Best Web Hosting Provider In India 2024
Bandi Sanjay: ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలి: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
Bandi Sanjay: ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫీజు బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్ పద్ధతిలో క్లియర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం సిగ్గు చేటన్నారు.
Bandi Sanjay: ఓ వైపు ‘ఆరోగ్యశ్రీ’ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం అసలు బిల్లులే చెల్లించకుండా, ఆరోగ్యశ్రీ సేవలే ప్రజలకు అందకుండా చేస్తుండటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని, లేనిచో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థులు పేదలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తు సీఎంకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు.
సంజయ్ లేఖ సారాంశం….
విద్య, వైద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, నిర్లక్ష్య ధోరణి కోట్లాది మంది తెలంగాణ ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పేద కుటుంబాల ఆరోగ్యానికి, ఉన్నత విద్యకు భరోసాగా నిలిచిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల పూర్తిగా నీరుకారిపోతున్నాయి.
నెలల తరబడి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఈనెల 10 నుండి రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ‘ఆరోగ్యశ్రీ’ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు విడుదల చేసిన ప్రకటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది పేద ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం బాధాకరం.
నాడు బిఆర్ఎస్…నేడు కాంగ్రెస్..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి దాదాపు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పాలకులు సైతం ఏనాడూ ఆరోగ్య శ్రీ పథకాన్ని సక్రమంగా అమలు చేసిన దాఖలాల్లేవు. బకాయిలు చెల్లించకుండా పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందకుండా చేస్తూ ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారు. ఓ వైపు ‘ఆరోగ్యశ్రీ’ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణకు వచ్చేసరికి అసలు బిల్లులే చెల్లించకుండా ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
పేదలకు ప్రైవేట్ వైద్యం అందకుండా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించడంతోపాటు ఆరోగ్యశ్రీ సేవలను విస్త్రతం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగలో తొక్కుతున్నారు. మీ ఏడాది పాలనలో దాదాపు రూ.1000 కోట్ల మేరకు ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు నెట్ వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి.
ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించిన ధరతో పోలిస్తే సగానికంటే సగం తక్కువ ధరకే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఆ బిల్లులను కూడా నెలల తరబడి చేయకపోవడంతో సిబ్బందికి వేతనాలు, మెయింటెనెన్స్ ఛార్జీలు, ప్రభుత్వ పన్నులు చెల్లించలేక పోతున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు వాపోతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలందించేందుకు నిరాకరిస్తున్నాయి. మీ చేతగానితనం, నిర్లక్ష్యం ఫలితంగా సకాలంలో వైద్యం అందక, ఆపరేషన్లు నిర్వహించకపోవడంతో రాష్ట్రంలో అనేక మంది రోగులు మృత్యువాత పడుతున్న సంఘటనలు తీవ్రంగా కలిచివేస్తున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి రూ.ఏడు వేల కోట్లు…
రాష్ట్రంలో ఇంటర్ నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మ సీ, నర్సింగ్ వంటి కోర్సులను చదువుతున్న దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు. కానీ గత బీఆర్ఎస్ పాలకులు కానీ, ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను విడుదల చేయకపోవడంవల్ల దాదాపు రూ.7వేల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి.
బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యం కారణంగా కాలేజీల నిర్వహణ భారమై రాష్ట్రవ్యాప్తంగా వందలాది కాలేజీలు మూసివేతకు సిద్దంగా ఉన్నాయి. తమ కాలేజీలు నడవాలంటే ఫీజు రీయంబర్స్ మెంట్ భారాన్ని విద్యార్థులే మోయాలని, లేనిపక్షంలో సర్టిఫికెట్లు ఇవ్వబోమని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఫీజులు చెల్లించే స్తోమత లేక లక్షలాది మంది విద్యార్థులు అల్లాడుతున్నారు.
కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో పై చదువులకు వెళ్లలేక కొందరు, ఉద్యోగాలకు నోచుకోక మరికొందరు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నా ప్రభుత్వానికి పట్టించుకోకపోవడం దారుణం. ఫీజు రీయంబర్స్ మెంట్ పెండింగ్ బిల్లుల్లో సుమారు రూ.380 కోట్ల మేరకు చెల్లిస్తామని గత ఏడాది నవంబరులో టోకెన్లను జారీ చేసినా వీటికి సంబంధించిన చెల్లింపులను నేటికీ చేయకపోవడం సిగ్గు చేటు.
పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్ పద్ధతిలో క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వస్తున్న వార్తలను చూసి విస్మయం కలుగుతోంది. అవేమైనా బ్యాంకు లోన్లా? వడ్డీలతో కలిపి బకాయిలు పెరిగిపోతే వన్ టైం సెటిల్ మెంట్ చేసుకోవడానికి? ఇవ్వాల్సిన సొమ్మును సకాలంలో చెల్లించకపోవడమే కాకుండా… అందులోనూ కోత విధిస్తామని చెప్పడం దుర్మార్గం.
ప్రభుత్వం స్పందించకుంటే సీరియస్ పరిణామాలు..
ప్రజలకు సరైన విద్య, వైద్య సేవలు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఆ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నట్లు స్పష్టం కన్పస్తోంది. ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల విలువ రూ.8వేల కోట్ల లోపే. 2 లక్షల 75 వేల కోట్ల రూపాయల బడ్జెట్ రూపొందించిన మీకు అందులో నుండి రూ.8 వేల కోట్లు చెల్లించి లక్షలాది మంది రోగులను, విద్యార్థులను ఆదుకోలేరా? విదేశీ పర్యటనలు, ఢిల్లీ పర్యటనలు, మూసీ పునరుజ్జీవం, ఫోర్త్ సిటీ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న మీకు రూ.8 వేల కోట్లు చెల్లించేందుకు మనసు రాకపోవడం శోచనీయం..
తక్షణమే ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులతో, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశమై ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి నాయకత్వంలో విద్యార్థుల, పేదలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్ధమని, తద్వారా జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్