Best Web Hosting Provider In India 2024
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లకు ఇటుక, ఇసుక సరఫరా ఇలా.. 10 ముఖ్యమైన అంశాలు
TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు వీలైనంత మేలు చేయాలని రేవంత్ సర్కారు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో.. ఇళ్ల నిర్మాణం కోసం అవసరం అయ్యే సామాగ్రి పంపిణీలోనూ కొత్త ఆలోచనలు చేస్తోంది. ఇసుక, ఇటుకల పంపిణీపై ఫోకస్ పెట్టింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ సామాగ్రి పంపిణీ ద్వారా లబ్ధిదారులకు మేలు చేయడమే కాకుండా.. మహిళా సంఘాలకు దన్నుగా నిలవాలని రేవంత్ సర్కారు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.ఇందిరమ్మ ఇళ్ల కోసం అవసరం అయ్యే ఇటుకలను మహిళా సంఘాల ద్వారా తయారు చేసి.. లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.
2.తొలివిడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
3.4.16 లక్షల ఇళ్ల నిర్మాణానికి దాదాపుగా 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, 40.50 లక్షల టన్నుల సిమెంట్, 68 లక్షల టన్నుల స్టీల్, 101 కోట్ల ఇటుకలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
4.జనవరి 3వ వారంలో గ్రామసభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలు రూపొందించనున్నారు. వాటిని ఆమోదం కోసం ఇన్‌ఛార్జి మంత్రుల వద్దకు పంపించనున్నారు.
5.ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదం పొందితే.. ఈ పథకం అమలు ప్రక్రియ వేగం కానుంది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఫలితంగా వెంటనే నిర్మాణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
6.ఇళ్ల నిర్మాణం సమయంలో ఇటుకల కొరత లేకుండా చూసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మండలానికి మూడు చొప్పున ఇటుక తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించేందుకు సిద్ధమవుతోంది.
7.ఇటుక యూనిట్ల ఏర్పాటుకు సెర్ప్ ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.18 లక్షల వరకు రుణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్లకు ఈ యూనిట్ల ద్వారా ఇటుకలు సరఫరాచేయనుంది.
8.ఇటుక తయారీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధిత మార్గదర్శకాలు, ఇటుక ధరపై గృహ నిర్మాణ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్ణయం తీసుకోనున్నారు.
9.ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుకను కూడా ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వాగులు, నదుల్లో రీచ్‌లను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం.
10.అటు స్టీల్, సిమెంట్ సరఫరాపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్టీల్, సిమెంట్‌ను పెద్దమొత్తంలో ఒకేసారి తీసుకుంటే.. తక్కువ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చే కంపెనీలతో చర్చలు జరిపే అవకాశాలున్నాయి. సిమెంట్ బస్తా రూ.260, టన్ను స్టీల్‌ను రూ.54 వేల చొప్పున అందించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
టాపిక్