్వామి వారి దర్శనం కోసం లక్షలాది భక్తులు తరలి వస్తారని తెలిసినా, టోకెన్ల జారీలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తొక్కిసలాటలు జరిగాయని ఆమె వెల్లడించారు. గేమ్‌ చేంజర్‌ ఈమెంట్‌ నిర్వహణలో ఉన్న చిత్తశుద్ధి కూడా భక్తుల విషయంలో ఈ ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా నమోదు చేసిన బీఎన్‌ఎస్‌–194 సెక్షన్‌ను మార్చి బీఎన్‌ఎస్‌–105 కింద కేసులు నమోదు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రోజా డిమాండ్‌ చేశారు.

భక్తుల భద్రత గాలికొదిలేశారు

చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా తొక్కిసలాట ఘటనలు జరిగి అమాయకులు చనిపోవడం ఆనవాయితీగా మారింది. గతంలో గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోగా, ఇప్పుడు తిరుపతిలో ఆరుగురు బలయ్యారు. తిరుపతి తొక్కిసలాట ఘటనతో చంద్రబాబు అసమర్థ పాలన మరోసారి బహిర్గతమైంది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాల్సింది పోయి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. తాను తప్పించుకునేందుకు అధికారుల నిర్లక్ష్యమంటూ చంద్రబాబు తేలిగ్గా కొట్టి పారేస్తున్నారు.  ఆలయానికి వచ్చే భక్తుల పట్ల గౌరవం, ప్రేమ లేనివారిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులుగా నియమించారు. కలెక్టర్, ఎస్పీ సైతం ఈ ఘటనకు బాధ్యత వహించాలి. కుప్పంలో చంద్రబాబు పర్యటనలో తిరుపతి, చిత్తూరు జిల్లాల  అధికారులంతా ఆయన చుట్టూనే తిరగడానికే సరిపోయింది. ప్రజా పాలనను గాలికొదిలేసిన కారణంగానే ఈ దుర్ఘటన జరిగింది.  వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం కోరుతూ, టోకెన్ల కోసం వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలన్న కనీస ఇంగితం ప్రభుత్వానికి లేదు. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిల్చున్న వారికి భోజనాలు, నీరు వంటి కనీస సదుపాయాలు కల్పించలేదు. చివరకు పిల్లలకు పాలు కూడా సరఫరా చేయలేదు.  తిరుపతిలో తొక్కిసలాట ఘటనలకు సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి, టీటీడీ ఛైర్మన్‌తో పాటు, పాలక మండలి బాధ్యత వహించాలి. 

వారందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

హైదరాబాద్‌లో పుష్ప సినిమా బెనిఫిట్‌షోకు హీరో అల్లు అర్జున్‌ వచ్చిన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే దానికి అల్లు అర్జున్‌ని బాధ్యుడ్ని చేస్తూ బీఎన్‌ఎస్‌–105 సెక్షన్‌ కింద కేసు పెట్టడం జరిగింది. ఆయనకు సంబంధం లేకుండా జరిగిన తోపులాటపై అంత సీరియస్‌గా తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. అలాగే తిరుపతి తొక్కిసలాటల ఘటనలపై ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్‌గా స్పందించాలి. కానీ, తొక్కిసలాట ఘటనలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలిస్తే.. 105 సెక్షన్‌ కింద కేసులు పెట్టాల్సి ఉంటే.. 194 బీఎఎన్‌ఎస్‌ కేసులు పెట్టి ప్రమాదవశాత్తు జరిగిందంటూ చేతులు కడిగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే ఆ దర్శనం టోకెన్ల కోసం వచ్చే భక్తులకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి. ఇందుకోసం జిల్లా కలెక్టర్, ఎస్పీ, టీటీడీ ఛైర్మన్, పాలకమండలి పరస్పర సహకారంతో చేయాల్సిన కార్యక్రమాన్ని నిర్లక్ష్యంతో గాలికొదిలేశారు. ఇదే భక్తుల మరణానికి కారణమైంది.  ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే 194 బీఎఎన్‌ఎస్‌ కేసులు పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. 

ఆ పెద్దలంతా బ‌య‌ట‌కు రావాలి
హైందవ శంఖారావం నిర్వహించిన పెద్దలంతా ఇప్పుడు బయటకు రావాలి. బాధితుల కుబుంబాలతో మాట్లాడాలి. బాధ్యులపై చర్యలు తీసుకునే దాకా పోరాడాలని రోజా విజ్ఞప్తి చేశారు.  తిరుమల లడ్డూ మీద తప్పుడు ప్రచారం జరిగినప్పుడు రైళ్లలో చిడతలు వాయించుకుంటూ వచ్చి హడావుడి చేసిన మాధవీలత వంటి వారు ఇప్పుడెందుకు స్పందించడం లేదని ప్ర‌శ్నించారు. శాంతి భద్రతలపై అవగాహన, శాఖ మీద పట్టులేని వారిని హోం మంత్రిగా నియమిస్తే ఏం జరుగుతోందో చెప్పడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే ఉదాహరణ అన్నారు. గేమ్‌ ఛేంజర్‌ సినిమా ఈవెంట్‌ నిర్వహణలో పెట్టిన చిత్తశుద్ది కూడా భక్తుల భద్రతపై అధికారులు పెట్టలేదు.  సనాతనవాదిగా చెప్పుకునే పవన్‌కళ్యాణ్‌ దీనికి ఏం ప్రాయశ్చిత్తం చేస్తారో చెప్పాలి. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాల‌ని ఆమె డిమాండు చేశారు.  ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పడానికి సెక్షన్‌–194 బీఎఎన్‌ఎస్‌ కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేద‌ని ఆర్కే రోజా హెచ్చ‌రించారు.  తప్పు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టేదాకా బాధితుల పక్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతోంది. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.

నిందితులకు శిక్ష పడాలి

ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల పవిత్రతను కాపాడుకునేలా,  నిందితులకు శిక్ష పడేలా హైందవ శంఖారావం నిర్వాహకులు గట్టి ప్రయత్నం చేయాలి. ఈ ఘటనకు ప్రధాన కారకుడు తిరుమల జేఈవో వెంకన్న చౌదరి. ఆయన టీటీడీని టీడీపీ కార్యాలయంగా మార్చేశారు. దేవుని మీద భక్తి లేని వ్యక్తిని తెచ్చి చైర్మన్‌ చేసి భక్తుల భద్రతను గాలికొదిలేశారు.  గతంలో వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో టీటీడీ చైర్మన్‌లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి అద్భుతంగా పని చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏడాది కూడా కాకుండానే తిరుమల పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ఆర్‌కె రోజా తెలిపారు.

Best Web Hosting Provider In India 2024