Best Web Hosting Provider In India 2024
TG High Court CJ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్
TG High Court CJ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్‌ను నియమించారు. ప్రస్తుత సీజేను బాంబే హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది. జస్టిస్ సుజోయ్ పాల్ 2014 ఏప్రిల్‌లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్ సుజోయ్ పాల్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫై చేసింది. తెలంగాణ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సుజోయ్ పాల్ నియామకం జరిగింది.
“భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ద్వారా వచ్చిన అధికారాలను వినియోగించుకుని.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్‌ను.. పదవి విధులను నిర్వర్తించడానికి రాష్ట్రపతి నియమిస్తున్నారు” అని న్యాయ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపర్చిన నోటిఫికేషన్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
1990లో..
జస్టిస్ సుజోయ్ పాల్ 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. ఆయన సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక, సర్వీస్, ఇతర న్యాయ శాఖలలో ప్రాక్టీస్ చేశారు. వివిధ కోర్టుల్లో పలు కేసుల్లో వాదనలు వినిపించారు. ఆయన మే 27, 2011న జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏప్రిల్ 14, 2014న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ సుజోయ్ పాల్ కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో ఆయన బదిలీ కోరుకున్నారు. జస్టిస్ సుజోయ్ పాల్ అభ్యర్థనను రాష్ట్రపతి ఆమోదించారు. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు.
హైకోర్టులో ఉద్యోగాలు..
తెలంగాణ హైకోర్టులోని వివిధ విభాగాల్లో 1,673 పోస్టులను భర్తీ చేయడానికి నియామక ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియను జనవరి 8న ప్రారంభించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 31 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఖాళీలను పలు విభాగాలుగా విభజించారు.
ఇవీ పోస్టులు..
1,277 నాన్-టెక్నికల్ పోస్టులు, 184 టెక్నికల్ పోస్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్‌లోని 212 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, అసిస్టెంట్లు, కోర్ట్ మాస్టర్లు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, కాపీయిస్టులు వంటి క్లరికల్ పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు ఇలా..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సరళమైన ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందుగా అభ్యర్థులు tshc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. సైట్‌లోకి ప్రవేశించిన తర్వాత.. వారు రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలను సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
ఈనెల 31 వరకు..
దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత.. సమర్పించే ముందు అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. భవిష్యత్తు అవసరాల కోసం సమర్పించిన ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. జనవరి 31న దరఖాస్తుల సమర్పణకు గడువు ముగుస్తుంది.
టాపిక్