Best Web Hosting Provider In India 2024
AP Roads : ఏపీలో మారుతున్న రోడ్ల దశ, శరవేగంగా గుంతలు పూడ్చివేత, విస్తరణ-రూ.4593 కోట్లతో పనులు ప్రారంభం
AP Roads : ఏపీలో రోడ్ల దశ మారుతోంది. వాహనదారులకు తక్షణ ఉపశమనం కోసం రోడ్లపై గుంతలను శరవేగంగా పూడుస్తు్న్నారు. పలు చోట్ల నూతన రోడ్లు వేస్తున్నారు. రానున్న ఐదేళ్లలో 40,178 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టాలని అంచనాలు వేస్తున్నారు.
AP Roads : సంక్రాంతికి నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలకు సొంతూళ్లకు వెళ్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా తరలివస్తుంటారు. ప్రజల ప్రయాణాల సజావుగా సాగాలంటే ముఖ్యంగా రోడ్డులు సవ్యంగా ఉండాలి. గత ఐదేళ్లలో ఏపీలో రోడ్ల పరిస్థితి అంతగా బాగాలేదు. ఎక్కడ చూసిన గుంతల రోడ్లే దర్శనం ఇచ్చేవి. అసెంబ్లీ ఎన్నికల్లో రోడ్ల సమస్య కూడా కీలక పాత్ర పోషించింది. సంక్షేమంపై దృష్టి పెట్టిన గత ప్రభుత్వం…రోడ్ల మరమ్మత్తులను మరిచింది. దీంతో గుంతల రోడ్లలో ప్రయాణాలు చేయలేక ప్రజలు నానాఅవస్థలు పడేవారు. ఏపీని గుంతల రాజ్యం చేశారని…కూటమి పార్టీలు విమర్శలు చేస్తూ, తాము అధికారంలోకి వస్తే రహదారులను నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు…ఇప్పుడు రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాయి. సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చే వాళ్లు రోడ్లు బాగోలేదని ఫిర్యాదులు చేయకూడదని సీఎం చంద్రబాబు సైతం అధికారులను ఆదేశించారు.
ఏపీలో రోడ్లను నిర్మాణం, విస్తరణ చేపట్టేందుకు రూ.4593 కోట్లతో పనులు ప్రారంభించారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు రోడ్ల గుంతలకు శరవేగంగా మరమ్మత్తులు చేస్తు్న్నారు. కొన్ని చోట్ల కొత్త రోడ్లు వేస్తున్నారు. రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. గుంతలు పూడ్చడంతో వాహనదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. 2025-2026 ఆర్థిక సంవత్సరం నుంచి 2029-2030 వరకు ఐదేళ్లలో 40,178 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాలని ఇంజినీర్లు అంచనా వేశారు. ఇందుకు రూ.43,173 కోట్ల వ్యయం అవుతుందని ఇంజినీర్లు అంచనా వేశారు.
–రూ.242 కోట్లతో ఆదోని బైపాస్ రోడ్డు
— రూ.245 కోట్లతో దోర్నాల కుంట జంక్షన్ రోడ్డును 2 లైన్ల రోడ్డుగా విస్తరణ
— రూ.601 కోట్లతో సంగమేశ్వరం- నల్లకాలువ, వెలుగోడు- నంద్యాల రోడ్లను 2 లైన్లుగా విస్తరణ
–రూ.160 కోట్లతో 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్ తాడిపత్రి బైపాస్ రోడ్డు
–రూ.135 కోట్లతో మైదుకూరు-ముదిరెడ్డిపల్లి రోడ్డును 2 లైన్ల రోడ్డుగా విస్తరణ
— రూ.1,321 కోట్లతో వేంపల్లి చాగలమర్రి సెక్షన్ విస్తరణ
–రూ.394 కోట్లతో దావులపల్లి- మల్లపాలెం రోడ్డును 2 లైన్ల రోడ్డుగా విస్తరణ
–రూ.369 కోట్లతో జీలుగుమిల్లి- బుట్టాయగూడెం & ఎల్ఎన్డీ పేట-పట్టిసీమ రోడ్లను 2 లైన్లుగా విస్తరణ
–రూ.882 కోట్లతో కొండమోడు- పేరేచెర్ల రోడ్డును 4 లైన్లుగా విస్తరణ
— రూ.244 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ పాడేరు బైపాస్ రోడ్డు
ఏపీలో దశాబ్దాలుగా రోడ్ల సౌకర్యానికి నోచుకోని గ్రామాలకు నూతన రహదారుల నిర్మాణాలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన-4లో ఈ గ్రామాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాథమికంగా 685 గ్రామాలను గుర్తించారు. నాలుగేళ్లలో ఈ గ్రామాల్లో తారు రోడ్లు నిర్మించి సమీపంలో ప్రధాన రహదారులకు అనుసంధానించనున్నారు. పీఎం గ్రామీణ సడక్ యోజన-3 మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఈ పథకం కింద నాలుగో దశలో చేపట్టనున్న పనులకు డీపీఆర్ లు సిద్ధం చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. 500 కంటే ఎక్కువ జనాభా గల మైదాన ప్రాంతాలు, 200 కంటే ఎక్కువ జనాభా ఉండి వెనుకబడిన ప్రాంతాలు, 100 కంటే ఎక్కువ జనాభా కలిగి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా తారు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
ఏపీలో పీఎంజీఎస్వై-4 తొలి దశలో చేపట్టే పనుల కోసం జనవరి నెలాఖరులోగా డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్రం ఆమోదానికి పంపనున్నారు. రాష్ట్రంలో ప్రాథమికంగా గుర్తించిన 685 గ్రామాల్లో మొదటి విడతలో 150 గ్రామాల్లో నూతన రోడ్లు నిర్మించనున్నారు. గ్రామాల్లో ప్రస్తుత రోడ్ల పరిస్థితిని ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్