Best Web Hosting Provider In India 2024
TDP Cadre: టీడీపీ క్యాడర్ వైఖరితో చంద్ర బాబుకు చిక్కులు, సోషల్ మీడియాలో ఎడాపెడా విమర్శలు
TDP Cadre: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడకు, కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష వైసీపీతో కంటే సొంత పార్టీ క్యాడర్‌తోనే చికాకులు ఎక్కువవుతున్నాయి. వైసీపీ ప్రశాంతంగా ఉందనుకుంటే టీడీపీ క్యాడర్ సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడితోనే ఆ పార్టీకి ఎక్కువ డామేజ్ జరుగుతోంది.
TDP Cadre: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఆర్నెల్లుగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నుంచి పెద్దగా చికాకులు ఎదురు కాలేదు. ఒకటి రెండు సందర్భాలు వచ్చినా వాటిని సులువుగానే టీడీపీ అధినేత అధిగమించగలిగారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధ్యక్షుడు ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్లాలని ప్రయత్నించినా ఆ పార్టీ క్యాడర్ పెద్దగా స్పందించలేదు. అధికార పార్టీతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చాలా మంది అజ్ఞాతంలోకి జారుకున్నారు.
వైసీపీ నుంచి సోషల్ మీడియాలో తప్ప బయట పెద్దగా ప్రతిఘటన లేకపోవడం, ఆ తర్వాత సోషల్ మీడియా దుష్ప్రచారాలను కట్టడి చేయడానికి పెద్ద ఎత్తున పోలీస్ కేసులు నమోదు కావడంతో ప్రత్యర్థుల నుంచి ఆ దూకుడు కూడా తగ్గిపోయింది. ఈ క్రమంలో హుషారుగా ఉండాల్సిన టీడీపీ అధినేతకు సొంత క్యాడర్ నుంచి చికాకులు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, ప్రతిపక్షంలో ఉండగా టీడీపీని భుజాన మోసిన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్నారు.
టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో చాలామంది తాము అధికారంలో ఉన్నామనే సంగతి మరిచి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, సంకీర్ణ ధర్మంలో భాగంగా తీసుకున్న విధానపరమైన అంశాలను కూడా తప్పు పడుతున్నారు. ఐదేళ్ల పాటు టీడీపీ నినాదాల్ని, వాదనల్ని సమర్ధవంతంగా వినిపించిన క్యాడర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాక ముందే అసంతృప్తి గళాలను వినిపిస్తున్నారు. కొద్ది మంది వైసీపీని నిందించే క్రమంలో టీడీపీనే తప్ప పడుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సంగతి మరిచి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కొద్ది నెలలుగా టీడీపీ క్యాడర్లో ఈ తరహా అసంతృప్తి పెరిగిపోతోంది. పార్టీ అధి నాయకత్వం తమను నిర్లక్ష్యం చేస్తోందనే భావన కార్యకర్తలు, దిగువ శ్రేణి నాయకుల్లో ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన వారు బదులు తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి చర్యలు వద్దని ముఖ్యమంత్రి పదేపదే వారించడం వారికి రుచించడం లేదు. వైసీపీ పంథాలో సాగితే తేాడా ఏముంటుందని, రాష్ట్ర ప్రయోజనాలు అభివృద్ధిపై దృష్టి సారించాలని నచ్చచెప్పే ప్రయత్నాలు వారికి రుచించడం లేదు.
ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్న మీడియా, సోషల్ మీడియా
ఇక టీడీపీ అనుకూల మీడియాలో సైతం ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే కథనాలతో చంద్రబాబు సతమతం అవుతున్నారు. తమ వారనుకునే వారి నుంచి ఎదురవుతున్న విమర్శలు, కథనాలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేనలతో కలిసి టీడీపీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. విధానపరమైన నిర్ణయాలను మూడు పార్టీలు కలిసి తీసుకోవాల్సి వస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఏపీ ప్రభుత్వంలో ముఖ్య నాయకుడిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో చాలా వరకు ఆయన భాగస్వామ్యం ఉంటోంది. చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునే క్రమంలో లోకేష్ క్రియాశీలకంగా ఉన్నారు. ప్రభుత్వ శాఖలపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు తర్వాత టీడీపీ పగ్గాలు ఏదొో ఒక సమయంలో లోకేష్ అందిపుచ్చుకోవాల్సి ఉంటుందనే అంచనా అందరిలో ఉంది. అదే సమయంలో టీడీపీ తీరుపై ఆ పార్టీ క్యాడర్ చేస్తోన్నవిమర్శలు, లోపాలను ఎత్తి చూపే క్రమంలో ప్రభుత్వాన్ని నిందిస్తున్న తీరు టీడీపీకి మేలు కంటే చేటు ఎక్కువగా చేస్తున్నాయి.
ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు సోషల్ మీడియాను వాడుకోవడం మొదలైన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు గత పదేళ్లుగా సోషల్ మీడియాను విస్తృతంగా వాడుతున్నాయి. సోషల్ మీడియా వినియోగంలో సీబీఎన్ ఆర్మీ పేరిట ఐటీ ప్రొఫెషనల్స్ 2014 ముందు నుంచి విస్తృతంగా పనిచేస్తున్నారు. స్వచ్ఛంధంగా చాలామంది చంద్రబాబు కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫాంలపై కాంపెయిన్ చేస్తున్నారు.
2019లో టీడీపీ ఓటమి పాలై తిరిగి పుంజుకోడానికి కూడా సోషల్ మీడియా బలంగా పనిచేసింది. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పాత్ర నుంచి ప్రభుత్వంలో ఉన్నామనే స్పృహలోకి రావడంలో టీడీపీ అనుకూల సోషల్ మీడియా కన్ఫ్యూజ్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ విధానపరమైన అంశాల్లో లోపాలకు ఆర్నెల్ల క్రితం అధికారం పోగొట్టుకున్న వైసీపీని నిందించే పనిలోనే ఉన్నారు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పు పట్టడంలో వారే ముందు ఉంటున్నారు.
మద్యం విక్రయాలు, ఇసుక, బ్యూరోక్రసీ, ప్రభుత్వ సేవలు, విద్యా వైద్యం వంటి అంశాల్లో సొంత పార్టీ వారి నుంచి పలు సందర్భాల్లో విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తమకు నచ్చని ఏ పని చేసినా విమర్శించడానికి వెనుకాడటం లేదు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అధికారుల నియామకాలు, పోస్టింగుల నుంచి ప్రమోషన్లు, బదిలీల వరకు ప్రతి అంశాన్ని తప్పు పట్టడం మొదలైంది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో చంద్రబాబు నిర్ణయాలను నేరుగా విమర్శించడం సాధారణమై పోయింది. ఈ క్రమంలో వారికి తెలియకుండానే చంద్రబాబును కార్నర్ చేస్తున్నామనే సంగతి మరిచి పోతున్నారు.
ఐఏఎస్ అధికారుల పోస్టింగులు, గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన వారిని తిరిగి ప్రభుత్వంలో చేర్చుకోవడం, ఆరోపణలు ఉన్న వారికి పోస్టింగులు ఇవ్వడం, తమను వేధించిన పోలీసులకు కీలక స్థానాల్లో బాధ్యతలు అప్పగించడం వంటి నిర్ణయాలను సోషల్ మీడియా వేదికలపై తూర్పారబడుతున్నారు.
వేచి చూసే ధోరణిలో ప్రతిపక్షం…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగుళూరులోనే గడుపుతున్నారు. తాడేపల్లి నివాసంలో అడపాదడపా సమీక్షలు చేస్తున్నారు. జనవరి చివరి నుంచి జిల్లా పర్యటనలు చేపట్టనున్నారు. టీడీపీలో జరుగుతున్న పరిణమాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంతోషం కలిగిస్తుండవచ్చు. ఆర్నెల్లలో జగన్ పెద్దగా బయటకు రాకపోయిన ప్రభుత్వం పై ఎంతో కొంత వ్యతిరేకత రావడానికి టీడీపీ వర్గీయులే ఎంతో కొంత కారకులు కావడం జగన్‌కు కలిసి వస్తుంది. ఈ క్లారిటీ టీడీపీ వర్గీయులకు రాకపోతే మున్ముందు సమస్య తీవ్రం కావొచ్చు.
టాపిక్