Best Web Hosting Provider In India 2024
TTD Chairman Vs EO: నువ్వంటే నువ్వు అంటూ సీఎం ముందే తగువులాట..ఒకరిపై ఒకరు ఫిర్యాదులు.. చర్చనీయాంశంగా ఈవో, ఛైర్మన్ వైఖరి
TTD Chairman Vs EO: తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సీఎం ఈ ఘటనపై సమీక్షిస్తున్న సమయంలో టీటీడీ ఈవో, ఛైర్మన్ ఘర్షణ పడటం చర్చనీయాంశంగా మారింది. సీఎం సమక్షంలోనే ఛైర్మన్,ఈవో తగువులాడుకోవడంతో టీటీడీ సమన్వయ లోపాన్ని బయటపెట్టింది.
TTD Chairman Vs EO: తిరుమలలో అధికారులు నాకేమీ చెప్పడం లేదని ఛైర్మన్ ఆరోపిస్తే ఏమి చెప్పడం లేదని ఈవో నిలదీయడం తొక్కిసలాట సమీక్షలో చోటు చేసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో టీటీడీ ఈవో శ్యామలరావు, ఛైర్మన్ బీఆర్ నాయుడు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో సమావేశంలో ఉన్న వారిని షాక్ కు గురి చేసింది. తనను ఆలయ అధికారులు ఖాతరు చేయడం లేదనే ఉక్రోషంలో ఉన్న ఛైర్మన్ ముఖ్యమంత్రి ఎదుట ఈవోను ఏక వచనంతో ప్రశ్నించడంతో రగడ మొదలైంది. ఈవో కూడా అదే స్థాయిలో తీవ్రంగా స్పందించడంతో ఇద్దరి మధ్య వాడీవేడిగా వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి సమక్షంలోనే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులు గొడవ పడటం మంత్రుల్ని, ముఖ్యమంత్రిని షాక్‌కు గురిచేసింది. గురువారం సాయంత్రం తిరుపతి తొక్కిసలాట ఘటనపై సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి సమక్షంలో టీటీడీ ఛైర్మన్ నాయుడు ఈవో శ్యామలరావును ఏకవచనంతో సంబోధిస్తూ “నువ్వు నాకేం చెప్పడం లేదు” అనడంపై ఈవోకు ఆగ్రహం కలిగించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుతో ఛైర్మన్‌కు పొసగడం లేదనే కొన్నాళ‌్ళుగా ప్రచారం జరుగుతోంది. ఈవోతో సంప్రదించకుండా ఛైర్మన్ పలు నిర్ణయాలను మీడియా ముందు ప్రకటించడంపై ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం కొద్ది నెలలుగా జరుగుతోంది.
ఈవో తనను ఖాతరు చేయడం లేదని, తన నిర్ణయాలను అమలు చేయడం లేదని, తాను చేసిన ప్రకటనల్ని అమలు చేసే విషయంలో అడ్డు పడుతున్నారని టీటీడీ ఛైర్మన్ ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. సిబ్బందికి నేమ్ బ్యాడ్జిలు పెట్టడం, శ్రీ వాణి ట్రస్టు వ్యవహారం, తిరుమలలో అన్యమతస్తుల్ని తొలగించడం సహా పలు కీలక నిర్ణయాలను అధికారులతో చర్చించకుండా ఛైర్మన్ నేరుగా ప్రకటించడంపై అధికారులు అసహనంతో ఉన్నారు.
ఈ క్రమంలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. దీంతో టీటీడీ అధికారులదే బాధ్యత అని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో ఘటనలో అధికారుల్ని బాధ్యుల్ని చేసే క్రమంలో ఈవోపై ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నువ్వంటే నువ్వు అనుకుంటూ…
‘నువ్వు నాకేం చెప్పడంలేదు’ అని చైర్మన్ నిలదీస్తే ‘అన్నీ చెబుతూనే ఉన్నాం’ అని ఈవో వాదులాడుకున్నారు. తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలనా భవన్‌లో గురువారం సాయంత్రం జరిగిన సమీక్షలో సీఎంతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు, తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి అనిత హాజరయ్యారు. టీటీడీ ముఖ్య అధికారులు కూడా సమీక్షలో పాల్గొన్నారు.
ఈవో,ఛైర్మన్ మధ్య ఉన్న దూరాన్ని బయటపెట్టేలా ఎదురు ఒకరినొకరు తీవ్ర స్వరంతో ప్రశ్నించుకున్నారు. చైర్మన్‌గా తనకు గౌరవం ఇవ్వడం లేదని, ఏ విషయం తనతో చర్చించడం లేదని, మీరైనా చెప్పాలని సీఎం చంద్రబాబుకు బీఆర్ నాయుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. సీఎంకు తనపై ఛైర్మన్ ఫిర్యాదు చేయడంతో ఈవో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ముందు తనను నువ్వు అని సంబోధించడంతో ఈవొ కూడా ఛైర్మన్‌ను అలాగే సంబోధించారు. ఛైర్మన్‌ను ఉద్దేశిస్తూ ‘నీకేం చెప్పడంలేదు. అన్నీ చెబుతూనే ఉన్నామని రిప్లై ఇచ్చారు. శ్రీవాణి ట్రస్టు వ్యవహారంలో ఛైర్మన్ చేసిన ప్రకటనతో తాము ఇబ్బంది పడ్డామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకరినొకరు నువ్వంటే నువ్వని వాదులాడుకున్నారు. మంత్రులు, సీఎం వారి తీరుతో నిశ్చేష్టులయ్యారు. ఈ క్రమంలో మంత్రి అనగాని జోక్యం చేసుకుని ఈవోను ముఖ్యమంత్రి ముందు ఇదేం వైఖరని ప్రశ్నించారు.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఈవో , ఛైర్మన్‌లపై మండిపడ్డారు. పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఫ్రస్టేషన్ ఎవరిపై చూపిస్తారని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను చీఫ్ సెక్రటరీ సమన్వయంతోనే ఉంటున్నామని, ఒక దగ్గర పనిచేసేటప్పుడు సమన్వయంతో ఉండాలని, అందరి ముందు ఇలా మాట్లాడుకోవడం ఏమిటన్నారు.
వారు మాట్లాడుకున్న భాషను కూడా తప్పు పట్టారు. జేఈవో వెంకయ్య చౌదరి వ్యవహార శైలితో పాటు తిరుమలకు సంబంధించిన అన్ని అంశాలను సెట్ చేస్తానని హెచ్చరించారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని పనిచేసుకోవాల్సిందేనని చెప్పారు. సమీక్షకు ముందు తిరుమలలో పరిణామాలను ఛైర్మన్ సీఎంకు ఏకరువు పెట్టారు. అధికారులు తనను లెక్క చేయడం లేదని, తాను లేకుండానే సమీక్షలు చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. గత నెలలోనే టీటీడీ ఛైర్మన్ ఏపీ సచివాలయంలో సీఎంకు అధికారులపై ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే ఈవో సమన్వయం చేసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. తాజాగా తొక్కిసలాట జరగడంతో తిరుమల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి ఎలా చక్కదిద్దుతారనేది ఆసక్తి కరంగా మారింది.
సంబంధిత కథనం
టాపిక్