Best Web Hosting Provider In India 2024
Nagarjuna Diet: నాగార్జున డైట్ సీక్రెట్స్ ఇవే, ఆయనలా మీరూ తింటే బరువు పెరగరు
Nagarjuna Diet: నాగార్జున 65 ఏళ్ల వయసులో కూడా బరువు పెరగకుండా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. అతడి వయసు 65 ఏళ్లంటే ఎవరూ నమ్మలేరు. నాగార్జున డైట్ సీక్రెట్స్ ను ఒక ఇంటర్య్వూలో వివరించారు.
నాగార్జునకు 65 ఏళ్లు నిండిపోయాయి. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారాయన. అందరూ హీరోలు బరువు పెరిగారు కానీ నాగార్జున మాత్రం అదే ఫిజిక్‌తో, ఫిట్‌నెస్‌తో ఉన్నారు. అందుకే అమ్మాయిలకు నాగార్జున కలల రాకుమారిడుగా మారిపోయాడు. ఆడవాళ్లు ఆయనను మన్మధుడు అని పిలుచుకుంటారు. ఈ సీనియర్ నటుడు ఆరోగ్యకరమైన జీవన శైలి, ఫిట్నెస్ గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపిస్తారు.
నాగార్జున డైట్ సీక్రెట్స్
తాజాగా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున తన డైట్ సీక్రెట్స్, ఫిట్ నెస్ గురించి వివరించారు. ఆయన వారంలో ఐదారు రోజులు ఉదయం దాదాపు గంట పాటు వ్యాయామం చేస్తానని, అందులో ముఖ్యంగా కార్డియో వ్యాయమాలు చేస్తానని చెప్పారు. ఫిట్ బాడీని, మంచి మైండ్ ను మెయింటైన్ చేయడానికి స్విమ్మింగ్, గోల్ఫ్ ఆడటం వంటి వ్యాయామాలు చేస్తానని ఆయన వివరించారు.
సెలబ్రిటీల్లో హీరో అయినప్పట్నించి ఫిజిక్‌ను ఒకేలా మెయింటైన్ చేసినవారిలో నాగార్జున ఒకరు. ఆయన వ్యాయామం, నడక, రన్నింగ్ వంటివి సీరియస్ గా తీసుకుంటారు. ఎక్సర్ సైజ్‌ను అంకితభావంతో చేస్తారు. నాగార్జున 65 సంవత్సరాల వయసులో కూడా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా అతను అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తన ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ ” గత ముప్పై ఏళ్లుగా కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ కలిసి చేస్తున్నాను, కాబట్టి ఇది స్థిరత్వానికి సంబంధించినది. నేను రోజంతా చురుకుగా ఉంటాను, జిమ్ కు వెళ్లలేకపోతే నడక, స్విమ్మింగ్ కు వెళతాను” అని చెప్పారు.
ప్రతిరోజూ ఒక గంట పాటూ
చాలా మంది వ్యాయామాన్ని దాటవేయడానికి ఎల్లప్పుడూ ఒక సాకు కోసం వెతుకుతూ ఉంటారని నాగార్జున చెప్పారు. కానీ మంచి రిజల్ట్ చూడాలంటే సమయం, శ్రమ ఖర్చు పెట్టాల్సిందేనని అభిప్రాయపడ్డారు. వర్కవుట్స్ చేయడం వల్ల తనకు మంచి బెనిఫిట్స్ దక్కాయని చెప్పారు. వారానికి ఐదు రోజులు, వీలైతే ఆరు రోజులు కచ్చితంగా వర్కవుట్ చేస్తానని అన్నారు. ఉదయం ఒక గంట వ్యాయామానికే కేటాయిస్తారు నాగార్జున.
బరువు పెరగకుండా ఉండేందుకు ఎక్కువ క్యాలరీలు బర్న్ చేసే వ్యాయామాలు ఎంచుకోవాలని నాగార్జున చెబుతున్నారు. కార్డియో లేదా స్ట్రెంత్ ఎక్సర్ సైజులు చేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవద్దని, కూర్చోవద్దని, ఫోన్లు తీసుకెళ్లవద్దని సూచించారు. మీ శరీరానికి ప్రతిరోజూ ఒక గంట నుండి 45 నిమిషాలు వ్యాయామాన్ని ఇవ్వండి. తగనింత నిద్రపోవడం, ఎక్కువ నీళ్లు తాగడం మర్చిపోవద్దని చెప్పారు.
నాగార్జున తన ఎనర్జీ లెవల్స్ తో పాటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారాన్ని తీసుకుంటారు. “కొన్నేళ్లుగా నా ఆహారం బాగా మారిపోయింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆహార పద్ధతులు మార్చుకోవడం తప్పదు’ అని చెప్పారు. ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్, లంచ్ , డిన్నర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. రాత్రి 7 లేదా 7.30 గంటలకు డిన్నర్ పూర్తి చేయాలని అదే ఆరోగ్యకరమైని అన్నారు.
పన్నెండు గంటలు ఉపవాసం
12:12 నిష్పత్తిలో ఉపవాస పద్ధతిని (అక్కడ 12 గంటలు తిని, ఆపై 12 గంటలు ఉపవాసం) పాటిస్తారు నాగార్జున. అంటే ప్రతి భోజనానికి మధ్య 12 గంటల సమయం గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. నాగార్జున అడపాదడపా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఆయన రాత్రి డిన్నర్ తిన్నాక మరుసటి రోజు వరకు మధ్యలో 12 గంటల పాటూ ఏమీ తినకుండా ఉంటారు.
చీట్ మీల్స్ తింటారా?
ఎంతగా డైట్ చేసినా అప్పుడప్పుడు చీట్ మీల్స్ తింటూ ఉంటారు ఎంతోమంది. అలాగే నాగార్జున కూడా చీట్ మీల్స్ అప్పుడప్పుడు తింటానని చెబుతున్నారు. వారంలో ఆరు రోజులు వ్యాయామం, డైట్ చేసే నాగార్జున ఆదివారం మాత్రం తనకు ఇష్టమైన ఆహారాన్ని తింటారు. హైదరాబాదీ ఫుడ్, బిర్యానీకి వీరాభిమాని అయిన ఈయనకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఆదివారం కచ్చితంగా వీటిని తింటారు.
ఉదయం ఏం తింటారు?
తన మార్నింగ్ రొటీన్ గురించి నాగార్జున మాట్లాడుతూ “కిమ్చి, సౌర్క్రాట్, పులియబెట్టిన క్యాబేజీ వంటి కొన్ని సహజ ప్రోబయోటిక్స్ నా వద్ద ఉన్నాయి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు, కాఫీ తాగి వర్కవుట్స్ చేస్తాను’ అని ఆయన చెప్పారు.
శారీరక, మానసిక శ్రేయస్సుకు చురుకుగా, ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం అని నటుడు నాగార్జున అభిప్రాయపడ్డారు. గోల్ఫ్ ఆడటం అతని మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. మెంటల్ క్లారిటీ కోసం గోల్ఫ్ ఆడతానని, దీని వల్ల ఏకాగ్రత స్థాయి కూడా పెరుగుతుందని నాగ్ తెలిపారు.
మానసిక, శారీరక ఆరోగ్యం కోసం స్విమ్మింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం అని ఈ నటుడు చెప్పాడు. యవ్వనంగా కనిపించడానికి స్విమ్మింగ్ ఒక కారణమని చెప్పారు. తాను 14, 15 ఏళ్ల వయసు నుంచే స్విమ్మింగ్ చేస్తున్నానని, కాబట్టి తన జీవితంలో భాగం అయిపోయిందని తెలిపారు.