Best Web Hosting Provider In India 2024
Breakout Review: బ్రేక్ అవుట్ రివ్యూ – బ్రహ్మానందం కొడుకు హీరోగా నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Breakout Review: సింగిల్ క్యారెక్టర్‌తో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటించిన మూవీ బ్రేక్ అవుట్. ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
Breakout Review: టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటించిన బ్రేక్ అవుట్ మూవీ ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. సింగిల్ క్యారెక్టర్‌తో సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహించాడు. ఈ ప్రయోగాత్మక మూవీ ఎలా ఉందంటే?
మోనో ఫోబియా సమస్యతో…
మణి (రాజా గౌతమ్) సినిమా డైరెక్టర్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. తల్లి అడ్డుచెప్పిన టీచర్‌గా పనిచేసే తండ్రి మాత్రం మణి కలను ప్రోత్సహిస్తాడు. మణికి మోనో ఫోభియా ఉంటుంది. ఇంట్లోనే కాకుండా ఎక్కడైనా ఒంటరిగా ఉండటానికి భయపడిపోతాడు. మోనో ఫోబియాకు ట్రీట్మెంట్ తీసుకుంటుంటాడు. మణి రూమ్మేట్ అర్జున్ (కిరీటీ దామరాజు) అత్యవసర పనిమీద బెంగళూరు వెళతాడు.
వాచ్‌మెన్‌కు ఇచ్చిన కీ మిస్సవ్వడంతో తనకు పరిచయం ఉన్న రాజు (చిత్రం శ్రీను) అనే మెకానిక్ షెడ్‌కు మణి వెళ్లాల్సివస్తుంది. ఊరికి దూరంగా రాజు షెడ్ ఉంటుంది. అనుకోకుండా షటర్ క్లోజ్ కావడంతో షెడ్లోనే మణి ఒంటరిగా చిక్కుకుపోతాడు. ఫోన్లో సిగ్నల్ లేకపోవడం, వర్షం కారణంగా కరెంట్ పోవడంతో మణిలో భయం మొదలవుతుంది.
తప్పించుకునే క్రమంలో షెడ్లో ఓ గన్‌తో పాటు డెడ్బాబీ మణి కంటపడతాయి? ఆ గన్ ఎక్కడిది? అసలు రాజు ఎవరు?షెడ్లోనే చిక్కుకుపోయిన మణి మోనో ఫోబియా కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ఆ షెడ్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడు? ప్రాణాలతో మణి బయటపడ్డాడా? లేదా? అన్నదే బ్రేక్ అవుట్ మూవీ కథ.
కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా…
సినిమా అంటే హీరోహీరోయిన్లు…ఓ విలన్.. రొమాంటిక్ డ్యూయెట్లు, ఫైట్లు ఉండాల్సిందే. భాషా భేదాలతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ఈ ఫార్ములా కనిపిస్తుంది. ఈ కమర్షియల్ ఫార్మెట్కు భిన్నమైన సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. బ్రేక్ అవుట్ అలాంటి ప్రయోగమే
రాజా గౌతమ్…
సింగిల్ క్యారెక్టర్‌తో రూపొందిన బ్రేక్ అవుట్ మూవీలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటించాడు. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి అతడు చేసిన ప్రయత్నిమిది. సినిమా ఆరంభంలో నాలుగైదు పాత్రలు అలా వచ్చి ఇలా వెళతాడు. ఆ తర్వాత క్లైమాక్స్ సీన్ వరకు రాజా గౌతమ్ ఒక్కడే సినిమాలో కనిపిస్తాడు. సినిమా మొత్తం ఒకే రూమ్‌లో సింగిల్ లోకేషన్లో సాగుతుంది.
షెడ్లో చిక్కుకుపోతే…
ఓ షెడ్లో ఒంటరిగా లాక్ అయిన యువకుడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడు? ఈ క్రమంలో ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నాడనే అనే సింపుల్ పాయింట్‌తో దర్శకుడు సుబ్బు ఈ కథను రాసుకున్నాడు.ఈ పాయింట్‌కు మోనో ఫోబియా అనే సమస్యను యాడ్ చేసి చివరి వరకు ఈ సినిమాతో ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచే ప్రయత్నం చేశాడు.
లాజిక్స్ మిస్…
సినిమా మొదలైన తీరు…హీరోకు ఉన్న సమస్యను వివరించడం వరకు బ్రేక్ అవుట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగింది. ఎప్పుడైతే హీరో షెడ్లో లాక్ అవుతాడో అక్కడి నుంచే దర్శకుడు కథపై పట్టు వదిలేసినట్లుగా అనిపిస్తుంది. షెడ్ నుంచి హీరో తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు లాజిక్‌లకు దూరంగా సాగుతాయి. ఆ షెడ్లో డెడ్‌బాడీ, రివాల్వర్ అంటూ చిన్న ట్విస్ట్‌లతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని చూశాడు దర్శకుడు. ఆ పాయింట్‌ను ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్‌గా మలచలేకపోయాడు.
హీరో ఎలా బయటపడతాడో అనే క్యూరియాసిటీతో ఆడియెన్స్ ఎదురుచూసే సీన్స్ సినిమాలో పెద్దగా లేవు. క్లైమాక్స్ కూడా కన్ఫ్యూజింగ్గానే ఎండ్ అవుతుంది. సినిమా నిడివి గంట ఏడు నిమిషాలు మాత్రమే…కానీ లెంగ్త్ ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది.
వన్ మెన్ ఆర్మీ…
బ్రేక్ అవుట్ సినిమాకు రాజా గౌతమ్ వన్ మెన్ ఆర్మీలా నిలిచాడు. మణి పాత్రలో డిఫరెంట్ ఎమోషన్స్ పలకించాడు. మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. చిత్రం శ్రీను, కిరిటీ దామరాజు, ఆనంద చక్రపాణి గెస్ట్ రోల్స్‌లో కనిపించారు.
సర్వైవల్ థ్రిల్లర్ మూవీ…
సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్‌ను, ప్రయోగాత్మక సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్‌ను బ్రేక్ అవుట్ మూవీ మెప్పిస్తుంది. అలాంటి వారికి ఈ వీక్ మంచి ఛాయిస్‌గా ఈ మూవీ నిలుస్తుంది.