Best Web Hosting Provider In India 2024
AP Sankranti Kodi Pandelu : తగ్గేదేలే..! ఆంక్షలెన్ని ఉన్నా జోరుగా కోడి పందేలు, చేతులు మారనున్న కోట్ల రూపాయలు
AP Cock fight competitions : సంక్రాంతి వేళ ఏపీలో కోడి పందేలకు బరులు సిద్ధమయ్యాయి. ఓవైపు కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ… చాలాచోట్ల నిర్వాహకులు తగ్గేదేలే అన్నట్లు ముందుకెళ్తున్నారు. అక్కడక్కడ బరులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఈసారి కూడా కోట్లల్లోనే డబ్బులు చేతులు మారే అవకాశం ఉంది.
సంక్రాంతి అంటే వెంటనే గుర్తుకొచ్చేది కోడి పందేలు…! ఉభయ గోదావరి జిల్లాలతో సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగనున్నాయి. లక్షలు కాదు కోట్లలోనే డబ్బులు చేతులు మారే అవకాశం ఉంటుంది.
కోడి పందేలకు పెట్టింది పేరు ఉభయ గోదావరి జిల్లాలు…! కృష్ణా, గుంటూరు జిల్లాలో మోస్తారుగా జరుగుతాయి. ఇతర జిల్లాల్లో అక్కడక్కడ జరుగుతాయి. అయితే కోడి పందేలపై రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోడి పందేలాను అడ్డుకోవాలని స్పష్టం చేసింది.
ఓవైపు హైకోర్టు ఆంక్షాలెన్ని ఉన్నా కోడి పందేలు జోరు మాత్రం తగ్గటం లేదు. పందెంరాయుళ్లు తగ్గేదే లేదనంటూ అడుగులు వేస్తున్నారు. అడపాదడపా పోలీసులు హడావుడి చేసినప్పటికీ…. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులే రంగంలోకి దిగడంతో ఈసారి కూడా కోడి పందేలు జోరుగా సాగనున్నాయి. ఒకప్పుడు సరదాగా మొదలైన పందేలు… ఇప్పుడు ఏకంగా ఒక వ్యాపారంగా మారాయని చెప్పొచ్చు. ఈ పందేలు ఆడేందుకు బలంగా ఉన్న కోళ్లను ఎంపిక చేస్తున్నారు. కొన్ని నెలల ముందునుంచే వాటికి పౌష్టికాహారం పెట్టి పందేళ్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నారు.
భారీ పందేలు ఇక్కడే….
తూర్పు గోదావరి జిల్లాలో మురమళ్ల, కాట్రేనికోన, వేట్లపాలెం, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, వెంప, సీసలి, దుంపగడప ప్రాంతాలు కోడి పందేలకు పేరు పొందాయి. అయితే ఇవి కాకుండా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కోడిపందేలా జరుగుతాయి. పెద్ద వాటిల్లో రోజుకు 20 నుంచి 30 పందేలు జరిగితే… గ్రామాల్లో జరిగే చిన్న వాటికి లెక్క ఉండదు. సంక్రాంతి మూడు రోజుల పాటు జరిగే వేలాది కోడి పందాలకు కోడి పుంజులు అవసరమవుతాయి.
ఈ జాతి కోళ్లదే హవా…
కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, కేతువ వంటి జాతి కోళ్లు పందేల్లో కాలు దువ్వనున్నాయి. వీటి హవానే ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ఈ సారి కూడా ఈ జాతి కోళ్లదే హవా కొనసాగుతుందని పందేం రాయుళ్లు అంచనా వేస్తున్నారు. అయితే ఉభయ గోదావరి జిల్లాల్లో సొంతంగా కోడి పుంజులను మేపడం, వాటికి పందేలను నేర్పడం వంటివి చేస్తారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కోడి పుంజులు సరిపోగా… ఇతర ప్రాంతాల నుంచి కోడి పుంజులను తెప్పిస్తారు. కోడిపందేల్లో రంగంలోకి దింపే భీమవరం బ్రీడ్ పుంజులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సంక్రాంతి కోడి పందేల కోసం ఉండి, ఆకివీడు, చెరుకుమిల్లి, చినమిరం, కాళ్ల, కోనసీమలోని అమలాపురం, లంక, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో భీమవరం బ్రీడ్ కోడిపుంజుల పెంచుతున్నారు. వీటి పెంపకంతో గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి కూడా పొందుతున్నారు.
నిర్వహణ కోసం డబ్బులు వసూలు….
కోళ్ల పందేల కోసం బరుల ఏర్పాటు కోసం ఒక ప్రాంతాన్ని నిర్వాహకులు ఎంపిక చేస్తారు. అందులో ఒరిని ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహిస్తుంటారు. ఈ పందేల్లో గెలిచిన వారి నుంచి కొంత నగదును వసూలు చేస్తుంటారు. ఇదే కాకుండా ఈ పందేలు ఆడటానికి, చూడటానికి వచ్చిన వారి నుంచి కూడా టోకెన్లు పెట్టి మరి కొంత నగదు వసూలు చేస్తారు.
పందేలు జరిగే ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇలా పందేలు నిర్వహించడం వల్ల ప్రజల నుంచి వివిధ రూపాల్లో భారీగా నగదు వసూలు చేస్తున్నారు.
కోట్లల్లోనే …!
కోళ్ల పందేలను సంక్రాంతి పండుగ లక్ష్యంగానే నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా గంటల వ్యవధిలోనే లక్షలకు లక్షలు చేతులు మారుతుంటాయి. పందెం కోళ్లపై పెట్టుబడి ఆదాయం రెండింతలు అవుతుంది. దీంతో చాలా మంది ఈ పందేలను కాయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా సంక్రాంతి సీజన్‌లో కోడి పందేలా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ఉభయ గోడావరి జిల్లాల్లో ఇప్పటికే బరులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద కోడి పందేల్లో కోట్ల రూపాయాలు చేతులు మారుతాయి.
ఈ పందేలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం భారీగా తరలివస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, చెన్నై తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ పందేలను చూడటానికి వస్తుంటారు. సామాన్యులతో పాటు రాజకీయ, సినీ, వ్యాపార, ఎన్ఆర్ఐలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అనేక మంది వస్తుంటారు. వీరు కూడా పందేలు కాయడానికి ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజులనే లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది.
కోళ్ల పందేలు జరగకుండా ఆపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం వందల కొలది బరులు సిద్ధం చేశారు. రాజకీయ ప్రముఖులు రంగంలోకి దిగడంతో పోలీసులు కూడా చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడక్కడ బరులపై దాడులు చేసినట్లు పోలీసులు హడావుడి చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ సారి కూడా కోళ్ల పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతాయని అంచనా వేస్తున్నారు…!
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్