Best Web Hosting Provider In India 2024
Jharkhand school case : స్కూల్లో.. 80 మంది అమ్మాయిల షర్ట్లు తీయించి ఇంటికి పంపిన ప్రిన్సిపాల్!
Jharkhand school case : ఝార్ఖండ్‌లోని ఒక స్కూల్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 80 మంది విద్యార్థినులను షర్ట్లు విప్పించి, ఇళ్లకు పంపించాడు ఓ ప్రిన్సిపాల్. అసలేం జరిగిందంటే..
ఝార్ఖండ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. క్లాస్ 10కి చెందిన 80 మంది విద్యార్థినులను షర్ట్లు లెకుండా ఇంటికి పంపించాడు ఓ స్కూల్ ప్రిన్సిపాల్! ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఇదీ జరిగింది..
ఝార్ఖండ్ ధన్బాద్లో జోరాపోఖర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక ప్రతిష్ఠాత్మక ప్రైవేట్ స్కూల్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. క్లాస్ 10 విద్యార్థినులు “పెన్ డే” నిర్వహించుకున్నారు. కానీ అది ప్రిన్సిపాల్‌కి నచ్చలేదు! చొక్కాలపై మెసేజ్‌లు రాసుకున్నందుకు కోపంతో, 80 మంది అమ్మాయిలను షర్ట్లు తీసేయాలని ఆదేశించాడు. బలవంతం చేయడంతో చొక్కాలు విప్పేసిన అనంతరం విద్యార్థినులు.. షర్ట్లు లేకుండానే, బ్లేజర్లలో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.
వాస్తవానికి షర్ట్‌లపై మెసేజ్‌లు రాసుకున్నందుకు విద్యార్థినులు క్షమాపణలు చెప్పినప్పటికీ, ప్రిన్సిపాల్ ఒప్పుకోలేదని, షర్ట్లు తీయించి ఇంటికి పంపించాడని తెలుస్తోంది.
ఝార్ఖండ్ స్కూల్ ఘటనపై ధన్‌బాద్ డిప్యూటీ కమిషనర్ మాధవి మిశ్రాకు విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
విచారణ కమిటీ ఏర్పాటు..
ధన్‌బాద్ డిప్యూటీ కమిషనర్ మాధ్వీ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. పలువురు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిందని తెలిపారు. ఝార్ఖండ్ స్కూల్ ఘటనపై విచారణ జరిపేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు.
“ప్రిన్సిపాల్‌పై పలువురు సంరక్షకులు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల్లో కొందరితో కూడా మాట్లాడాం. ఈ విషయాన్ని అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశాం,” అని మిశ్రా మీడియాకు తెలిపారు.
డీసీ ఏర్పాటు చేసిన కమిటీలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఇందులో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, జిల్లా విద్యాధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి ఉంటారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీసీ స్పష్టం చేశారు.
ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేసినప్పుడు ఝరియా బీజేపీ ఎమ్మెల్యే రాగిణి సింగ్ కూడా తల్లిదండ్రులతో కలిసి శనివారం డిసి కార్యాలయానికి వెళ్లారు.
ఈ ఘటన సిగ్గుచేటని, దురదృష్టకరమని సింగ్ అభివర్ణించారు.
మరోవైపు ఝార్ఖండ్ స్కూల్ ఘటన అటు స్థానికంగా, ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెన్ డే వంటివి సహజమైన విషయమే అని, కానీ ప్రిన్సిపాల్ చేసింది తప్పని అందరు మండిపడుతున్నారు. ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link