Best Web Hosting Provider In India 2024
Hyderabad RRR : ఓఆర్ఆర్ – రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో రేడియల్ రోడ్ల నిర్మాణం… ఆ పరిశ్రమలన్నీ అక్కడే – సీఎం రేవంత్
ఔటర్ రింగ్ రోడ్డుకు రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యన రేడియల్ రోడ్లను నిర్మించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ తయారీ పరిశ్రమ, మార్కెటింగ్ కు అవసరమైన కేంద్రీకృత ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నది తమ ఉద్దేశ్యమని చెప్పారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు.
హైదరాబాద్‌లోని గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పారిశ్రామికాభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, స్వేచ్ఛా వాణిజ్యం, మార్కెట్లు పనిచేయడానికి పారిశ్రామిక రంగం సహకరించాలని కోరారు. ప్రపంచంలోనే అత్తుత్తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందించడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం – ముఖ్యమైన అంశాలు
- “TelanganaRising లక్ష్యంతో సేవల రంగం కేంద్రీకృతంగా ఫోర్త్ సిటీని నిర్మించాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. హైదరాబాద్‌లో సంపూర్ణంగా నెట్ జీరో లక్ష్యాలతో పనిచేస్తున్నాం.
- హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడంలో భాగంగా 3200 ఆర్టీసు బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలను సమకూర్చబోతున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్‌లను పూర్తిగా రద్దు చేశాం. ప్రస్తుతం ఎలక్టిక్ వాహనాల అమ్మకాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి.
- వరదలు లేని నగరంగా, దేశంలోనే పర్యావరణ హితమైన హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టాం. అందులో భాగంగా 55 కిలోమీటర్ల పొడవైన మూసీ పునరుజ్జీవ పనులను ప్రారంభించాం. 2050 నాటికి అవసరమయ్యే తాగునీటి అవసరాలకు అవసరమైన కార్యాచరణను ఇప్పటి నుంచే ప్రారంభించాం.
- తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాం. అవుటర్ రింగ్ రోడ్డుకు రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యన రేడియల్ రోడ్లను నిర్మించబోతున్నాం. ఆయా ప్రాంతాల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, సోలార్ పవర్ వంటి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం.
- 360 కి.మీ పొడవు ఉండబోయే రీజినల్ రింగ్ రోడ్డు వెంట రీజినల్ రింగ్ రైల్‌ను నిర్మించాలని ప్రధానమంత్రిని కోరాం. రీజినల్ రింగ్ రోడ్ చుట్టూ తయారీ పరిశ్రమ, మార్కెటింగ్ కు అవసరమైన కేంద్రీకృత ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నది మా ఉద్దేశం.
- చైనా తరహాలో రకరకాల క్లస్టర్లను సృష్టించాలని భావిస్తున్నాం. ఒక లైట్ సిటీ, మార్బుల్ సిటీ, గ్రానైట్ సిటీ, ఫర్నీచర్ సిటీ… ఇలా ప్రత్యేక తరహాలో రీజినల్ రింగ్ రోడ్డు చూట్టూ మార్కెటింగ్ కార్యకలాపాల విస్తరణకు ప్రయత్నిస్తున్నాం.
- రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే తెలంగాణ ప్రాంతంలో 70 శాతం పట్టణీకరణ జరుగుతుంది. రింగ్ రోడ్డు ఆవలివైపున గ్రామీణ తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, సేంద్రీయ సాగు, రైతుల కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది.
- తెలంగాణకు సముద్ర తీరప్రాంతం లేని కారణంగా డ్రై పోర్టును ఏర్పాటు చేస్తున్నాం. పోర్టుతో అనుసంధానం చేయడానికి మచిలీపట్నం ఓడరేవు వరకు ప్రత్యేక రహదారి, రైల్వే కనెక్టివిటీని ప్రతిపాదించాం.
- నైపుణ్యత పెంచడానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించాం. చైనా ప్లస్ వన్ వ్యూహంలో హైదరాబాద్‌ను ప్రపంచంలో ప్రధాన పెట్టుబడుల కేంద్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
- సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం శుభ పరిణామం. అత్యుత్తమ వ్యాపార సౌలభ్యాలను అందించడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. సీఐఐ కలిసిరావాలి. అందరం కలిసి అద్భుతాలు సాధించవచ్చని మా నమ్మకం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్