Best Web Hosting Provider In India 2024
Sesame Seeds Risks: సంక్రాంతి వంటల్లో నువ్వులు వాడితే మంచిదని తెలుసు, అధికంగా తింటే వచ్చే నష్టాలేంటో తెలుసా?
Sesame Seeds Risks: పిండి వంటల పండుగ సంక్రాంతి. దాదాపు నువ్వులు లేకుండా ఏ వంటను పూర్తి చేయరు. ఆరోగ్యానికి మంచివి, సంక్రాంతికి నువ్వులు తినే సంప్రదాయం అనే కారణాలతో కచ్చితంగా తింటుంటాం. మరి ఆ నువ్వులను మోతాదుకు మించి తినడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసా..
సంక్రాంతి పిండివంటల్లో నువ్వులు కీలకపాత్ర పోషిస్తాయి. తెలంగాణలో చేసే సకినాల్లో, ఆంధ్రాలో చేసే అరిసెల్లో నువ్వులు కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే, సంక్రాంతికి నువ్వులు తింటే మంచిదని నమ్మకం. వాస్తవానికి నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసి కూడా, చాలా మంది పిండి వంటల్లో, ప్రత్యేకమైన కూరల్లోనూ నువ్వులు యాడ్ చేసుకుంటూ ఉంటారు. మరి అంతమేలు కలుగుజేసే నువ్వులను అతిగా తింటే వచ్చే అనర్థాల గురించి తెలుసా.. రుచిగా ఉన్నాయని పిండివంటలు లాగించేసే ముందు ఇవి తెలుసుకోండి.
నువ్వులు (Sesame Seeds) అధికంగా తినడం వల్ల వచ్చే నష్టాలు:
1. బరువు పెరగడం
నువ్వులలో అధిక కేలరీలు ఉంటాయి. వాటిలో అధిక మోతాదులో కొవ్వు ఉండటంతో, ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోకి అధిక కేలరీలు చేరుతాయి. ఇది బరువు పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది.
2. జీర్ణక్రియ సమస్యలు
నువ్వుల్లో ఉన్న అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ, వాటిని అధికంగా తీసుకోవడం వలన గ్యాస్, బ్లోటింగ్, ఉబ్బరం లేదా కడుపులో నొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
3. రక్తపోటు తగ్గడం
నువ్వులలొ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. అయితే, దీనిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు చాలా తగ్గిపోవచ్చు. ఇది తలతిరగడం సమస్యలు కలిగించవచ్చు. ముఖ్యంగా రక్తపోటు మందులు తీసుకుంటున్న వారికి ఇది ప్రమాదకరంగా మారొచ్చు.
4. అలర్జీ సమస్యలు
కొంతమంది వ్యక్తులు నువ్వుల తింటే అలర్జీకి లోనవుతారు. అధికంగా తినడం వలన చర్మంపై ర్యాషెస్, దద్దుర్లు, కంటి నుంచి నీళ్లు, లేదా కడుపు నొప్పి వంటి అలర్జీ లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది.
5. మూత్రపిండాల రాళ్ళు (కిడ్నీ స్టోన్స్)
నువ్వుల్లో ఆక్సాలేట్లు అధికంగా ఉంటాయి. ఆక్సాలేట్లు అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. కిడ్నీ స్టోన్లతో బాధపడుతున్నవారు ఎక్కువగా నువ్వులు తినడం వలన ఈ సమస్య మరింత దారుణంగా ఉండొచ్చు.
6. ఇనుము అధికం
నువ్వుల్లో ఇనుము (ఐరన్) సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి వాటిని అధికంగా తీసుకోవడం వలన శరీరంలో ఇనుము నిల్వలు పెరగవచ్చు. ఇది లివర్, గుండె వంటి అవయవాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా హేమోక్రోమాటోసిస్ అనే రోగంతో బాధపడుతున్న వారిలో ఇది ఎక్కువ సమస్యగా మారే అవకాశం ఉంది.
నువ్వులు తినడం వల్ల ప్రయోజనాలు:
నువ్వులు ఆరోగ్యానికి చాలా లాభదాయకమైనవి, కానీ వాటిని అధికంగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు రావచ్చు. సరైన పరిమాణంలో అంటే రోజుకు 1-2 టేబుల్ స్పూన్ల నువ్వులు తినడం మంచిది. వీటిని రెగ్యూలర్ గా తీసుకోవడం వల్ల హృదయ ఆరోగ్యం మెరుగవుతుంది. ఎముకలలో ఉన్న బలహీనత తగ్గిపోతుంది. జీర్ణవ్యవస్థకు సహకరిస్తాయి. చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు కలిగి ఉండి జాయింట్ సమస్యలు రాకుండా చేస్తుంది. ఇనుము పుష్కలంగా ఉండి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు, పోషకాల సహాయంతో శరీరానికి తగిన శక్తి అందుతుంది. కానీ, వీటిని తినే ముందు, మీ ఆరోగ్య పరిస్థితి బాగుండలేకపోతే డాక్టర్ సలహా తీసుకోవడం మరిచిపోకండి.
సంబంధిత కథనం