Best Web Hosting Provider In India 2024
Sankranti Rush : సంక్రాంతి రద్దీతో బస్టాండ్లు కిటకిట, ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు వినియోగించుకోవాలని సీఎం ఆదేశాలు
Sankranti Rush : సంక్రాంతికి సొంతూళ్లకు వస్తున్న ప్రయాణికులతో ఏపీలోని ప్రధాన నగరాల్లో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలను వీలైనంత తొందరగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆర్టీసీ, రవాణా అధికారులను ఆదేశించారు.
Sankranti Rush : హైదరాబాద్ సహా పలు రాష్ట్రాల నుంచి సంక్రాంతి సమయంలో ఏపీకి పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు. సంక్రాంతికి అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ 7200 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. అయినప్పటికీ సమయానికి బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రయాణికులను వీలైనంత తొందరగా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రైవేటు స్కూల్స్, కాలేజీల బస్సులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, రవాణా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు
ఫిట్నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి, ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వాటిని ఉపయోగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో ఈ విధంగా ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం సహా పలు ప్రధాన నగరాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. లక్షలాది మంది ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులు సరిపోవడంలేదు.
ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు వినియోగించుకోండి-ఆర్టీసీ ఎండీ
సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు… ఆర్టీసీ, రవాణా శాఖ, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బస్టాండ్లలో సంక్రాంతి రద్దీపై అధికారులతో చర్చించారు. రద్దీని తగ్గించేందుకు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. బస్టాండ్లలో ప్రయాణికులు నిరీక్షించకుండా…వీలైనంత తొందరగా బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన చోట్ల ప్రైవేటు స్కూళ్లు, కాలేజీ బస్సులను వినియోగించుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బస్టాండ్లలో తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆర్టీసీ ఎండీ ఆదేశించారు. అయితే ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల ఎంపిక బాధ్యత రవాణా శాఖ అధికారులు తీసుకోవాలని, ముందుగా బస్సుల కండిషన్ చెక్ చేయాలన్నారు.
పండుగ రద్దీ-7200 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ 7200 అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. ఏపీలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు 3900 స్పెషల్ బస్సులు, హైదరాబాద్ నుంచి 2153 బస్సులు, బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. తిరుగు ప్రయాణానికి ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నామని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది. రానూపోనూ టికెట్లు ఒకేసారి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఆన్ లైన్ బుకింగ్ చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు. స్పెషల్ బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు.
సంబంధిత కథనం
టాపిక్