Best Web Hosting Provider In India 2024
Rangoli Colours: సంక్రాంతి ముగ్గుల కోసం రంగులను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఎలాంటి ఖర్చు లేకుండా!
Rangoli Colours: పండుగకు ఇంటి ముందు పెద్ద ముగ్గు వేయాలంటే చాలా రంగులు కావాలి. అన్ని రంగులు మార్కెట్లో కొనాలంటే చాలా వరకూ ఖర్చు చేయాలి. బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా రంగులు తయారు చేసుకుంటే బెటర్ కదా. అది కూడా ఇంట్లో ఉన్న రెండు రకాల వస్తువులతో..
సంక్రాంతి ముగ్గుల కోసం రంగులను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు
సంక్రాంతి పండుగ మూడు రోజులూ ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే చాలా రంగులు కావాల్సిందే. రంగులన్నీ బయట కొనాలంటే కాస్త ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తుంది. బదులుగా మీరే ఇంట్లోనే ఈజీగా రంగులు తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది.? బాగుంటుంది కదా. అదీ ఇంట్లోనే ఉండే రెండు రకాల వస్తువులతో. అవును కేవలం ఇంట్లోని రేషన్ బియ్యంతో మీకు కావాల్సిన అన్ని రకాల రంగులు తయారు చేసుకోవచ్చు.చాలా సులువుగా. ఎలాగో తెలుసుకుందాం రండి..
రంగొలీ రంగుల తయారీకి కావాల్సిన పదార్థాలు
- దొడ్డు బియ్యం(రేషన్ బియ్యం)
- కడాయి
- రంగులు కలపడానికి కావాల్సిన బౌల్స్
- వాటర్ కలర్స్ లేదా (acrylic colour)
రంగోలీ రంగులు తయారు చేయడం ఎలా?
- ముందుగా రేషన్ బియ్యం తీసుకుని ఒక కడాయిలో వేసి దోరగా వేయించండి.
- బియ్యం కాస్త చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసుకుని పిండిలా పట్టాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. బియ్యం మరీ మెత్తగా అవకూడదు, అలాగని మరీ రవ్వలా ఉండకూడదు. మెత్తగా ఉంటే రంగులు వేయడం కష్టంగా మారుతుంది. రవ్వలా ఉండే రంగు అందంగా కనిపించదు.
- ఇలా బియ్యాన్ని మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోండి. ఎక్కువ రంగులు కావాలంటే ఎక్కువ బియ్యం తీసుకని పిండిమర(పిండి గిర్ని) దగ్గర పట్టించండి.
- ఇప్పడు మీకు ఎన్ని రకాల రంగులు కావాలో అన్నింటికీ సరిపడా బౌల్స్ లేదా ప్లేట్లు తీసుకుని వాటన్నింటిలో పిండిని వేయండి.
- తరువాత పెయింటింగ్ కోసం ఉపయోగించే అక్రిలిక్ పెయింట్లు లేదా ఇంట్లో పిల్లలు ఉపయోగించే వాటర్ కలర్స్ తీసుకుని ఒక్కో బౌల్ ఒక్కో కలర్ వేసుకుని దాంట్లో నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి.
- కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మీకు కావాల్సినంత ముదురు రంగు వచ్చే వరకూ రంగులను కలపుకోండి. కొంచెం కలర్ తీసుకుంటే చాలా పిండిని కలుపుకోవచ్చు.
- ఇలా పిండిలో రంగులు వేసుకుని కలుపుకున్న తర్వాత కాసేపు ఆరనివ్వాలి.
- పిండి పూర్తిగా ఆరిన తర్వాత మరోసారి మిక్సీలో వేసి తిప్పండి. ఇలా చేయడం వల్ల పిండిలో రంగులు మరింత చక్కగా కలిసిపోతాయి.
- అంతే సంక్రాంతి స్పెషల్ రంగు రంగుల ముగ్గు కోసం రకరకాల రంగులు రెడీ అయినట్టే. వీటిని బాక్సుల్లో లేదా కవర్లో వేసి దాచుకున్నారంటే సంవత్సరం అంతా ఉపయోగించుకోవచ్చు.
- ఇలా మీకు ఎన్ని రకాల రంగులు కావాలన్నా, ఎంత ఎక్కువ కావాలన్నీ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
- ఇంట్లో దొడ్డు బియ్యం ఎలాగే ఉండనే ఉంటాయి. అలాగే అక్రిలిక్ కలర్స్ లేదా వాటర్ కలర్స్ కూడా దాదాపు అందరి ఇళ్లల్లో ఉండేవే. ఒకవేళ లేకపోయినా వీటి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు.