Best Web Hosting Provider In India 2024
Sookshmadarshini Review: సూక్ష్మదర్శిని రివ్యూ – నజ్రియా నజీమ్ మలయాళం క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Sookshmadarshini Review: మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన సూక్ష్మదర్శిని మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీలో నజ్రియా నజీమ్, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Sookshmadarshini Review: నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ సూక్ష్మదర్శిని చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి పదింతలుపైగా లాభాలను తెచ్చిపెట్టింది. ఎమ్‌సి జితిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్ కీలక పాత్ర పోషించాడు. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగులోనూ రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
ప్రియ ఇన్వేస్టిగేషన్….
ప్రియ (నజ్రియా నజీమ్) మైక్రోబయాలజీలో డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటుంది. భర్త ఆంటోనీతో (దీపక్ పరంబోల్) పాటు కూతురితో సంతోషంగా ప్రియ జీవితం సాగిపోతుంటుంది. చుట్టుపక్కలవాళ్లందరితో కలివిడిగా ఉంటుంది. ప్రియ పక్కింట్లోకి తన తల్లి గ్రేసీతో కలిసి మ్యానుయేల్ (బాసిల్ జోసెఫ్) దిగుతాడు. మొదటి రోజే మ్యానుయేల్ ప్రవర్తన ప్రియకు వింతగా అనిపిస్తుంది. మ్యానుయేల్ తల్లి గ్రేసీకి అల్జిమర్స్ వ్యాధి ఉంటుంది.
మ్యానుయేల్‌కు చెప్పకుండా రెండు సార్లు ఇళ్లు విడిచిపెట్టి వెళ్లిపోతుంది. తల్లి మిస్సింగ్‌పై పోలీసులకు మ్యానుయేల్ కంప్లైంట్ ఇస్తాడు. అనుకోకుండా మ్యానుయేల్ ఇంట్లోనే గ్రేసీని ప్రియ చూస్తుంది తల్లిని ఇంట్లోనే దాచిపెట్టి మ్యానుయేల్ ఏదో నాటకం ఆడుతున్నాడని ప్రియ అనుమానపడుతుంది. మ్యానుయేల్ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం సీక్రెట్‌గా ఇన్వేస్టిగేషన్‌ను కొనసాగిస్తుంది?
ప్రియ అన్వేషణలో ఏం తేలింది? మ్యానుయేల్ తల్లి ఏమైంది? గ్రేసీ కూతురు డయానా గురించి ప్రియకు ఎలాంటి భయంకరమైన నిజం తెలిసింది? తన ఇంట్లో మ్యానుయేల్ చేస్తోన్న సీక్రెట్ ప్రయోగం ఏమిటి? మంచివాడిగా నటిస్తోన్న మ్యానుయేల్ నిజస్వరూపాన్ని ప్రియ ఏ విధంగా బయటపెట్టింది? అన్నదే ఈ మూవీ కథ.
ఐదు కోట్ల బడ్జెట్ 55 కోట్ల కలెక్షన్స్…
ఇంట్రెస్టింగ్…ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో లిమిటెడ్ బడ్జెట్‌లో మంచి సినిమాలు ఎలా చేయచ్చో మలయాళ డైరెక్టర్లు చాలా సార్లు ప్రూవ్ చేశారు. సూక్ష్మదర్శిని ఈ లిస్ట్‌లో ఉండాల్సిన మూవీ. మలయాళంలో కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 55 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్….
పక్కింటి విషయాల పట్ల స్వతహాగానే ఆడవాళ్లలో ఎప్పుడు ఆసక్తి ఉంటుంది. కామన్ పాయింట్ నుంచి స్ఫూర్తి పొందుతూ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా దర్శకుడు ఎమ్‌సీ జితిన్ ఈ కథను రాసుకున్నట్లుగా అనిపించింది. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతుహలం కలిగిన ఓ సాధారణ మిడిల్ క్లాస్ హౌజ్‌వైఫ్ ఓ మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది అన్నదే ఈ మూవీ కథ. సినిమా చివరి వరకు నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది.
రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా….
రెగ్యులర్ మర్డర్ మిస్టరీ సినిమాల్లో ఉండే ఫైట్లు, హీరో విలన్లు ఒకరిపై మరొకరు వేసే ఎత్తులేవి కమర్షియల్ ఎలిమెంట్లు ఈ సినిమాలో కనిపించవు. రియల్‌లైఫ్‌లో ఓ కాలనీ వాళ్లు ఎలా ఉంటారు? ఆడవాళ్ల వాట్సప్ గ్రూప్‌లలో ఎలాంటి సంభాషణలు ఉంటాయన్నది నాచురల్‌గా చూపిస్తూ స్టోరీ, క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేస్తూ కథను చెప్పడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
సస్పెన్స్ విత్ హ్యుమర్…
మ్యానుయేల్ తన బంధువులతో కలిసి సీక్రెట్‌గా ఇంట్లో ఓ ప్రయోగం చేయడానికి ప్లాన్స్ వేయడం, ఆ సీక్రెట్ ఆపరేషన్ గురించి తెలుసుకోవడానికి తన గ్యాంగ్‌తో కలిసి ప్రియ చేసే ఇన్వేస్టిగేషన్‌తో ఈ సినిమా సాగుతుంది. హ్యూమర్, సస్పెన్స్ మిక్స్‌తో ఈ సీన్స్‌తో దర్శకుడు రాసుకున్న తీరు బాగుంది. మ్యానుయేల్ తో పాటు అతడి తల్లి లైఫ్‌లో ఉన్న మిస్టరీని చివరి వరకు హోల్డ్ చేశాడు డైరెక్టర్.
ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్లాడు. ముఖ్యంగా అసలు విలన్ ఎవరన్నది వెల్లడయ్యే సీన్ సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.మెయిన్ కోర్ పాయింట్ సున్నితమైన అంశం కావడంతో దాని గురించి సినిమాల్లో దర్శకుడు ఎక్కువగా ప్రస్తావించలేదు.
ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా…
ఆరంభ సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. మ్యానుయేల్ క్యారెక్టర్ గురించి డీప్‌గా చూపించే ప్రయత్నంలో కథ కొంత ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇన్వేస్టిగేషన్ సీన్స్‌ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా రాసుకుంటే బాగుండేది.
బాసిల్ జోసెఫ్‌కు వంద మార్కులు…
ప్రియ పాత్రకు నజ్రియా నజీమ్ ప్రాణం పోసింది. పక్కింటి మిస్టరీని ఛేదించే సగటు గృహిణి పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో నవ్వించింది. చివరలో ఎమోషనల్ యాక్టింగ్‌తోమెప్పించింది. ఈ సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించింది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో బాసిల్ జోసెఫ్ నటన వంద మార్కులు వేయచ్చు. ఫేస్‌లో సాఫ్ట్‌నెస్, స్మైల్ చూపిస్తూ విలనిజాన్ని పండించడం కొత్తగా ఉంది. మ్యానుయేల్ తల్లిగా మనోహరితో ప్రియ గ్యాంగ్ మెంబర్స్ అఖిల, మెర్లిన్, పూజ మోహన్‌రాజ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
కొత్త తరహా క్రైమ్ కామెడీ మూవీ
సూక్ష్మదర్శిని కొత్త తరహా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ. నవ్విస్తూనే చివరి సీన్ వరకు థ్రిల్లింగ్‌ను పంచుతుంది. క్రైమ్ మూవీ లవర్స్ మిస్ కాకుండా చూడాల్సిన మూవీ ఇది.