Best Web Hosting Provider In India 2024
Vemulawada : చిన్నారి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు – ముగ్గురు మహిళలు అరెస్ట్
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో నాలుగేళ్ళ చిన్నారి మిస్సింగ్ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు. మహబూబాబాద్ కు చెందిన ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. చిన్నారిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ౕ మహాజన్ వెల్లడించారు.
తల్లికి మతిస్థిమితం సరిగా లేదు. చిన్నారికి మాటలు సరిగా రావు…! లోకజ్ఞానం అస్సలు తెలియదు. అదే అదనుగా భావించారు మాయలేడీలు. వేములవాడ రాజన్న దైవ సన్నిధి సాక్షిగా పసిపాపను ఎత్తుకెళ్లారు. మతిస్థిమితం లేని తల్లికి బిడ్డ ఏమైందో తెలియదు. కుటుంబ సభ్యులకు పాప గురించి చెప్పే స్థితిలో ఆమె లేదు. ఆలస్యంగా మేల్కొన్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో ముగ్గురు మహిళలను పట్టుకుని పాపను క్షేమంగా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు.
చనువుగా మెదిలి చంటిపాప అపహరణ…
దక్షిణ కాశిగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పిల్లలు మాయం కావడం ఆ తర్వాత దొరకడం పరిపాటిగా మారింది. కానీ 18 రోజుల క్రితం నాలుగేళ్ల చిన్నారి అద్విత మిస్సింగ్ అందరినీ ఆందోళనకు గురి చేసింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లికి చెందిన లాస్య మతిస్థిమితం సరిగా లేక రాజన్న సన్నిధిలో ఉంటే ఆరోగ్యం బాగుపడుతుందని భావించి నాలుగేళ్ల కూతురు అద్విత తో వేములవాడకు చేరింది.
అక్కడికి రాజన్న దర్శనానికి మహబూబాబాద్ నుంచి వచ్చిన నరసమ్మ, అంజవ్వ, ఉప్పమ్మ ముగ్గురు మతిస్థిమితం సరిగా లేని తల్లి లాస్య ఆమె కూతురు అద్విత ను పసిగట్టారు. తల్లికి ఏది గుర్తుండకపోవడంతో పాపను ఎత్తుకెళ్ళితే ఇక తమకు లక్ష్మీ వచ్చినట్లేనని భావించారు. మాటల్లో దింపి పాపకు బిస్కెట్లు చాక్లెట్లు కొనిచ్చి చనువుగా మెదిలి డిసెంబర్ 23న తమ వెంట మహబూబాబాద్ కు తీసుకెళ్లారు. మతిస్థిమితం లేని ఆ తల్లి బిడ్డ కోసం ఆరా తీసిన ప్రయోజనం లేకపోయింది. తల్లి బిడ్డ కనిపించకపోయేసరికి లాస్య భర్తతోపాటు సోదరుడు వెతుక్కుంటూ వేములవాడకు చేరగా ఆ తల్లి ఒక్కతే ఉంది. పాప గురించి ఆరా తీస్తే ఏమి చెప్పలేకపోయింది. డిసెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు..
పాప ఫొటో తప్ప ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో మిస్సింగ్ కేసు ఛేదించడం పోలీసులకు కష్టంగానే మారింది. వేములవాడలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. పాపను ఐదుగురు మహిళలు తీసుకెళ్తున్న విజువల్స్ రికార్డు అయ్యాయి. అనుమానితుల పోటోలు సిసి పుటెజ్ ని విడుదల చేసి విస్తృత ప్రచారం చేశారు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా సిరిసిల్ల, కరీంనగర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కోదాడ పరిసర ప్రాంతాల్లో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లను సందర్శించి 200 సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఉప సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో చిన్నారి మిస్సింగ్ మిస్టరీ వీడింది. ముగ్గురు మహిళలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. పోలీస్ కస్టడికి తీసుకొని గతంలో ఏమైనా నేరచరిత్ర ఉందా అనే కోణంలో విచారిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ౕ మహాజన్ తెలిపారు.
గతంలో అపహరణ…
వేములవాడ లో ఇప్పటి వరకు నలుగురు చిన్నారులు మిస్సింగ్ అయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో 24 గంటల్లోనే చేధించారు. తాజాగా ఈ చిన్నారి మాత్రం సరిగా మాటలు రాకపోవడం, తల్లికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతోనే ఆచూకీ తెలుసుకోవడంలో కాస్త ఆలస్యమయ్యిందని ఎస్పీ తెలిపారు.
2018 మే 3న అపహరణకు గురైన నాలుగు నెలల చిన్నారిని పోలీసులు 24 గంటల్లో తల్లి చెంతకు చేర్చారు. 2019 ఏప్రిల్ 3న 11 నెలల వరుణ్ తేజా కిడ్నాప్ కు గురికాగా… ఒక్క రోజు వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. 2021లో చరణ్ అనే చిన్నారి కిడ్నాప్ కు గురికాగా.. గంటల వ్యవధిలోనే తల్లి సరిత ఒడికి చేర్చారు.
రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్