Best Web Hosting Provider In India 2024
Sankranthiki Vasthunnam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ – వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ హిట్టా? ఫట్టా?
Sankranthiki Vasthunnam Review: హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం మంగళవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ హిట్టా? ఫట్టా అంటే?
Sankranthiki Vasthunnam Review: ఎఫ్ 2, ఎఫ్3 తర్వాత హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా మంగళవారం థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కథ…
ఐపీఎస్ ఆఫీసర్ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు (వెంకటేష్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకుంటాడు. వందకుపైగా ఎన్‌కౌంటర్లు చేస్తాడు. చేయని తప్పుకు సస్పెండ్ కావడంతో పోలీస్ జాబ్‌కు రిజైన్ చేసి సొంతూరు వచ్చేస్తాడు. భాగ్యలక్ష్మిని (ఐశ్వర్య రాజేష్) పెళ్లిచేసుకొని ఇల్లరికం అల్లుడిగా సెటిల్ అయిపోతాడు. భర్తను శ్రీరాముడి చంద్రుడిగా భావిస్తుంది భాగ్యలక్ష్మి. రాజు మరో ఆడదాని వైపు కన్నెత్తి చూడడని, అతడి ఫ్యాష్‌బ్యాక్‌లో ఎలాంటి ప్రేమ కథలు లేవని అనుకుంటుంది.
అలాంటి టైమ్‌లోనే రాజ్ వెతుక్కుంటూ అతడి ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ మీనాక్షి (మీనాక్షి చౌదరి) వస్తుంది. భార్యకు, మాజీ ప్రేయసికి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు? అమెరికా నుంచి తెలంగాణకు వచ్చిన బిజినెస్‌మెన్ ఆకెళ్లను(శ్రీనివాస్ అవసరాల) బీజు పాండే గ్యాంగ్ ఎందుకు కిడ్నాప్ చేసింది?
ఆకేళ్లను విడిపించే బాధ్యతను సీఏం (సీనియర్ నరేష్) రాజుతో పాటు మీనాక్షికి అప్పగించడానికి కారణమేమిటి? ఈ సీక్రెట్ ఆపరేషన్ కోసం రాజు వెంట అతడి భార్య భాగ్యం ఎందుకు వెళ్లింది? మీనాక్షిని ప్రేమించిన రాజు ఆమెకు ఎందుకు దూరమయ్యాడు? అసలు వైడీ రాజు పోలీస్ జాబ్ ఎందుకు వదిలేశాడు అన్నదే సంక్రాంతికి వస్తున్నాం మూవీ కథ.
యాక్షన్ నుంచి రొమాన్స్ వరకు…
సుదీర్ఘ సినీ జర్నీలో వెంకటేష్ టచ్ చేయని జానర్ లేదు. యాక్షన్, ఫ్యాక్షన్ నుంచి రొమాన్స్, కామెడీ వరకు అన్ని రకాల కథలతో సినిమాలు చేశాడు. కానీ ఫ్యామిలీ ఎంటటైనర్ మూవీస్ అతడికి ఎక్కువగా విజయాల్ని, పేరుప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టాయి. మరోసారి తనకు అచ్చొచ్చిన జోనర్‌లో వెంకటేష్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. కథ కంటే కామెడీతోనే ఆడియెన్స్‌ను మెప్పించడం అనిల్ రావిపూడి స్టైల్. తొలి సినిమా నుంచి ఇదే రూల్ ఫాలో అవుతూ వరుస సక్సెస్‌లను అందుకుంటున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ముచ్చటగా మూడో మూవీ సంక్రాంతికి వస్తున్నాం.
క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్…
వెంకటేష్, అనిల్ రావిపూడి కలిస్తే కామెడీ ఏం రేంజ్‌లో ఉంటుందో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో ప్రూవ్ అయ్యింది. ఈ సారి కేవలం కామెడీకే పరిమితం కాకుండా క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం కథను రాసుకున్నాడు.
గత సినిమాల్లో మాదిరిగా సెఫరేట్ ట్రాక్‌లతో ఫన్‌ను పండించడం కాకుండా సిట్యూవేషనల్ కామెడీతో ఆడియెన్స్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు అనిల్‌రావిపూడి. సింపుల్‌గా చెప్పాలంటే ఓ కిడ్నాప్ మిషన్‌ను ఛేదించేందుకు భార్య, ప్రేయసితో కలిసి వెళ్లిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కథ ఇది. ఈ పాయింట్ నుంచి ఎన్ని విధాలుగా ఫన్ రాబట్టవచ్చో అన్ని వాడేశారు డైరెక్టర్.
భార్య అసూయ ద్వేషాలు…
సద్గుణ రాముడిగా భావించే భర్త జీవితంలో మరో అమ్మాయి ఉందని తెలిస్తే భార్య ఎలా ఫీలవుతుంది…ఆ అసూయ ద్వేషాలు, అనుమానాలు నుంచి పుట్టే కామెడీ బాగా నవ్విస్తుంది. తన కోసం ఎదురుచూస్తానని మాటిచ్చిన ప్రియుడు పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే ఆ ప్రియురాలు పడే బాధ, ఆవేదనను ఫన్నీగా చూపించారు.భార్యకు, ప్రియురాలికి సర్ధిచెప్పలేక ఇద్దరి మధ్య వెంకీ పడే పాట్లు హిలేరియస్‌గా నవ్వించాయి.
ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా…
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా వెంకీ పాత్రను పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. పోలీస్ జాబ్‌కు రిజైన్ చేయడం, మీనాక్షితో లవ్‌కు బ్రేకప్ చెప్పిన రాజు భాగ్యలక్ష్మితో రాజమండ్రిలో సెటిలైనట్లుగా చూపించే వరకు సోసోగానే సినిమా సాగుతుంది. రాజు, భాగ్యం రొమాన్స్, బుల్‌రెడ్డి పాత్రలో రాజు కొడుకు చేసే హంగామాతో ఫస్ట్ హాఫ్ ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా సరదాగా సాగిపోతుంది. ఓ వైపు ఫ్యామిలీ ఎలిమెంట్స్…మరోవైపు ఆకెళ్ల ఇండియా రావడం, అతడి కిడ్నాప్ సీన్స్ చూపించారు.
కన్ఫ్యూజన్స్…
ఆకెళ్లను విడిపించడానికి భాగ్యం, మీనాక్షిలతో రాజు ప్లాన్స్ వేయడం, వారి మధ్య నెలకొన్న కన్ఫ్యూజన్స్ చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. ఈ సీన్స్ మొత్తం ఫన్ జనరేట్ అయ్యేలా రాసుకున్నాడు అనిల్ రావిపూడి. పోనుపోను కథ సీరియస్ టోన్‌లోకి మారడంతో వినోదం డోస్ తగ్గుతూ వచ్చింది. చివరలో చిన్న మెసేజ్ ఇచ్చిన అది అంతగా సినిమాకు అతకలేదు.
లాజిక్‌లు లేవు…
అనిల్ రావిపూడి సినిమాల్లో లాజిక్‌లు ఉండవు.కేవలం మ్యాజిక్ మాత్రమే. ఈ సినిమాలో అదే కనిపిస్తుంది.కిడ్నాప్ డ్రామాకు వినోదానికి అంతగా పొంతన కుదరలేదు. కీలకమైన సెకండాఫ్‌లో కామెడీ అనుకున్న స్థాయిలో పండలేదు. పాటల ప్లేస్‌మెంట్, పిక్చరైజేషన్ క్వాలిటీ స్క్రీన్‌పై సరిగ్గా లేదనిపించింది.
అలవాటైన పాత్రలో…
భార్యకు, ప్రియురాలికి మధ్య నలిగిపోయే పాత్రలు ఇదివరకు వెంకటేష్ చాలానే చేశారు. అలవాటైన పాత్ర కావడంతో రాజు క్యారెక్టర్‌లో ఈజీగా ఇమిడిపోయారు. పాటల్లో హుషారుగా స్టెప్పులు వేశాడు. భాగ్యం పాత్రలో ఐశ్వర్య రాజేష్ జీవించేసింది. కొన్ని సీన్స్‌లో వెంకటేష్‌ను డామినేట్ చేసేలా నటించింది. మీనాక్షి చౌదరి యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. సీనియర్ నరేష్, సాయికుమార్, వీటీవీ గణేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ కామెడీతో మెప్పించారు.
భీమ్స్ పాటలు, బీజీఎమ్ ఈ సినిమా బిగ్ అసెట్‌గా నిలిచాయి. గోదారి గట్టు సాంగ్ థియేటర్లలో మంచి జోష్ ఇస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది.
టైమ్‌పాస్ మూవీ…
సంక్రాంతికి వస్తున్నాం టైమ్‌పాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు మంచి ఛాయిస్‌గా ఈ మూవీ నిలుస్తుంది. లాజిక్‌లను పక్కన పెట్టి చూస్తే సినిమాను ఎంజాయ్ చేయచ్చు.
రేటింగ్: 3/5