Best Web Hosting Provider In India 2024
పునరావాస కేంద్రంగా టీటీడీ పాలక మండలి
అసమర్థులు.. వందిమాగదులను నియమించిన సీఎం చంద్రబాబు
టీడీపీకి బాకా ఊదిన బీఆర్ నాయుడుకు చైర్మన్ పదవి
అదనపు ఈవో వెంకయ్య చౌదరికి నిలువెల్లా కులం.. అదొక్కటే ఆయన బలం
అమరావతి: టీటీడీని సీఎం చంద్రబాబు పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. అత్యంత వివాదాస్పదులు, తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నవారికి టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలలో దళారుల దందాకు తలుపులు బార్లా తెరిచారు. ఎన్నికల్లో తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెట్టి టీడీపీకి బాకా ఊదిన టీవీ 5 చానల్ చైర్మన్ బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్‌గా నియమించారు.
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు.. దేవుడి పట్ల భక్తి లేదు. సివిల్ సర్వెంట్‌గా పాటించాల్సిన నిబంధనల పట్ల పట్టింపు లేదు. ఉన్నదల్లా కులం.. దాని నుంచి వచ్చిన బలం! అంతకు మించి ఏ కోశానా సమర్థత, నిజాయితీ, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలన్న ఇంగితం లేవు. వెంకయ్య చౌదరి భక్తులను పురుగుల్లా చూస్తూ ఇప్పుడు ఆరుగురి ప్రాణాలు బలిగొనడానికి కారణమయ్యారు.
టీడీపీ కార్యకర్తలా వెంకయ్య చౌదరి…
నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన వెంకయ్య చౌదరి టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తూ రాజ్యాంగేతర శక్తిలా చెలరేగిపోతుంటారు. శ్రీవారి కన్నా స్వప్రయోజనాలే ఎక్కువ అనే తెంపరితనంతో వ్యవహరిస్తుంటారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
తన సామాజిక వర్గానికి చెందిన అస్మదీయ అధికారి అనే ఏకైక అర్హతతో సీఎం చంద్రబాబు ఆయన్ను ఏఈవోగా నియమించారు. ఆయన్ను కలిసేందుకు ఎవరైనా వస్తే మీరు టీడీపీకి చెందిన వారా? అని ప్రశ్నించిన తర్వాతే ఇతర విషయాలు మాట్లాడతారనేది బహిరంగ రహస్యం.
డీఆర్‌ఐలో విధులు..
వెంకయ్య చౌదరి డీఆర్‌ఐలో పని చేసినప్పుడు పూర్తిగా టీడీపీ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరించారనే తీవ్ర ఆరోపణలున్నాయి. అప్పట్లో టీడీపీలో ఒక వెలుగు వెలిగి రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించి ఇప్పుడు పార్టీ మారి శాసనసభ్యుడిగా ఉంటూ… బ్యాంకులనుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా కుచ్చు టోపీ పెట్టిన ఓ నాయకుడికి వెంకయ్య ప్రధాన అనుచరుడిగా మెలిగారని చెబుతారు.
ఓఎస్డీగా వ్యవహారాలు..
2014 –19 మధ్య బాబు సీఎంగా ఉన్న సమయంలో వెంకయ్య చౌదరి ఓఎస్డీగా నియమితులయ్యారు. పెద్దల అండ ఇబ్బడి ముబ్బడిగా ఉండటంతో అడిగేవారు లేరని రెచ్చిపోయిన వెంకయ్య చౌదరి కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తించారని చెబుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంని కలవడానికి వచ్చినా వారి పట్ల నిర్లక్యంగా వ్యవహరించేవారని, వెకిలిగా మాట్లాడేవాడని అంటుంటారు.
ఖనిజాభివృద్ధి శాఖ ఎండీగా..
అనంతరం వెంకయ్య చౌదరిని ఓఎస్డీ పదవి నుంచి తప్పించి ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఎండీగా నియమించారు. ఆ పదవిలోనూ చంద్రబాబు, తన కులస్తుల నమ్మకాన్ని వెంకయ్య చౌదరి ఏమాత్రం వమ్ము చేయలేదనే ఆరోపణలున్నాయి. టీడీపీకి చెందిన వారికి మరీ ముఖ్యంగా తన కులానికి చెందిన వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరించారు.
2019లో టీడీపీ పరాజయం అనంతరం వెంకయ్య చౌదరి అక్రమాలు, అవినీతిపై విచారణకు ప్రభుత్వం సిద్ధం కావడంతో దీన్ని పసిగట్టిన ఆయన అడ్డదారుల్లో, టీడీపీ మద్దతుదారుల సాయంతో రిలీవింగ్ లెటర్ సంపాదించుకుని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. బాబు తిరిగి అధికారంలోకి రాగానే చంద్రముఖి మళ్లీ నిద్రలేచింది అన్నట్లుగా వెంకయ్య చౌదరి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చారు.
అడుగులకు మడుగులొత్తినందుకే…
ఎల్లో మీడియాలో ఒకటైన టీవీ–5 చైర్మన్ బీఆర్ నాయుడు టీడీపీని స్థాపించినప్పటి నుంచి తాను ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నానని చెప్పుకుంటూ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు అడుగులకు మడుగులొత్తారు. అందుకే చంద్రబాబు ఇప్పుడు ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని బహుమతిగా ఇచ్చారు. టీటీడీ చైర్మన్ పదవి దక్కాక బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నోరుపారేసుకున్నారు.
జగన్ త్వరలో జైలుకెళ్లడం ఖాయమని.. చంద్రబాబు కొత్త కేసులు పెడితే జగన్ శాశ్వతంగా జైల్లో ఉండాల్సిందేనని విషం కక్కారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక ఆ సంస్థ పరిపాలన వ్యవహారాల కంటే రాజకీయ వ్యవహారాలకే బీఆర్ నాయుడు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.
పాలనా వ్యవహారాలను గాలికొదిలేసి టీటీడీని టీడీపీ కార్యాలయంగా మార్చేయడంవల్లే తిరుమల చరిత్రలో ఎన్నడూలేని రీతిలో ఘోరం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
భక్తుల రద్దీని అంచనా వేయడంలో సర్కారు వైఫల్యం
మితిమీరిన ప్రచారం, అవగాహన రాహిత్యం, భద్రత ఏర్పాట్ల వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతి కేంద్రంగా భక్తులకు టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు నెల రోజుల నుంచి సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు.
తరచూ కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే ముఖ్య ఉద్దేశమంటూ ఊదరగొట్టారు. అతి ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి పోటెత్తారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల నుంచి మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తామని ముందుగానే ప్రకటించడంతో సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తిరుపతి చేరుకున్నారు.
బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. సాయంత్రానికి మరింత మంది తోడవ్వడంతో క్యూలైన్ల వద్ద రద్దీ పోటెత్తింది. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. దీంతో వేలాదిగా భక్తులు కౌంటర్ల వద్దకు పరుగులు పెట్టడం.. తోపులాట చోటుచేసుకోవడం.. ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తెలిసిందే.
అరుపులు, కేకలు.. నరకయాతన
శ్రీనివాసం సముదాయం వద్ద టోకెన్లు తీసుకునేందుకు వేచి ఉన్న భక్తుల్లో సేలంకు చెందిన మల్లిక తీవ్ర అస్వస్థతకు గురైంది. భక్తుల రద్దీతో తోపులాటలో భాగంగా ఆమెకు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో క్యూలైన్ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు భర్త కృష్ణన్ తెలిపారు. తొలుత అంబులెన్స్‌లో స్థానిక డీబీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో రుయాకు తరలించే క్రమంలో ఆమె మార్గం మధ్యలో మృతి చెందింది. ఈ ఘటన చోటు చేసుకున్న నిమిషాల వ్యవధిలోనే సత్యనారాయణపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలోనూ తోపులాట చోటు చేసుకుంది.
అయితే ఇక్కడ పరిస్థితి కొంత సేపటికి అదుపులోకి రావడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం రాత్రి 8.25 గంటల ప్రాంతంలో బైరాగిపట్టెడలోని రామానాయుడు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్ల వద్ద భారీ తోపులాట చోటు చేసుకుంది. దీనికి తోడు అదే సమయంలో తొక్కిసలాటలో కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిన లావణ్య స్వాతిని బయటకు తీసుకొచ్చే క్రమంలో వెలుపలదారి గేట్లను పోలీసులు తెరవడం మరింతగా తొక్కిసలాటకు కారణమైంది.
అక్కడ పోలీసు బందోబస్తు లేకపోవడంతో వందలాది మంది భక్తులు అక్కడి నుంచి తోసుకొచ్చారు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. ముందు వరుసలోని భక్తులు కిందపడి పోవడంతో.. వెనుక ఉన్న వారు వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో ఒక్కసారిగా అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
అక్కడ ఏం జరుగుతోందో తెలియక వెనుక, ముందు ఉన్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను తాము రక్షించుకోవడానికి వెలుపలకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కింద పడిన వారిని సైతం తొక్కుకుంటూ తమ కుటుంబ సభ్యులను కాపాడేయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.
నీళ్లు లేవు.. టాయ్‌లెట్లు లేవు.. ఇవేం ఏర్పాట్లు?
కౌంటర్ల వద్ద తాగునీరు, పాలు, అల్పాహారం అందించాలన్న కనీస ఆలోచన కూడా టీటీడీకి రాకపోవడం దుర్మార్గం అని భక్తులు మండిపడ్డారు. చాలా మంది భక్తులు ఆకలితో అలమటించి, నీరసించిపోయారు. క్యూలోంచి పక్కకు వెళితే వెనుకబడిపోతామనే భయంతో చాలా మంది అక్కడి నుంచి కదల్లేదు. చంటి పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు గంటల తరబడి వేచి ఉండటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
మహిళలకు కనీసం మొబైల్ టాయ్‌లెట్లను సైతం ఏర్పాటు చేయకపోవడంతో వారు నరకయాతన అనుభవించారు. ఇన్ని ఇబ్బందులు ప్రత్యక్షంగా కళ్లకు కనిపిస్తుంటే.. ఏర్పాట్లు ఘనంగా చేశామని టీటీడీ చైర్మన్ మీడియాకు పదే పదే ఎందుకు చెప్పారని భక్తులు నిలదీశారు. దైవ దర్శనానికి వస్తే ప్రాణాలు తీశారని మండిపడ్డారు.