Best Web Hosting Provider In India 2024
AP Govt On Sankranti Movies : సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలు – ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల అదనపు షోలకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు తాజాగా మెమో విడుదల చేసింది. ‘గేమ్ ఛేంజర్, ‘డాకు మహారాజ్’ మూవీ టికెట్ ధరల పెంపు, అదనపు షోలపై క్లారిటీ ఇచ్చింది.
డాకు మహరాజ్, గేమ్ చేంజర్ సినిమా టికె ట్లను మొదటి 14 రోజులపాటు అధిక ధరలకు అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. విచారించిన న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు తీవ్రంగా తప్పుబట్టింది. సినిమాల టిక్కెట్ ధరల పెంపుదలను 10 రోజులకు మాత్రమే పరిమితం చేయాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలను జారీ చేసింది.
హైకోర్టు తీర్పు ఆధారంగా ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’ సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వివరణతో పాటు కొత్త ఆదేశాలను జారీ చేసింది. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు అదనపు షోలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది.
ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం పది రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని తాజాగా ఆదేశాలిచ్చింది. ఐదు ప్రదర్శనల్లోనే ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, నగర పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టులో పిటిషన్ – తీర్పు ఇదే:
బాలకృష్ణ నటించిన డాకు మహ రాజ్, రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాల టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మొదటి 14 రోజుల పాటు అధిక ధరలకు విక్రయించుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడాన్ని సవాలు చేస్తూ గుంటూరుకి చెందిన అరిగెల శ్రీనివాసులు పిల్ వేశారు.
ఈ పిటిషన్‌పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు మొదటి 10 రోజుల పాటు అధిక ధరలకు టికెట్లు అమ్ముకునేందుకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో జీఓ-13 జారీచేసిందని వాదించారు. ఆ జీవోకు విరుద్ధంగా రెండు సినిమాలకు 14 రోజులపాటు అధిక ధరలకు అమ్ముకునేం దుకు వీలుగా మెమో జారీ చేయడాన్ని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా మెమో జారీ చేశారని ఫిర్యాదు చేశారు.
డాకు మహరాజ్‌లో నటించిన బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారని, ముఖ్యమంత్రికి సొంత బావమరిది అని, రామ్ చరణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న కొడుకని.. ఈ కారణాలతో రెండు సినిమాలకు అధిక ధరల వసూలుకు అనుమతులు జారీ చేశారని చెప్పారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఇద్దరు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని దీనిని దృష్టిలో పెట్టుకుని అర్థరాత్రి ప్రీమియర్ షోలను రద్దుచేయాలని వాదించారు. దీనిపై సీజే ధర్మాసనం స్పందించి సినిమాలకు అధిక ధరలను మొదటి 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు… తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరలపై క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా బెనిఫిట్ షోలను కూడా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.
సంబంధిత కథనం
టాపిక్