Best Web Hosting Provider In India 2024
AP Govt Schools : పాఠశాల విద్యలో సంస్కరణలు…! జీవో 117 రద్దు, మార్పులతో కొత్త ఉత్తర్వులు
ఏపీలోని కూటమి ప్రభుత్వం జీవో 117 ను రద్దు చేసింది. విద్యా సంస్కరణలకు సంబంధించి ఇంచుమించు అదే విధానాలతో తాజాగా ఉత్వర్వులు జారీ చేసింది. పాత జీవోతో పోల్చితే కొన్ని మార్పులు చేసింది. 6 రకాల పాఠశాలలకు బదులు ఐదు రకాల పాఠశాలల విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది.
పాఠశాల విద్యా సంస్కరణలు అమలు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 117ను ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. అయితే జీవో 117ను రద్దు చేసినప్పటికీ ఇంచుమించు అదే విధానాలతో మళ్లీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులను విడుదల చేశారు. గత జీవో నెంబర్ 117లో కంటే కొన్ని మార్పులు చేశారు.
ఆరు కాదు 5 రకాల విధానం…
గతంలో ఉన్న ఆరు రకాల పాఠశాలలకు బదులు ఐదు రకాల పాఠశాలల విధానాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. గతంలో ప్రవేశపెట్టిన శాటిలైట్ ఫౌండేషనల్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించింది. ఫౌండేషనల్ స్కూళ్లను అలానే కొనసాగించింది. అయితే ఫౌండేషనల్ స్కూల్ ప్లస్ పేరును బేసిక్ ప్రైమరీ స్కూల్‌గా మర్చింది.
ప్రీ హైస్కూల్ విధానాన్ని రద్దు చేసి మోడల్ ప్రైమరీ స్కూల్‌గా ముందుకు తీసుకొచ్చింది. 3, 4, 5 తరగతుల విలీనాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే హై స్కూల్ ప్లస్ విధానాన్ని ఏం చేస్తారో అనేది స్పష్టం ఇవ్వలేదు. ఫౌండేషనల్, బేసిక్ ప్రైమరీ స్కూళ్లకు 1ః20 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలన్న విద్యా వేత్తల డిమాండ్‌ను పట్టించుకోలేదు. గత ప్రభుత్వం వలే ఇప్పుడు కూడా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని నిర్ణయించింది.
పెరగనున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు…
ఫౌండేషనల్ స్కూల్‌లో 1ః30 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించింది. విద్యార్థులు సంఖ్య 30 దాటితే మరో ఎస్‌జీటీని కేటాయిస్తామని పేర్కొంది. బేసిక్ ప్రైమరీ స్కూల్‌లో 1ః20 నిష్పత్తి ప్రకారం అమలుచేస్తామని 60 దాటితేనే మరోపోస్టు ఉంటుందని తెలిపింది. దీనివల్ల ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మోడల్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 60 కంటే తక్కు ఉంటే ఐదు తరగతులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఐదుగురిని కేటాయిస్తారు.
ఎన్‌రోల్‌మెంట్ 120 కంటే ఎక్కువ ఉంటే ప్రధానోపాధ్యాయ పోస్టు ఉంటుంది. 150 దాటితే ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్‌జీటీ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య 45-60 మధ్య ఉన్నా మోడల్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది. అయితే సామాజిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల ఆధారంగా పాఠశాల యాజమాన్య కమిటీ మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటును ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. అయితే దీంతో మళ్లీ పాత పద్దతికే పాఠశాల విద్య వస్తుంది. ప్రైవేట్ పాఠశాలల్లో చేరికలు పెరుగటంతో పాటు…. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్ రేటు పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
60 కంటే ఎక్కువగా ఉంటే హైస్కూల్….
విద్యార్థులు సంఖ్య 30 కంటే తక్కువగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను మోడల్, బేసిక్ ప్రైమరీగా మార్చుతారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులను దర్గరలో ఉన్న పాఠశాలలకు తరలిస్తారు. 6, 7, 8 తరగతులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 60 కంటే ఎక్కువగా ఉంటే, దానిని హైస్కూల్‌గా మార్చుతారు.
హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్య 76 కంటే ఎక్కువగా ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టులు ఉంటాయి. విద్యార్థుల సంఖ్య 400 దాటితే ఆయా స్కూల్స్‌కు రెండో పీఈటీని కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్య 751 ఉంటే మూడో పీఈటీ పోస్టు ఉంటుంది. పోస్టులు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా మ్యూజిక్, ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్ పోస్టులు ఉంటాయి.
గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డులలో మోడల్ ప్రైమరీ స్కూల్ గుర్తించేందుకు కమిటీలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ఉండే కమిటీలో కన్వీనర్‌గా ఎంఈవో-1, కో కన్వీనర్‌గా ఎంఈవో-2 ఉంటారు. సభ్యులుగా ఐసీడీఎస్ సీడీపీవో, ఎంఆర్‌వోతో పాటు ఎంపీడీవోగానీ మున్సిపల్ కమిషనర్‌గానీ సభ్యులుగా ఉంటారు. క్లస్టర్ స్థాయి కమిటీల్లో కన్వీనర్‌గా క్లస్టర్ ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా, సభ్యులుగా ఎంఈవో 1, 2, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు ఉంటారు. ఈ రెండు కమిటీలు పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలల ఏర్పాటు గురించి చర్చిస్తారు.
పాత విధానం ప్రకారం…
1. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ (పీపీ 1, పీపీ 2)
2. ఫౌండేషన్ స్కూల్ (పీపీ 1, పీపీ 2, 1, 2 తరగతులు)
3. ఫౌండేషన్ ప్లస్ స్కూల్ (పీపీ 1, పీపీ 2, 1 నుంచి 5 తరగతులు)
4. ప్రి హైస్కూల్ (3 నుంచి 8 తరగతులు)
5. హై స్కూల్ (3 నుంచి 12 తరగతులు)
కొత్త విధానం ప్రకారం…
1. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ (పీపీ 1, పీపీ 2)
2. ఫౌండేషన్ స్కూల్ (పీపీ 1, పీపీ 2, 1, 2 తరగతులు)
3. బేసిక్ ప్రైమరీ స్కూల్ (పీపీ 1, పీపీ 2, 1 నుంచి 5 తరగతులు)
4. మోడల్ ప్రైమరీ స్కూల్ (పీపీ 1, పీపీ 2, 1 నుంచి 5 తరగతులు)
5. హై స్కూల్ (6 నుంచి 10 తరగతులు)
మోడల్ ప్రైమరీ స్కూల్స్ నియమాలు:
1. 60+ విద్యార్థులున్న చోట ఏర్పాటు చేస్తారు.
2. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటారు.
3. 120+ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు
4. 150+ విద్యార్థులకు అదనపు ఎస్‌జీటీ
అప్పర్ ప్రైమరీ స్కూళ్ల మార్పులు:
1. <30 విద్యార్థులు – ప్రాథమిక పాఠశాలగా మార్పు
2. 60+ విద్యార్థులు – హైస్కూల్ గా అప్‌గ్రేడ్ చేస్తారు.
3. 31-59 విద్యార్థులు – కేస్ బై కేస్ పరిశీలన
హైస్కూల్స్ నియమాలు:
1. 75+ విద్యార్థులకు HM మరియు PET పోస్టులు
2. 54+ విద్యార్థులకు రెండవ సెక్షన్
3. ప్రతి 40 మందికి కొత్త సెక్షన్ ఉంటుంది.
అమలు ప్రక్రియ:
1. మండల & క్లస్టర్ కమిటీల ఏర్పాటు
2. ఎస్ఎంసీ సంప్రదింపులు
3. తల్లిదండ్రుల అంగీకారం
ప్రత్యేక నిబంధనలు:
1. అవరోధాలున్న ప్రాంతాల్లో బేసిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారు.
2. 3 కిలో మీటర్ల లోపల హైస్కూల్ లేనిచోట ప్రత్యేక ఏర్పాట్లు
3. అవసరమైన చోట రవాణా భత్యం అందజేస్తారు.
ఉపాధ్యాయుల పునర్వ్యవస్థీకరణ:
1. యూడీఐఎస్ఈ డేటా ప్రకారం పోస్టుల కేటాయింపు ఉంటుంది.
2. అన్ని రకాల పాఠశాలల మధ్య సర్దుబాటు చేస్తారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్