Best Web Hosting Provider In India 2024
రోడ్డు ప్రమాదం వెనక విస్తుపోయే నిజాలు.. వివాహేతర సంబంధం అనుమానంతో హత్య
వివాహేతర సంబంధం, ఆస్తి గొడవలు, కేసులతో ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తున్న భార్యను తన తమ్ముళ్లతో కలిసి భర్త హతమార్చాడు. తొలిత భార్య హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ముగ్గరిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండలం కుంట-జమ్మనపల్లి గ్రామాల మధ్య ఈనెల 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వివాహిత మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
మార్కాపురం డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మకు 30 ఏళ్ల క్రితం ఈర్నపాటి వెంకటేశ్వర్లుతో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2005లో తిప్పనబోయిన వెంకట నారాయణతో తన భార్యకు సుబ్బలక్ష్మమ్మకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో వెంకట నారాయణను వెంకటేశ్వర్లు గొడ్డలితో నరికి హత్య చేశాడు.
ఈ కేసులో వెంకటేశ్వర్లు తొమ్మిదేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. 2019లో జైలు నుంచి వెంకటేశ్వర్లు విడుదల అయ్యాడు. అయితే తన భార్య సుబ్బలక్ష్మమ్మ పద్ధతి మార్చుకోలేదని, కుటుంబ పరువు తీస్తోందని, ఆస్తి విషయంలో గొడవపడుతోందని, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందన్న కారణంతో సుబ్బలక్ష్మమ్మను చంపాలని భర్త పెద్ద వెంకటేశ్వర్లు, ఆయన ఇద్దరు తమ్ముళ్లు చిన్న వెంకటేశ్వర్లు, వెంకట రమణ కలిసి నిర్ణయించుకున్నారు.
హత్యను ప్రమాదంగా చిత్రీకరించి
సుబ్బలక్ష్మమ్మ కొన్నేళ్లుగా మార్కాపురం పట్టణంలో నివాసముంటుంది. అక్కడే బట్టల వ్యాపారం చేస్తోంది. ఈ నెల 9న సుబ్బలక్ష్మమ్మ కొత్తపల్లి గ్రామానికి స్కూటీపై వెళ్లి దుస్తులమ్ముకుని తన మేనకోడలైన ఏడుమళ్ల రాధాంజలి (17)ని తన టూవీలర్‌పై ఎక్కించుకుని మార్కాపురం బయలుదేరింది.
కోమటికుంట జంక్షన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సుబ్బలక్ష్మమ్మను తమ టిప్పర్‌తో ఢీకొట్టించి చంపాలనే ఆలోచనతో ఈర్నపాటి పెద్ద వెంకటేశ్వర్లు, చిన్న రమణయ్య ప్రోద్భలంతో చిన్న వెంకటేశ్వర్లు టిప్పర్ నడుపుకుంటూ వచ్చాడు. ప్లాన్ ప్రకారం స్కూటీని ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే రాధాంజలి మృతి చెందింది.
సుబ్బలక్ష్మమ్మ కూడా టిప్పర్ కింద పడి గాయాలతో ఉండటంతో ఆమె చనిపోలేదని భావించి చిన్న వెంకటేశ్వర్లు టిప్పర్ దిగి కర్రతో ఆమెపై హత్యా ప్రయత్నం చేయబోయాడు. అయితే రోడ్డుపై వెళ్తున్న జనాలు గమనించి అక్కడికి చేరుకోవడంతో అక్కడే కర్రను వదిలి పారిపోయాడు.
దీనిని ముందుగా రోడ్డు ప్రమాద కేసుగా నమోదు చేశారు. అనంతరం కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం బయట పడింది. పూర్తిగా దర్యాప్తు చేసి చిన్న వెంకటేశ్వర్లు, రమణయ్యలను మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమరావు అదుపులోకి తీసుకుని విచారించారు.
నేరం ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. నిందితులిద్దరినీ సోమవారం కోర్టులో హాజరుపరిచారు. మరో నిందితుడైన పెద్ద వెంకటేశ్వర్లును త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
– జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
టాపిక్