Best Web Hosting Provider In India 2024
RGV on Game Changer: అబద్ధాలు, మోసం అంటూ గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేసిన రామ్‍గోపాల్ వర్మ.. ట్వీట్లతో సెటైర్లు
Ram Gopal Varma on Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా లెక్కల గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ విషయంపై ట్వీట్లు చేశారు. అబద్ధాలు అంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. భారీ అంచనాల మధ్య జనవరి 10వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయింది. సంక్రాంతి బరిలోకి ఈ పొలిటికల్ మూవీ అడుగుపెట్టింది. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, గేమ్ ఛేంజర్ కలెక్షన్లపై రచ్చ సాగుతోంది. నంబర్లను పెంచేసి మూవీ టీమ్ చెబుతోందని సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు. సీనియర్ డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేశారు.
అబద్ధం అంటూ సెటైర్లు
గేమ్ ఛేంజర్ సినిమా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.186కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని మూవీ టీమ్ వెల్లడించింది. అయితే, కావాలనే వసూళ్లను ఎక్కువ చేసి చూపుతోందని కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు. రామ్‍గోపాల్ వర్మ కూడా ఆ కలెక్షన్లు అబద్ధం అనేలా నేడు (జనవరి 13) ట్వీట్లు చేశారు. అబద్ధం చెప్పేటప్పుడు మరింత నమ్మించేలా ఉండాలంటూ ట్వీట్ చేశారు.
ఒకవేళ గేమ్ ఛేంజర్ తొలి రోజే రూ.186 కోట్లు కలెక్ట్ చేసి ఉంటే.. పుష్ప 2 ఫస్ట్ డేనే రూ.1860 కోట్లుగా ఉండేదంటూ సెటైరికల్ కామెంట్ చేశారు. గేమ్ ఛేంజర్ మూవీని జీసీ అంటూ పేర్కొన్నారు. “ఒకవేళ జీసీ (గేమ్ ఛేంజర్) చిత్రానికి రూ.450 కోట్లు ఖర్చయి ఉంటే.. అంతకు ముందెప్పుడూ లేని విధంగా అద్భుతమైన విజువల్స్ చూపించిన ఆర్ఆర్ఆర్ మూవీకి రూ.4,500 కోట్లు ఖర్చయి ఉండాలి. ఒకవేళ జీసీ సినిమా తొలి రోజు రూ.186 కోట్లు కలెక్ట్ చేసి ఉంటే.. పుష్ప 2 ఫస్ట్ డే రూ.1860 కోట్లుగా ఉండాలి. నిజానికి ప్రాథమిక అవసరం ఏంటంటే.. నమ్మేలా ఉండడం. జీసీ విషయంలో ఆ అబద్ధం మరింత నమ్మదగినదిగా ఉండాలి” అని ఆర్జీవీ తన మార్క్ వెటకారంతో ట్వీట్ చేశారు. గేమ్ ఛేంజర్ మూవీకి బడ్జెట్, తొలి రోజు కలెక్షన్ల లెక్కలు కరెక్ట్ కాదని పేర్కొన్నారు.
ఆ సినిమా విజయాలకు అవమానం
ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్ లాంటి వారు బాలీవుడ్‍ను నిజంగా షేక్ చేస్తుంటే.. గేమ్ ఛేంజర్ టీమ్ మాత్రం దక్షిణాది వారు మోసం బాగా చేస్తారని కూడా నిరూపిస్తున్నారంటూ ట్వీట్ చేశారు రామ్‍గోపాల్ వర్మ. “రాజమౌళి, సుకుమార్.. రియల్ టైమ్ కలెక్షన్లతో తెలుగు సినిమాను ఆకాశానికి తీసుకెళ్లారు. బాలీవుడ్‍లో ప్రకంపణలు సృష్టించారు. దక్షిణాది సినిమాలు మోసం కూడా అద్భుతంగా చేయగలవని గేమ్ ఛేంజర్ వెనుక ఉన్న వారు నిరూపిస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, కాంతార లాంటి సినిమాల అద్భుతమైన విజయాలను తక్కువ చేసి చూపించేలా చేసిన ఈ అవమానకర చర్య ఎవరు ఉన్నారో నాకు నిజంగా తెలియడం లేదు” అని ఆర్జీవీ రాసుకొచ్చారు. నమ్మశక్యం కాని అబద్ధాల వెనుక ఎవరు ఉన్నారో తెలియడం లేదని అన్నారు. దిల్‍రాజు వీటి వెనుక ఉండరని తాను, ఆయన మోసం చేయలేరంటూ రాసుకొచ్చారు ఆర్జీవీ.
తనకు పుష్ప 2 చిత్రం నచ్చిందని, కానీ గేమ్ ఛేంజర్ చూసిన తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాళ్లపై పడాలని అనిపిస్తోందని రామ్‍గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. ఇలా గేమ్ ఛేంజర్ మూవీని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ వేశారు.
aa
సంబంధిత కథనం