Best Web Hosting Provider In India 2024
TG Ministers: తెలంగాణ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై తాజా అప్డేట్ ఇదే.. పార్టీలకతీతంగా పేదలకు ఇళ‌్ల కేటాయింపు
TG Ministers: తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డిలు కీలక అప్డేట్ ఇచ్చారు. జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుందని ప్రకటించారు.
TG Ministers: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి,పొన్నంలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదలైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. 26 న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా వెల్లడి కానున్నట్టు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు పొంగులేటి వివరించారు. ఖమ్మంలోని కూసుమంచిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. పేదవారి సొంతింటి కల పది సంవత్సరాలుగా అలాగే మిగిలిపోయిందని, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అనే విధంగా హామీలు ఇచ్చామని చెప్పారు.
దేశంలోనే ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను ఆనాటి పెద్దలు కొల్లగొట్టారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం కేటాయిస్తున్నట్టు చెప్పారు.గత ఏడాది డిసెంబర్ 13న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేశామని, సంక్రాంతి రోజున వాటిని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అనర్హులకు ఇస్తే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం, తెలంగాణలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని డిప్యూటీ సిఎం భట్టి చెప్పారు. లబ్దిదారుల ఎంపికలో అధికారులు , ఇందిరమ్మ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమేనని పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలంగాణ మంత్రులు ప్రకటించారు. ఇళ్ల కేటాయింపులో దళారుల పాత్ర ఉండదని ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నామని, ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు.
రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పారు. అదే రోజు నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్దిదారుల వివరాలు కూడా వెల్లడిస్తామన్నారు.
సంబంధిత కథనం
టాపిక్