Best Web Hosting Provider In India 2024
Nellore Crime : నెల్లూరులో విషాదం, కొడుకుని అత్త మందలించిందని కోడలు ఆత్మహత్య
Nellore Crime : నెల్లూరులో విషాదం ఘటన చోటుచేసుకుంది. మనవడు సోఫాపై మూత్రం పోశాడని నాన్నమ్మ మందలించింది. తన కుమారుడ్ని అత్త మందలిందని మనస్తాపంతో కోడలు ఆత్మహత్య చేసుకుంది.
Nellore Crime : నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన కొడుకుని అత్త మందలించిందని కోడలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ ఘటన నెల్లూరు నగరంలోని కోటమిట్ట ఎర్ర దర్గా వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని కోటమిట్ట ఎర్ర దర్గా వద్ద నివాసం ఉంటున్న నజీర్, షమీమ్ దంపతుల రెండో కుమార్తె రుబీనా (22)కు మూడేళ్ల క్రితం అంజద్‌తో వివాహం జరిగింది. దంపతులు అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. వీరికి రెండేళ్ల పాప, పది నెలల బాబు ఉన్నారు. అయితే ఈ క్రమంలో సోఫాపై రుబీనా పది నెలల కుమారుడు మూత్రం పోశారు. ఆ బాలుడిని అత్త (బాలుడికి నాన్నమ్మ) గౌసున్నీసా మందలించారు.
తన కుమారుడిని అత్త మందలించడంతో రుబీనా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో భర్త పాల ప్యాకెట్ కోసం బయటకెళ్లిన సమయంలో తన బెడ్‌రూంలోకి వెళ్లి గడియవేసుకుని రుబీనా సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. భర్త అంజద్ పాలు ప్యాకెట్టు పట్టుకుని ఇంటికి వచ్చాడు. అయితే భార్య బెడ్ రూంలో ఉందని తెలుసుకుని తలుపులు తట్టినా తీయలేదు. దీంతో కిటికీ అద్దాలను పగలగొట్టి భర్త చూడగా, భార్య సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది.
దీంతో వెంటనే భర్త తలుపులను పగలగొట్టి ఫ్యాన్‌కు వేలాడుతున్న భార్యను దింపి హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో వైద్యులు పరీక్షించి రుబీనా అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రుబీనా తల్లి ఫిర్యాదు మేరకు సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో రుబీనా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బందువులు కన్నీరుమున్నీరు అయ్యారు. దీంతో కోటమిట్ట ఎర్ర దర్గా ప్రాంతం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రుబీనా తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె అత్త గౌసున్నీసా కారణమని ఆరోపిస్తోన్నారు. దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్