Best Web Hosting Provider In India 2024
Chandrababu : రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. సేంద్రియ సాగుకు మరింత ప్రోత్సాహం!
Chandrababu : సంక్రాంతి పండగ వేళ పాడి రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. పాడి పశువులు ఉన్న రైతులందరికీ షెడ్స్ మంజూరు చేస్తామని ప్రకటించారు. పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు.. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పాడి పశువులు ఉన్న రైతులందరికీ షెడ్స్ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
ప్రకృతి సేద్యం వైపు..
ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యంవైపు చూస్తున్నాయని చంద్రబాబు వివరించారు. సాగు విధానంలో మార్పులు వస్తున్నాయని.. చిరుధాన్యాలు, పండ్ల సాగు పెరుగుతోందని చెప్పారు. సూక్ష్మ నీటిపారుదల విధానాన్ని మరింత ప్రోత్సహిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మనం తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తనిఖీ చేసుకునే అవకాశం వచ్చిందని సీఎం వివరించారు.
దిగుబడి పెరిగేలా..
‘ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన పెరిగింది. ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. చీడపీడల నుంచి రక్షించుకునే పద్ధతులు మారాయి. మామిడిపంట రక్షణకు ఆధునిక విధానాలు వచ్చాయి. డ్రోన్ల ద్వారా చీడపీడలు గుర్తించే సాంకేతికత వచ్చింది. పశువులకు ఎక్కడికక్కడ షెడ్లు నిర్మిస్తాం. గడ్డి పెంచే క్షేత్రాల సంఖ్య పెంచుతాం. పాల దిగుబడి పెరిగేలా చర్యలు తీసుకుంటాం’ అని చంద్రబాబు వివరించారు.
ఆయుధంలా సెల్ ఫోన్..
‘ప్రకృతి సాగు ద్వారా ఆహార ఉత్పత్తులకు మంచి ధర వస్తుంది. తిరుపతి జిల్లా మొత్తం పారిశ్రామికీకరణ చేస్తాం. ఈ జిల్లాకు చెందినవారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం. భవిష్యత్తులో సెల్‌ఫోన్ ఆయుధంలా పనిచేస్తుంది. సంక్షేమ పథకాల పంపిణీలో మోసాలు జరగకుండా సాంకేతికత వినియోగిస్తాం. విద్యార్థులు నిత్యం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ప్రతీ హామీ నెరవేరుస్తున్నాం..
‘చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం. రూ.4 వేల నుంచి రూ.15 వేల పెన్షన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం మాది. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. దీని కోసం ఏడాదికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మీ సెల్ ఫోన్లకే మీకు అవసరమైన సర్టిఫికెట్లన్నీ వాట్సప్‌లోనే అందే ఏర్పాటు చేస్తున్నాం. 150 వరకు సేవలు దీని ద్వారా పొందవచ్చు. ఎవరింట్లో వాళ్లే నెలకు 300 యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేందుకు అవసరమైన యూనిట్‌ను సబ్సిడీపై అందిస్తాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
టాపిక్