Best Web Hosting Provider In India 2024
తిరుమతి తొక్కిసలాట ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే
ఎఫ్‌ఐఆర్‌లు బీఎన్‌ఎస్–105 సెక్షన్ లోకి మార్చాలి
వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ డిమాండు
తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలకు బదులుగా రూ.కోటి ఇవ్వాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, లిడ్‌క్యాప్ మాజీ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో నమోదు చేసిన కేసులను బీఎన్‌ఎస్–105 సెక్షన్‌లోకి మార్చకపోతే ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. తొక్కిసలాట ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారని ఆక్షేపించారు.గురువారం ఆయన వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
టీటీడీ చరిత్రలో చీకటి రోజు
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదం. గతంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి దినమని రాజశేఖర్ ఆక్షేపించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయాలకు వాడుకోవడంతో పాటు, టీటీడీ బాధ్యతలను రాజకీయ కారణాలతో వివాదాస్పదమైన వ్యక్తుల చేతుల్లో పెట్టింది. బాధ్యతలు తీసుకున్న వారు భక్తుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఈ దారుణమైన తొక్కిసలాట ఘటన చోటుచేసుకుందన్నారు. గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి పని చేసినప్పుడు భక్తులు చాలా ప్రశాంతంగా దర్శనాలు చేసుకుని వెళ్లారు. టీటీడీ గొప్పతనాన్ని ఇనుమడింపజేసేలా వారు సేవలందించారు.
టీటీడీని టీడీపీ కార్యాలయంగా మార్చారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీని టీడీపీ కార్యాలయంగా మార్చేశారు. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత భక్తులకు ఏర్పాట్లు చేయడానికి ఇవ్వలేదని రాజశేఖర్ విమర్శించారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా పర్యవేక్షణ బాధ్యతలు డీఎస్పీ స్థాయి అధికారికివ్వడం బట్టి చూస్తే భక్తుల రక్షణపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అర్థమవుతుంది. స్థానిక ఎస్పీ చంద్రబాబు తొత్తుగా మారి ఆయన సేవలోనే నిమగ్నమయ్యారు. టికెట్ల కోసం వచ్చే భక్తుల భద్రతను ఆయన గాలికొదిలేశారని మండిపడ్డారు.
చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా దారుణాలు:
చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా ఇలాంటి ఘటనలు జరగడం ఆనవాయితీగా మారింది. అతివృష్టి, అనావృష్టి అనేది కూడా అతి సహజంగా మారిపోయింది. గతంలోనూ చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. గతంలో చంద్రబాబు సభలో ఇలాంటి తొక్కిసలాటలు జరిగి కందుకూరులో 9 మంది, గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బుడమేరు వరదల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
బీఎన్‌ఎస్–105 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలి:
తిరుపతి తొక్కిసలాటలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతున్నా ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు బీఎన్‌ఎస్–194 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారు. ఈ ప్రమాదంలో బీఎన్‌ఎస్–105 కింద కేసులు నమోదు చేయాలని రాజశేఖర్ డిమాండ్ చేశారు. సనాతన ధర్మం గురించి ఉపన్యాసాలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, భక్తులకు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. సనాతన ధర్మం నినాదం రాజకీయ ప్రయోజనాల వరకేనా? భక్తుల ప్రాణాలు పోతుంటే పవన్‌కళ్యాణ్ పట్టించుకోరా?. ఈ ఘటనకు సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్, ఉన్నతాధికారులు, కలెక్టర్, ఎస్పీ పూర్తి బాధ్యత వహించాలి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
పరిహారాన్ని కోటికి పెంచాలి:
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని రూ.కోటికి పెంచాలి. గతంలోనూ మా ప్రభుత్వ హయాంలో ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు రూ.కోటి పరిహారం అందజేసి వారి కుటుంబాలను ఆదుకున్నాం. మానవతా దృక్పథంతో ఆలోచించి అంతకన్నా ఎక్కువ ఇచ్చినా సంతోషం. బీఎన్‌ఎస్–194 సెక్షన్ కింద పెట్టిన కేసులను మార్చి బీఎన్‌ఎస్–105 కి మార్చాలి. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధితుల పక్షాన వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని కాకుమాను రాజశేఖర్ పేర్కొన్నారు.