Best Web Hosting Provider In India 2024
మా హయాంలోని ప్రాజెక్టులను తనవిగా చెప్పడం హేయం
మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం
మేం సంపద సృష్టిస్తే ఏడు నెలల్లోనే ఆవిరి చేసేశారు
గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, ఇంటింటికీ గ్యాస్ సరఫరా జగన్ ఘనతే
మా హయాంలో వచ్చిన ప్రాజెక్టులపైనా తన ఆర్భాట ప్రచారం
కర్నూలులో పవన్ ప్రశంసించిన ప్రాజెక్టు జగన్ ఘనత కాదా?
సూటిగా ప్రశ్నించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
గ్రామాల అభివృద్ధిపై పవన్‌కళ్యాణ్‌తో చర్చకు సిద్ధం
గ్రామాలపై మేం ఖర్చు చేసిన నిధులు ఉమ్మడి రాష్ట్రంలోనూ పెట్టలేదు
ఉపాధి హామీ నిధులను కూటమి నాయకులు దోచుకు తింటున్నారు
ప్రెస్మీట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ
గుంటూరు: గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, వచ్చిన ప్రాజెక్టులను చంద్రబాబు తానే సాధించినట్టు చెప్పుకుంటున్నారని, ఇది సిగ్గుచేటు అని వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. జగన్‌గారు గత అయిదేళ్లలో గ్రామ స్థాయి నుంచి పాలన మొదలు పెట్టి శాశ్వత నిర్మాణాలతో గ్రామాల్లో సంపద సృష్టిస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక ఏడు నెలల్లోనే గ్రామాలను నిర్వీర్యం చేశారని ఆయన ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అప్పులతో అధోగతి పాలైంది తప్ప ఏ మూలనా అభివృద్ధి కనిపించడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం పడిపోయి అప్పుల పాలవుతున్నా అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని కేవలం ప్రచార ఆర్భాటంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. జమిలి ఎన్నికలు కనుక రాకపోతే చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరులోని క్యాంప్ ఆఫీస్‌లో వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
గతి తప్పుతున్న చంద్రబాబు మాటలు:
ఇటీవల సీఎం చంద్రబాబు మాటలు చూస్తుంటే, తాను ముఖ్యమంత్రి కాదు.. ఈ దేశానికే ప్రధాని అని ఫీలవుతున్నాడనిపిస్తోంది. రాత్రీపగళ్లూ ఏర్పడటానికి కూడా తానే కారణమన్నట్టు గొప్పలు చెబుతున్నాడాయన. అంతటితే ఆగిపోతే బాగుండేది. కానీ, భజన పత్రికలు ఆయన చెప్పేవన్నీ నిజాలే అన్నట్టు ప్రజల్ని భ్రమింపజేస్తున్నాయి. దాని కారణంగానే రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు.
చంద్రబాబు సుదీర్ఘ పరిపాలనలో.. తాను ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేశానని చెప్పుకునే ల్యాండ్ మార్క్ ఒక్కటీ లేదు. ఆయన చేసిందల్లా ఒక్కటే రాజకీయాల్లోకి అవినీతిని విచ్చలవిడిగా జొప్పించడమే. అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. వ్యవస్థలను సర్వ నాశనం చేశారు. ఎన్నికల ఖర్చును విచ్చలవిడిగా పెంచారు.
ఇంకా ఎల్ఎన్జీ (గ్యాస్) తానే తెచ్చానని చెబుతున్నాడు. సంక్రాంతికి విదేశాల నుంచి కూడా రావడానికి తానే కారణమన్నట్టు కలరింగ్ ఇస్తున్నాడు. నిజానికి చంద్రబాబు పాలన పుణ్యమా అని గ్రామాలన్నీ ఖాళీ అయ్యాయి.
వైయస్ జగన్ హయాంలోనే..:
గ్రామాలకు పునరుజ్జీవం వచ్చిందంటే, అందుకు జగన్‌గారి ఐదేళ్ల పాలనే కారణం. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు, విలేజ్ క్లీనిక్స్.. వీటన్నింటితో గ్రామాల రూపురేఖలు మారాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ఇంటి గడప వద్దకే ప్రభుత్వ పాలన అందింది. అలా గ్రామస్థాయి నుంచి పాలన మొదలుపెట్టి గాంధీజీ కలలను సాకారం చేసి చూపించారు. తన సంస్కరణలతో ప్రజలు గ్రామాలను వదిలిపెట్టి ఉపాధి కోసం పట్టణాలకు వలసలు వెళ్లే దుస్థితిని మార్చేశారు.
అంతా నాశనం. నిస్సిగ్గుగా ప్రచారం:
చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక ఏడు నెలల పాలనతో గ్రామాలకు దరిద్రం పట్టుకుంది. రేషనలైజేషన్ పేరుతో గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందజేసిన వలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్లు లేరు.
ఇంకా ఎల్ఎన్జీ కనెక్షన్లు (పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్) తానే ఏడు నెలల్లో తీసుకొచ్చినట్టు చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. నిజానికి 2023లో వైయస్ జగన్ సీఎంగా ఉండగా ఎల్జీ అండ్ పీ కంపెనీ సాయంతో ఎల్ఎన్జీ సబ్ స్టేషన్ల ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టను కడప, తిరుపతిలో ప్రారంభించడం జరిగింది. పనులు పూర్తయ్యే నాటికి టీడీపీ అధికారంలోకి వస్తే తానే చేసినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు. దివంగత వైఎస్సార్ ప్రారంభించిన శ్రీసిటీని కూడా తానే ప్రారంభించానని చెప్పుకోవడం మరింత సిగ్గు చేటు.
ఇవే కాదు.. చంద్రబాబు విశాఖలో ప్రారంభించిన ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, పవన్‌కళ్యాణ్ కర్నూలులో పరిశీలించిన గ్రీన్ కో ప్రాజెక్టులు కూడా వైయస్ జగన్ సీఎంగా ఉండగా మొదలైనవే. వాటి గురించే పవన్‌కళ్యాణ్ ఇదొక ప్రపంచ అద్భుతం అని కొనియాడారు.
నిజంగా ఆ పాలనే జరిగి ఉంటే..:
ఈ ఏడు నెలల్లో చంద్రబాబు నిజంగా అద్భుతమైన పాలన చేసుంటే.. జీఎస్టీ వసూళ్లు ఎందుకు తగ్గినట్లు? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం ఎందుకు పడిపోయింది? ఏడు నెలల్లోనే రూ.1.19 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది?. సంపద సృష్టిస్తానని చెప్పి ఉన్న సంపదనంతా ఆవిరి చేసేశాడు. రాష్ట్ర సంపదను దోచుకునేందుకు 4–పీ పేరుతో ఉన్నదంతా తెలుగుదేశం పీపుల్స్‌కు కట్టబెట్టేస్తున్నాడు.
పవన్‌కళ్యాణ్ అనైతిక వైఖరి. అసత్య మాటలు:
రాష్ట్రంలో ఏదైనా ప్రమాదం జరిగిన, అత్యాచారం జరిగినా, అఘాయిత్యం చేసినా, దౌర్జన్యం చేసినా ప్రాయశ్చిత్త దీక్ష చేయండని, క్షమాపణలు చెప్పండని పవన్ కళ్యాణ్ సెలవిస్తున్నాడు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతే క్షమాపణలు చెప్పించి నిందితులను తప్పించాలని కుటిన పన్నాగం. పాలకమండలి చేసిన తప్పును ఇద్దరు చిన్నస్థాయి అధికారులను మీదకు నెట్టేసి సస్పెండ్ చేశారు.
చంద్రబాబు మనుషులు కాబట్టి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకన్న చౌదరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీటీడీ బోర్డును రద్దు చేయలేదు. ఆఖరుకి క్షమాపణలు చెప్పడానికి కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మొండికేశాడంటేనే వారిని చంద్రబాబు ఎంతలా కాపాడుతున్నాడో అర్థమవుతుంది.
పవన్‌కళ్యాణ్‌తో చర్చకు సిద్ధం:
గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశానని పవన్ కళ్యాణ్ చెప్పుకోవడం హాస్యాస్పదం. గ్రామాల్లో ఆస్తులు సృష్టించింది గత మా వైయస్సార్సీపీ ప్రభుత్వం. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మిన నాయకులు మా జగన్. గడిచిన ఐదేళ్లలో గ్రామాల అభివృద్దికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఏ ప్రభుత్వం చేయలేదు.
చంద్రబాబు అంతకు 2014–19 మధ్య కూడా గ్రామాల అభివృద్ధి కోసం అంత ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు కూడా ఆయన నిధుల ఖర్చు చేయబోరు. చేయలేరు. ఇదే వాస్తవం. గ్రామాల అభివృద్ధిపై నేను పవన్‌కళ్యాణ్‌తో చర్చకు సిద్ధం. మరి ఆయన సిద్ధమా?.
ఒక్కోటి రూ.43 లక్షలతో గ్రామాల్లో 10 వేలకు పైగా గ్రామ సచివాలయాలు నిర్మించాం. రూ.24 లక్షలతో ఒక్కొక్క ఆర్బీకే సెంటర్ నిర్మించాం. ఒక్కో విలేజ్ క్లీనిక్ రూ.17.5 లక్షలతో నిర్మించాం. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్ధాయిలో అభివృద్ధి చేశాం. ఏరియా ఆస్పత్రులు నిర్మించాం. గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం.
ఉపాధి హామీ నిధులతో మా ప్రభుత్వం గ్రామాల్లో శాశ్వతంగా సంపద సృష్టిస్తే, కూటమి నాయకులు ఉపాధి హామీ నిధులను దోచుకు తింటున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మాటలు వింటుంటే సంక్రాంతికి పిట్టలు దొరలు వచ్చినట్టుగా ఉంది.
ఏడు మాసాల్లోనే రాష్ట్రం అధోగతిపాలైంది. ఆదాయం పడిపోయింది. జమిలి ఎన్నికలు గనుక రాకపోతే ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. తన అనుకూల ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచార ఆర్భాటం చేయడం తప్పితే చేస్తున్నదేమీ లేదు.
వైయస్ జగన్ రాష్ట్ర పర్యటన:
త్వరలోనే మా నాయకుడు వైయస్ జగన్ రాష్ట్ర పర్యటన చేస్తారు. అన్ని నియోజవర్గాలు తిరుగుతారు. నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతారు. పర్యటనకు సంబంధించి షెడ్యూల్ త్వరలోనే వెల్లడిస్తాం. వైయస్ జగన్ ప్రజల్లోకి వస్తే ప్రజలు చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తడం ఖాయం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.