Best Web Hosting Provider In India 2024
Game Changer Review: గేమ్ ఛేంజర్ రివ్యూ: రామ్‍చరణ్ పొలిటికల్ సినిమా మెప్పించిందా? శంకర్ మార్క్ చూపించారా?
Game Changer Review: రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో మంచి అంచనాలతో ఈ పొలిటికల్ మూవీ నేడు రిలీజ్ అయింది. ఈ సినిమా మెప్పించేలా ఉందా.. హైప్‍ను నిలబెట్టుకుందా అనేది ఇక్కడ రివ్యూ చూడండి.
సినిమా: గేమ్ ఛేంజర్, విడుదల తేదీ: జనవరి 10, 2025
ప్రధాన నటీనటులు: రామ్‍చరణ్, కియారా అడ్వానీ, అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, సునీల్, జయరాం, నవీన్ చంద్ర తదితరులు
సంగీత దర్శకుడు: థమన్, సినిమాటోగ్రఫీ: తిరునావక్కరుసు, ఎడిటింగ్: సమీర్ మహమ్మద్, రూబెన్
నిర్మాతలు: దిల్‍రాజు, శిరీష్, నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
దర్శకుడు: ఎస్.శంకర్
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ నేడు థియేటర్లలో రిలీజైంది. ఆలస్యాలతో సుమారు నాలుగేళ్లు షూటింగ్ సాగుతూ వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చెర్రీ సోలో హీరోగా దాదాపు ఐదేళ్ల తర్వాత మూవీ రావడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న చరణ్.. పాన్ ఇండియా మరోసారి స్టార్ డమ్ నిరూపించుకునేందుకు బరిలోకి దిగాడు. చాలా ఏళ్లుగా తన స్థాయి విజయం లేని దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ గేమ్ ఛేంజర్ మూవీతో తన పూర్వవైభవం చూపిస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి గేమ్ ఛేంజర్ చిత్రం ఆకట్టుకునేలా ఉందా.. శంకర్ మళ్లీ తన మార్క్ చూపించారా.. ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.
కథ
ఐపీఎస్ ఆఫీసర్ రామ్‍నందన్ (రామ్‍చరణ్).. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్ అవుతాడు. కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అవినీతి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాడు. దౌర్జన్యాలు, అవినీతి మానేయాలని రౌడీలు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు. అలాగే దీపక (కియారా అడ్వానీ)తో రామ్‍కు బ్రేకప్ అయి ఉంటుంది. ఇద్దరు మళ్లీ ఎదురుపడతారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉండే బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్).. అధికారంలో చివరి సంవత్సరం అందరూ నిజాయితీగా ఉండాలని, అవినీతి మానేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తాడు. ఒకప్పుడు తాను అప్పన్న (రామ్‍చరణ్)కు చేసిన వెన్నుపోటును, అన్యాయాన్ని తలచుకొని పశ్చాత్తాపడుతుంటాడు. తండ్రి ఉన్న సీఎం సీటుపైనే ఆశలు పెట్టుకున్న మంత్రి బొబ్బిలి మోపిదేవి (ఎస్‍జే సూర్య)కు ఇది నచ్చదు. ఇంకోవైపు కలెక్టర్ రామ్‍నందన్ కూడా మోపిదేవి దందాలను ఆపేందుకు టార్గెట్ చేస్తాడు. తన కుట్రలతో సీఎం సీటు దక్కించుకున్న మోపిదేవిని రామ్‍నందన్ అడ్డుకుంటాడు. ఈ తరుణంలో సత్యమూర్తి చివరి కోరికతో ఓ భారీ ట్విస్ట్ ఎదురువుతుంది. రామ్ నందన్ గతం గురించి రివీల్ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి. మోపిదేవిని రామ్‍నందన్ ఎలా అడ్డుకున్నాడు? అతడి గతం ఏంటి? అప్పన్న, పార్వతి (అంజలి) చేసిన పోరాటం ఏంటి.. వారికి ఏమైంది? రామ్‍తో వారికి ఉన్న సంబంధం ఏంటి? ఎన్నికలు ఎలా సాగాయి? అప్పన్న ఆశయాలను రామ్ పూర్తి చేశాడా? అనేవి గేమ్ ఛేంజర్ సినిమాలో ఉన్నాయి.
కథా విశ్లేషణ: కొత్తదనం కొరవడినా.. కొన్ని మెరుపులు
రోబో తర్వాత దర్శకుడు శంకర్ వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత మూవీ ఇండియన్ 2 విషయంలో తీవ్రంగా నిరాశపరిచారు. కథా బలం లేకపోవటంతో శంకర్ చిత్రాలు ఇటీవలి కాలంలో ఆకట్టుకోలేకపోయాయి. గేమ్ ఛేంజర్ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథ అందించడం ఆసక్తిని రేకెత్తించింది. ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ పెరిగింది. అయితే, ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజ్ మరీ కొత్తదనంతో కథను అందించలేదు. అవినీతిని ఐఏఎస్ అధికారి అడ్డుకోవడం.. సీఎం సీటు కోసం అతడి కొడుకు కుట్రలు పన్నడం.. రాజకీయ ఎత్తులు.. ఆదర్శాలను నమ్మిన వ్యక్తిని నమ్మిన వారే వెన్నుపోటు పొడవడం, అన్యాయం చేసిన వారికి అతడి వారసుడు దెబ్బ తీయడం చుట్టూ కథ సాగుతుంది. అయితే, ఈ కథలో అక్కడక్కడా మెరుపులను జోడించారు సుబ్బరాజ్. ఇంటర్వెల్‍లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. కథలో మరిన్ని మలుపులు కూడా ఇంట్రెస్టింగ్‍గా ఉంటాయి. కథ మరీ కొత్తది కాకపోయినా ఓకే అనేలానే ఉంది.
కథనం ఇలా..
రొటీన్‍గా మొదలు.. మెప్పించిన మాస్ యాక్షన్: ఈ సినిమా కథనాన్ని రొటీన్‍గానే మొదలుపెట్టారు దర్శకుడు శంకర్. కాస్త పొలిటికల్ యాంగిల్ పరిచయడం చేసి.. రామ్‍నందన్ (రామ్‍చరణ్)ను చూపించేశారు. ఇంట్రడక్షన్ సీన్‍లో రౌడీలను రామ్ ఉతికారేస్తాడు. పంచె కట్టుకొని హీరో చేసే ఈ యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తుంది. అభిమానులతో విజిల్స్ వేయించేలా ఉంటుంది. మచ్చా మచ్చా రా పాట గ్రాండ్‍గా ఉంది. ఆ తర్వాత అవినీతి పనులను కలెక్టర్ రామ్ అడ్డుకునే సీన్లు పర్వాలేదనిపిస్తాయి. కొన్ని చోట్ల క్లాస్ తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది. ఎలివేషన్లు అక్కడక్కడా హుషారు తీసుకొస్తాయి.
పండని లవ్ ట్రాక్: ఈ చిత్రంలో లవ్ ట్రాక్‍ను శంకర్ ఆకట్టుకునేలా నడపలేకపోయారు. రామ్‍చరణ్, దీపిక మధ్య ఉండే కాలేజీ ఎపిసోడ్ విసుగు తెప్పిస్తుంది. కోపాన్ని తగ్గించుకునేందుకు రామ్ చేసే ప్రయత్నాలు కూడా ఆకట్టుకోవు. ఈ లవ్ స్టోరీకి బలమైన పాయింట్ మిస్ అయింది. దీంతో లవ్ ట్రాక్ పెద్దగా కనెక్ట్ కాకపోగా.. ఫస్టాఫ్‍లో కాస్త సాగదీతగా అనిపిస్తుంది. రామ్ ఎందుకు ఐఏఎస్ అవ్వాలని అనుకున్నాడో అనే కారణం వేరుగా ఉంటే బాగుండేది. దీన్ని శంకర్ మరింత మెరుగ్గా తెరకెక్కించాల్సింది. సునీల్‍తో ట్రై చేసిన కామెడీ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఓ సీన్లో కనిపిస్తారు.
ఇంటర్వెల్ ట్విస్ట్ అదుర్స్: కలెక్టర్ రామ్, మంత్రి మోపిదేవి మధ్య ఉండే పోటాపోటీ సీన్లు ఆసక్తికరంగా సాగుతాయి. సీఎం సీటు కోసం మోపిదేవి పడే ఆరాటంతో పాటు రాజకీయ ఎత్తులు కూడా బాగానే అనిపిస్తాయి. ఈ సినిమాలో ఇంటర్వెల్ ముందు పావు గంట మెప్పిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేస్తుంది. సెకండాఫ్‍లో ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచుతుంది.
అప్పన్న పోర్షన్ బెస్ట్.. గుర్తిండిపోతాడు: ఈ సినిమాలో ఇంటర్వెల్ తర్వాత అప్పన్న ఉండే పోర్షన్‍ను శంకర్ బాగా తెరకెక్కించారు. ప్రజల కోసం పోరాడే ఈ పాత్రకు ప్రేక్షకులు ఎమోషనల్‍గానూ కనెక్ట్ అవుతారు. చరణ్ ఈ క్యారెక్టర్‌లో మరింత ఆకట్టుకున్నారు. ఓ విషయంలో రంగస్థలం మూవీ గుర్తొస్తుంది. ఆ అంశం కూడా సినిమాలో ముఖ్యమే. మొత్తంగా అప్పన్న పాత్ర కాసేపే కనిపించినా.. చాలా కాలం గుర్తుండిపోతుంది. తన యాక్టింగ్ సామర్థ్యంతో అప్పన్న క్యారెక్టర్‌కు ప్రాణం పోశారు చెర్రీ. పార్వతి పాత్ర కూడా మెప్పిస్తుంది. అప్పన్నను మోసం చేసే సీక్వెన్స్ కూడా ఆసక్తికరంగానే సాగుతుంది. రాజకీయ పార్టీల్లో డబ్బు ఎలాంటి చిచ్చు పెడుతుందో చూపించారు. మొత్తంగా ఫ్లాష్‍బ్యాక్ ఎపిసోడ్ బలంగా ఉంటుంద.
ఊహలకు అందేలా..: ఫ్లాష్‍బ్యాక్ తర్వాతి నుంచి కథనం ఊహించేలా సాగుతుంది. ఎన్నికల సమయంలో అధికారి రామ్, మోపిదేవి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ బాగానే ఉన్నా.. ఆ దశ దాటిన తర్వాత సీన్లు ముందే ఊహించేలా సాగుతుంటాయి. అంతగా ఉత్కంఠ కలిగించవు. పార్వతి పాత్ర విషయంలో ఎమోషన్ బలంగా ఉంటుంది. క్లైమాక్స్ కూడా సాదాగానే సాగుతుంది. సాధారణంగా హీరో కొట్టడం కాకుండా కాస్త డిఫరెంట్‍గా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. కానీ అంత ఎగ్జైట్ చేయదు. చివర్లో పథకాల గురించి రామ్‍నందన్ చెప్పడం.. ఇప్పటి రాజకీయ నేతలకు సందేశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది.
ఎన్నికల సంఘం పవర్ చూపేలా..: ఎన్నికల సంఘం పూర్తి పవర్ వాడితే ఎలక్షన్లను ఎంత పకడ్బందీగా నిర్వహించవచ్చో అనే అంశాన్ని సెకండాఫ్‍లో చూపించారు శంకర్. రాజకీయ నాయకులను ఎన్నికల అధికారులు ఏ స్థాయిలో కట్టడి చేయొచ్చో చూపించే ప్రయత్నం చేశారు. ఎన్నికల వ్యవస్థకు, జనాలకు, రాజకీయ పార్టీలకు సందేశాన్ని కూడా ఇచ్చారు. అయితే, ఇది మరింత ప్రభావంతంగా చూపించి ఉండే బాగా కనెక్ట్ అయి ఉండేది. మొత్తంగా ఫస్టాఫ్‍తో పోలిస్తే.. సెకండాఫ్ మెరుగ్గా అనిపిస్తుంది.
పాటలు గ్రాండ్‍గా.. అరుగుమీద హైలెట్
గేమ్ ఛేంజర్ పాటల చిత్రీకరణలో శంకర్ మార్క్ గ్రాండ్‍నెస్ కనిపించింది. రా మచ్చా మచ్చా పాటలో వేలాది జనాలు ఉంటారు. దోప్ సాంగ్‍లో సర్‌ప్రైజింగ్ ఎలిమింట్స్ ఉంటాయి. జరగండి పాట సెట్ వర్క్ రిచ్‍గా కనిపిస్తుంది. చరణ్ డ్యాన్స్ స్టెప్స్ ఇరదీసేశారు. అభిమానులకు గ్రేస్‍తో కనివిందు చేశారు. అయితే, పెద్దగా ఖర్చు పెట్టని ‘అరుగుమీద’ పాట ఎమోషనల్‍గా టచ్ చేస్తుంది. ఈ పాటకు మంచి సందర్భం, పరామార్థం ఉంటాయి. రామ్, అంజలి పర్ఫార్మెన్స్ కూడా ఈ పాటకు బలాన్ని తీసుకొచ్చాయి. ఈ చిత్రంలో నానా హైరానా పాటను ఎడిట్‍లో తీసేశారు.
ఓకే అనిపించిన శంకర్
దర్శకుడు శంకర్.. కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‍లో వచ్చే లవ్ ట్రాక్ వీక్‍గా అనిపిస్తుంది. దాన్ని ఆసక్తికరంగా చూపించాల్సింది. ఇంటర్వెల్, సెకండాఫ్ తొలి అరగంట ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు సహా మరిన్ని చిత్రాల్లో తాను చెప్పాలనుకున్న మెసేజ్‍ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా శంకర్ బలంగా చూపించే వారు. అయితే సుమారు పదేళ్లుగా ఈ విషయంలో తడబడుతున్నారు. గేమ్ ఛేంజర్ విషయంలోనూ కాస్త అదే జరిగింది. మెసేజ్ బాగానే ఉన్నా.. ప్రేక్షకుల హృదయాల్లో నాటుకుపోయేలా కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయారు శంకర్. ఈ చిత్రంతో ఓకే అనిపించారు. గేమ్ ఛేంజర్‌తో చిత్రంతో శంకర్ పూర్తి కమ్‍బ్యాక్ ఇచ్చారని చెప్పలేం. అయితే, ఆయన ఇటీవలి చిత్రాలతో పోలిస్తే మెరుగ్గా అనిపిస్తుంది.
బీజీఎం మెప్పించేలా.. రిచ్ లుక్‍తో మూవీ
గేమ్ ఛేంజర్ చిత్రంలో పాటలకు థమన్ ఇచ్చిన స్వరాలు ఓకే అనిపించాయి. మరీ ఎక్కువ ఎగ్జైట్ చేయలేదు. అయితే, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ చిత్రంలో అదరగొట్టారు థమన్. మ్యూజిక్‍తో సీన్లను బాగా ఎలివేట్ చేశారు. మోపిదేవికి వచ్చే బీజీఎం కొత్తగా అనిపిస్తుంది. మొత్తంగా ఈ చిత్రానికి థమన్ బాగానే న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ కూడా మెరుగ్గా ఉంది. భారీతనం కనిపిస్తుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. దిల్‍రాజు, శిరీష్ పెట్టిన బడ్జెట్ తెరపై కనిపిస్తుంది. వెండితెరపై సినిమా గ్రాండ్ లుక్‍తో సాగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్
గేమ్ ఛేంజర్ చిత్రానికి ప్రధానమైన హైలైట్ రామ్‍చరణ్ నటన. రామ్‍నందన్, అప్పన్న రెండు పాత్రల్లోనూ మెప్పించారు. అప్పన్నగా మరింతగా చెర్రీ ఆకట్టుకున్నారు. కాలేజ్ లుక్ స్పెషల్ అట్రాక్షన్‍గా ఉంటుంది. ఎమోషన్ సీన్లను కూడా బాగా పండించారు. చరణ్ డైలాగ్ డెలివరీ కూడా స్పష్టంగా ఉంది. డ్యాన్స్ స్టెప్‍ల్లో గ్రేస్ చూపించారు. ఎస్‍జే సూర్య తన మార్క్ నటనతో రెచ్చిపోయారు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ చిత్రంలో ప్రత్యేకంగా అంజలి గురించి చెప్పుకోవాలి. ఆమెకు బలమైన క్యారెక్టర్ పడింది. దానికి పూర్తిగా న్యాయం చేశారు. ఎమోషనల్‍గా కదిలించారు. అయితే, ఓల్డ్ లుక్ కోసం వేసిన మేకప్ అంతగా సూటైనట్టు అనిపించదు. యాక్టింగ్ పరంగా మెప్పించారు. కియారా అడ్వానీ క్యూట్ లుక్‍తో ఉన్నంతలో బాగా చేశారు. శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్ ఉన్నంతలో మెప్పించారు.
మొత్తంగా..
గేమ్ ఛేంజర్ సినిమా అబోయ్ యావరేజ్ అనిపించేలా సాగుతుంది. ఫస్టాఫ్‍లో కాసేపు తప్ప.. మిగిలిన చోట్ల పెద్దగా బోర్ అనిపించదు. సెకండాఫ్ మెరుగ్గా ఉంటుంది. రాజకీయాలు, పదవి, పార్టీ కోసం ఎత్తులు, వెన్నుపోటు, ఎన్నికల అంశాల చుట్టూ ఎక్కువ భాగం ఆసక్తికరంగా ఉంటుంది. ఓ ట్విస్ట్ మెప్పిస్తుంది. చరణ్ యాక్టింగ్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది. డైరెక్టర్ శంకర్.. ఒకప్పటి మార్క్ పూర్తిగా చూపించకపోయినా.. నిరుత్సాహపరచలేదు. చరణ్ యాక్టింగ్, వెండితెరపై గ్రాండ్‍నెస్ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లలో ఈ సంక్రాంతి పండుగకు ఓసారి తప్పక చూడొచ్చు. అయితే, అంచనాలను కాస్త తక్కువగా పెట్టుకుంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు.
రేటింగ్: 2.75/5
సంబంధిత కథనం