Best Web Hosting Provider In India 2024
Kanuma Recipe: కనుమ రోజు అల్లం గారెలు ఇలా చేస్తే చికెన్ కూరతో అదిరిపోతాయి
Allam Garelu: గారెలు పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక అల్లం గారెలు వండితే మామూలుగా ఉండదు. చికెన్ గ్రేవీతో ఈ గారెలను తింటే అద్భుతంగా ఉంటుంది.
తింటే గారెలే తినాలని ఊరికే అనలేదు. గారెల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇక్కడ మేము అల్లం గారెలన రెసిపీ ఇచ్చాము. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కనుమ రోజున చికెన్ గ్రేవీలో ముంచుకుని తింటే అద్భుతంగా ఉంటాయి. అల్లం గారెలు రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా వండితే త్వరగా అయిపోతాయి. పైగా మెత్తగా క్రంచీగా కూడా వస్తాయి. ఒకసారి వీటిని వండి చూడండి.
అల్లం గారెలు రెసిపీకి కావలసిన పదార్థాలు
అల్లం తురుము – రెండు స్పూన్లు
మినప్పప్పు – ఒకటిన్నర కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
కరివేపాకులు – గుప్పెడు
పచ్చిమిర్చి తరుగు – అర స్పూను
మిరియాల పొడి – అర స్పూను
ఇంగువ – చిటికెడు
బియ్యం – రెండు స్పూన్లు
అల్లం గారెలు రెసిపీ
1. మినప్పప్పును, బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి.
2. మినప్పప్పులోనే ఆ రెండు స్పూన్ల బియ్యం కూడా కలిపి నానబెట్టేయొచ్చు.
3. అవి బాగా నానాక మిక్సీలో వేసి గట్టిగా రుబ్బుకోవాలి.
4. రుబ్బుకున్నప్పుడే ఉప్పును కూడా వేసేయాలి. ఒక గిన్నెలోకి ఈ గారెల మిశ్రమాన్ని తీసి వేసుకోవాలి.
5. అందులోనే తరిగిన కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాలపొడి, ఇంగువ, అల్లం తురుము వేసి బాగా కలపాలి.
6. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
7. ఈ పిండి మిశ్రమంలోంచి కొంత ముద్దను తీసి గారెల్లాగా వత్తుకొని మధ్యలో చిల్లు పెట్టి వేడి నూనెలో వేయాలి.
8. దీన్ని రెండు వైపులా వేయించుకోవాలి. వాటిని తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే అదనపు నూనెను పీల్చేస్తుంది.
9. అంతే అల్లం గారెలు రెడీ అయినట్టే. ఈ అల్లం గారెలను చికెన్ గ్రేవీతో, మటన్ గ్రేవీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
10. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో అల్లం గారెలను చూసి చేసి చూడండి. మీకు నచ్చడం ఖాయం.
గారెలు లేనిదే సంక్రాంతి, కనుమ పండుగలు పూర్తి కావు. అయితే సాధారణ గారెలతో పోలిస్తే మాంసాహార కూరలతో తినేందుకు అల్లం గారెలు బెస్ట్ జోడి. ఈ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో ఈ అల్లం గారెలు రెసిపీ ప్రయత్నించి చూడండి. ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే ఉన్నాయి. పైగా అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి అల్లం గారెలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.