Best Web Hosting Provider In India 2024
AP Sports Policy: క్రీడలతో రాజకీయాలు .. నేషనల్ గేమ్స్ కు ఏపీ సర్కారు మొండిచేయి, పతకాలొస్తే మాత్రం ప్రచారం..
AP Sports Policy: జాతీయ స్థాయిలో జరిగే నేషనల్ గేమ్స్‌లో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు నగుబాటు తప్పేలా లేదు. ఏపీ ప్రభుత్వం, శాప్ అనుసరిస్తున్న వైఖరితో ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ డీలా పడుతోంది. గత పదేళ్లుగా ఒలంపిక్ అసోసియేషన్‌పై రాజకీయ పట్టు కోసం జరుగుతున్న ప్రయత్నాలు శాపంగా మారాయి.
AP Sports Policy: ఆంధ్రప్రదేశ్‌లో కాదేది రాజకీయాలకు అతీతం అనట్టు మారిపోయింది. పతకాల సాధనకు క్రీడాకారులకు, క్రీడా సంఘాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఆ క్రీడా సంఘాల్లో వేలు ప్రజా ప్రతినిధులు వేలు పెడుతున్నా కట్టడి చేయలేకపోతోంది. అక్షర క్రమంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుండే ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది నేషనల్ గేమ్స్‌లో పాల్గొనడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఓ వైపు ఒలంపిక్ సంఘాన్ని తమకు అప్పగించాలని అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు మరోవైపు క్రీడల నిర్వహణకు ప్రభుత్వ సహకారం లేకపోవడం ఏపీలో క్రీడల దుస్థితికి అద్దం పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో గత పదేళ్లుగా రాజకీయాలు తప్ప ఆటలపై శ్రద్ధ కనిపించడం లేదు. అధికారంలో ఉన్న వారిని తప్పించి ఎన్నికైన సంఘాలపై పట్టు సాధించడానికి నేతలు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో కోర్టు చివాట్లు పెట్టి, తీర్పులిచ్చినా తీరు మార్చుకోవడం లేదు.
ఈ ఏడాది జనవరి 28నుంచి ఉత్తరాఖండ్‌లో నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ సంఘానికి ఇండియన్ ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి. ఉష నుంచి ఆహ్వానం కూడా కొద్ది నెలల క్రితమే అందింది. క్రీడాకారుల ఎంపిక కూడా కొలిక్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తరపున ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ సారథ్యంలో క్రీడాకారులు నేషనల్ గేమ్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి రాష్ట్రం తరపున నేషనల్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ తరపున ప్రాతినిథ్యం వహించాల్సి ఉంటుంది.
స్పందించని ఏపీ ప్రభుత్వం…
2025 జనవరి 28 నుంచి ఉత్తరాఖండ్‌లో ప్రారంభం కానున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అథ్లెట్లకు ఆర్థిక సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (APOA) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) నుండి స్పందన లేకపోవడంపై APOA అధ్యక్షుడు పురుషోత్తం ఆందోళన వ్యక్తం చేశారు, పదే పదే అభ్యర్థించినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం నిరాశకు గురి చేస్తోందని వాపోయారు.
గత రెండేళ్లుగా జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి ఎదురైనా సమస్యలే ఈ ఏడాది కూడా ఎదురవుతున్నాయని చెప్పారు. క్రీడాకారుల్ని తీసుకెళ్లడం, వారికి సదుపాయాలు కల్పించడంతో పాటు కిట్లను సమకూర్చడం వంటి విషయాల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదుని చెప్పారు.
ప్రతిష్టాత్మక జాతీయ క్రీడలకు అథ్లెట్లను పంపడంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ఎత్తి చూపారు. “గత ప్రభుత్వంలో, జాతీయ క్రీడలకు నిధులు అందిస్తామని హామీలు ఇచ్చినా ఎన్నడూ నెరవేరలేదని ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. మరికొద్ది రోజులు మాత్రమే గడువు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం, శాప్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక విమానాలు..
జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి కేరళా, మహారాష్ట్ర ఒలంపిక్ సంఘాలకు అయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను సమకూరుస్తుంటే ఏపీలో మాత్రం కనీసం రైలు ఛార్జీలను చెల్లించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. పతకాలు తెచ్చిన క్రీడాకారులకు లక్షల్లో నజరానాలు చెల్లించే ప్రభుత్వం క్రీడాకారులకు కనీస ప్రోత్సాహం ఇవ్వకపోవడాన్ని తప్పు పడుతున్నారు.
ఈ ఏడాది ఏపీ తరపున దాదాపు 250మంది క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతినిధులు నేషనల్ గేమ్స్‌కు వెళ్లాల్సి ఉంది. ప్రధాని సమక్షంలో ప్రారంభ వేడుకల్ని నిర్వహిస్తారు. రాష్ట్రాల తరపున మొదటి వరుసలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు కవాతు చేయాల్సి ఉంటుంది. అయితే ఏపీ క్రీడాకారులకు కావాల్సిన జెర్సీలు, దుస్తులు సమకూర్చుకోడానికి ప్రభుత్వం సాయం చేయడం లేదని క్రీడా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఈ ఏడాది ఏపీ జట్టు పాల్గొనడానికి దాదాపు రూ.33 లక్షలు ఖర్చు అవుతుందని దాని కోసం శాప్‌కు ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ చెబుతోంది. ప్రభుత్వం నుండి వచ్చే సహకారం, నైతిక మద్దతు కూడా ఆటగాళ్ల మనోధైర్యాన్ని గణనీయంగా పెంచుతుందని జాతీయ క్రీడలలో ఏపీ జట్టు చీఫ్-డి-మిషన్ బడేటి వెంకట రామయ్య చెప్పారు. సాధారణంగా జాతీయ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించే జట్లకు ముఖ్యమంత్రి వీడ్కోలు పలికే సాంప్రదాయం ఉన్నా రాజకీయాల కారణంతో అది కనుమరుగైందని చెబుతున్నారు.
2025 జాతీయ క్రీడలకు ఏపీ ప్రభుత్వం సాయం చేయాలని వేడుకుంటున్నా ముఖ్యమంత్రిని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఒలంపిక్ సంఘం ఆరోపించింది. సీఎంను నేరుగా కలిసి వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నారని ఏపీఓఏ అధ్యక్షుడు ఆరోపించారు.
(ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో రాజకీయ కాలుష్యంపై మరో కథనంలో)
టాపిక్