Best Web Hosting Provider In India 2024
Tirupati Stampede Incident : ‘తిరుపతిలో తప్పు జరిగింది… ప్రజలకు క్షమాపణలు’ – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Tirupati Stampede Incident Updates: తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు జరిగిందని… బాధ్యత తీసుకుంటున్నామని చెప్పారు. శ్రీవారి భక్తులతో పాటు ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో తప్పు జరిగింది, ప్రజలు క్షమించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ మాట చెబుతున్నానని అన్నారు. జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని చెప్పారు.
తప్పించుకోవటం లేదు – పవన్ కల్యాణ్
ఈ ఘటనకు పూర్తి బాధ్యత తీసుకుంటున్నామని.. తప్పించుకోవటం లేదని పవన్ చెప్పుకొచ్చారు. ప్రజలకు, వేంకటేశ్వర స్వామి భక్తులందరికీ, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు.
గురువారం తిరుపతిలో పర్యటించిన పవన్… తొక్కిసలాట ఘటనాస్థలిని పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… “పోలీసులని పెట్టారు, టీటీడీ సిబ్బంది ఉన్నారు. ఇంతమంది సిబ్బంది ఉండి కూడా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, 24 మంది క్షతగాత్రులు అవడం ఆవేదన కలిగించింది. కచ్చితమైన చర్యలు ఉంటాయి. బాధిత కుటుంబాలతో మాట్లాడుతుంటే వారు చెప్తున్నారు. ఎంతో నమ్మకంతో వచ్చాము, మాకు ఇలా అయ్యింది అని. ముందు వారికి పేరుపేరునా క్షమాపణలు తెలియజేశాను. ఇందుకు బాధ్యులైన వారికి కచ్చితమైన చర్యలు ఉంటాయి” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
“పోలీసుల్లో సాయం చేసినవారు ఉన్నారు, జనం నలిగిపోతుంటే రక్షించిన పోలీసులు ఉన్నారు. చోద్యం చూస్తూ నిలబడ్డ వారూ ఉన్నారు. అన్నీ నా దృష్టికి వచ్చాయి. ఈ రోజున సంఘటనకి నేను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదాలో తప్పు జరగలేదు అని తప్పించుకోవట్లేదు. తప్పు జరిగింది, బాధ్యత వహిస్తున్నాం” అని పవన్ స్పష్టం చేశారు.
పోలీసులపై ఆగ్రహం…
తిరుపతి పర్యటన సందర్భంగా అభిమానులు, పోలీసులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించరా అంటూ ఫైర్ అయ్యారు. తొక్కిసలాట జరిగినా ఇప్పుడు కూడా పోలీసులు జనాలను కంట్రోల్ చేయలేరా? అని అసహనం వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్