Best Web Hosting Provider In India 2024
Kakarakaya Gravy: చేదు లేకుండా కాకరకాయ ఇగురు ఇలా వండేయండి, మధుమేహులకు బెస్ట్ కర్రీ
Kakarakaya Gravy: మధుమేహం కోసం ఇక్కడ చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చెప్పాము. దీన్ని ఇగురులా చేయాలంటే ఇక్కడ చెప్ప
డయాబెటిస్ ఉన్నవారే కాదు లేని వారు కూడా కాకరకాయను తింటే ఎంతో ఆరోగ్యం. కానీ దాని చేదుకు భయపడి ఎవరూ దానితో కూరలు వండేందుకు ఇష్టపడరు. ఇక్కడ మేము చేదు లేకుండా కాకరకాయ ఇగురు ఎలా వండాలో ఇచ్చాము. ఒక్కసారి ఇలా వండి చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. కాకరకాయలో ఉండే పోషకాలు శరీరానికి అందాలంటే ఇలా ఇగురు కూరలా వండుకొని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. దీని రెసిపీ చాలా సులువు.
కాకరకాయ ఇగురు కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
కాకరకాయలు – అరకిలో
మినప్పప్పు – ఒక స్పూను
పచ్చి శనగపప్పు – ఒక స్పూను
ధనియాలు – ఒక స్పూను
వేరుశెనగ పలుకులు – గుప్పెడు
జీలకర్ర – అర స్పూను
జీడిపప్పులు – ఐదు
ఎండుమిర్చి – ఆరు
వెల్లుల్లి రెబ్బలు – ఎనిమిది
కరివేపాకులు – గుప్పెడు
నూనె – రెండు స్పూన్లు
పసుపు – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయలు – రెండు
టమోటో – ఒకటి
కారం – ఒక స్పూను
చింతపండు – ఉసిరికాయ సైజులో
కాకరకాయ ఇగురు కూర రెసిపీ
1. తాజా కాకరకాయలను తీసుకొని గుండ్రంగా చక్రాల్లాగా పలుచగా కోసుకోవాలి.
2. వాటిని గిన్నెలో వేసి నీళ్లు వేయాలి. ఆ నీళ్లలో చిటికెడు పసుపు, అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి.
3. ఆ కాకరకాయలను అలా కాసేపు ఉంచేయాలి. 10 నిమిషాల తర్వాత కాకరకాయలను చేత్తోనే పిండి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశెనగ పలుకులు, పచ్చి శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీడిపప్పు వేసి వేయించాలి.
5. అవి కాస్త వేగాక ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
6. వీటి మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నూనె వేయాలి.
8. ఆ నూనెలో కాకరకాయలను వేసి వేయించాలి.
9. చిటికెడు పసుపు, అర స్పూను ఉప్పు కూడా వేసి వేయించాలి.
10. తర్వాత ఆ కాకరకాయ ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.
11. ఇప్పుడు మిగిలిన నూనెలో ఉల్లిపాయల తరుగును వేసి బాగా వేయించుకోవాలి.
12. ఉల్లిపాయల రంగు మారేవరకు వేయించాలి. తరువాత టమాటో తరుగును వేసి బాగా వేయించుకోవాలి.
13. మూత తీసి రుచికి సరిపడా ఉప్పును కారాన్ని వేసి బాగా వేయించాలి.
14. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
15. అందులోనే కాకరకాయ ముక్కలను కూడా వేసి కలపాలి.
16. ఈలోపు చింతపండును నానబెట్టి ఆ నీటిని కూడా తీసి ఈ కూరలో వేయాలి. పచ్చిమిర్చిని నిలువుగా తరిగి ఇందులో వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
17. చిన్న మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి.
18. ఆ తర్వాత మూత తీసి ఇగురులాగా అయిందో లేదో చూసుకోవాలి.
19. అది ఇగురులా అయ్యే వరకు ఉంచి పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ కాకరకాయ ఇగురు రెడీ అయినట్టే.
కాకరకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేదుగా ఉంటాయని తినడం మానేస్తే మనం ఎన్నో పోషకాలను కోల్పోతాము. మధుమేహులు కాకరకాయలను తినటం చాలా ముఖ్యం. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో ఉప్పును కాస్త తగ్గించి మధుమేహలు కూరను తినేందుకు ప్రయత్నించండి. ఇది సాధారణ వ్యక్తులు కూడా చాలా బాగా నచ్చుతుంది. నోరూరిపోయేలా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ ఇగురుని చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ప్రయత్నించండి.