Best Web Hosting Provider In India 2024
Hyderabad Durgam Cheruvu : 4 నెలల్లో దుర్గం చెరువు FTL, బఫర్ జోన్ ఫిక్స్ చేస్తాం -హైడ్రా ప్రకటన
Hyderabad Durgam Cheruvu : రాబోయే నాలుగు నెలల్లోనే దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ వివాదానికి తెర దించుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఎఫ్టీఎల్ తో పాటు బఫర్ జోన్ ను కూడా ఫిక్స్ చేస్తామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు.
దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ విషయంలో వివాదాలకు ఆస్కారం లేకుండా 4 నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. హైడ్రా కార్యాలయంలో దుర్గం చెరువు పరిసరవాసులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు.
ఎఫ్టీఎల్ నిర్దారిస్తాం – హైడ్రా కమిషనర్
ఈ సందర్భంగా మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్… దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ విషయంలో వివాదాలకు ఆస్కారం లేకుండా చూస్తామన్నారు. ఎఫ్‌టీఎల్ నిర్ధారణలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో పాటు.. ఐఐటీ, బిట్స్‌పిలానీ, జేఎన్‌టీయూ వంటి విద్యా సంస్థల ఇంజినీర్లను కూడా భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ ఆర్ ఎస్‌సీ), సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ ఇలా అన్ని శాఖలను ఇందులో భాగస్వామ్యం చేసి సమస్యకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం….
ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజీలను, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేసిన తర్వాత తుది నివేదికను రూపొందిస్తామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి గతంలో హెచ్ ఎం డీఏ ఇచ్చిన ప్రిలిమనరీ నోటిఫికేషన్‌పై పరిసరప్రాంతాల నివాసితుల అభ్యంతరాలను రంగనాథ్ పరిశీలించారు. ఆ తర్వాత నివాసితుల వాదనలను రికార్డు చేశారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 6 కాలనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని వారి వద్ద ఉన్న సమాచారాన్ని లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మెన్ గా ఉన్న రంగనాథ్ కు అందజేశారు. ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి అభ్యంతరాలను అందజేశారు. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి 25 ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరారు.
25 ఏళ్ల కాలంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏనాడూ తమ వాదనలు ఇలా బహిరంగంగా వినలేదని చెప్పుకొచ్చారు. తమను హైడ్రా ప్రధాన కార్యాలయానికి పిలిపించి ఎఫ్‌టీఎల్ అంశంలో తమ అభ్యంతరాలను విని పరిష్కార మార్గాలు కనుక్కొంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
“దశాబ్దాల కాలంలో ఎఫ్‌టీఎల్ పైన ఒక్కో విభాగం ఒక్కో లెక్క చెబుతోంది. మిగతా చోట్ల చెరువులు మాయం అయితే.. ఇక్కడ ఈ చెరువు ఎఫ్‌టీఎల్ పెరుగుతూ వస్తోంది. వాస్తవానికి 65.12 ఎకరాలు కాగా.. ఇప్పడు ఒక్కో శాఖ ఒక్కో లెక్క చెబుతోంది. సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు తమను కబ్జాదారులుగా చూపెడుతున్నారు” అని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఖాళీగా ఉన్న స్థలాల్లో ఇల్లు కట్టుకోలేకపోతున్నామని… అలాగే అవసరాలకు తమ ఇంటిని అమ్మలేకపోతున్నామని పలువురు ఫిర్యాదు చేశారు.
“2000 సంవత్సరంలో భారీ వర్షాలకు చెరువు నిండి.. చుట్టు పరిసర ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. దానిని పరిగణలోకి తీసుకునే ఎఫ్‌టీఎల్ అంటున్నారు. అప్పటి నుంచి వివాదం నెలకొంది. ఎఫ్‌టీఎల్ నిర్ధారించినప్పడు తమ వాదనలను పరిగణలోకి తీసుకోవాలి” అని కాలనీ వాసులు కోరారు.
అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. శాస్త్రీయ పద్ధతులు పాటించి ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ధారిస్తామన్నారు. లేక్ మేమోయీస్, గ్రామ రికార్డులు సర్వే నంబర్ల ఆధారంగా ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
సంబంధిత కథనం
టాపిక్