Best Web Hosting Provider In India 2024
AP Sankranti Celebrations : సంక్రాంతి సంబరాల్లో అడ్డగోలు దోపిడీ.. కారు పార్కింగ్ ఫీజు రూ.200!
AP Sankranti Celebrations : సంక్రాంతి పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏపీ. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతాయి. ప్రతీ పల్లెలో పండగ శోభ కనిపిస్తుంది. అందుకే ఎక్కడ ఉన్నా.. సంక్రాంతికి అందరూ సొంతూళ్లకు వస్తారు. సంబరాలు చేసుకుంటారు. అలా వచ్చిన వారిని ఇప్పుడు కొందరు దోచుకున్నారు.
రాష్ట్రంలో సంక్రాంతి పండగ చాలా స్పెషల్. విదేశాలు, ఇతర రాష్ట్రాలు, నగరాలు, పట్టణాల్లో ఉన్నవారు అందరూ పండగకు సొంతూళ్లకు వస్తారు. ఘనంగా సంబరాలు చేసుకుంటారు. సంక్రాంతి సందర్భంగా కొన్ని జిల్లాల్లో కోడి పందేలు నిర్వహిస్తే.. మరికొన్ని జిల్లాల్లో ఎడ్ల పందాలు, గుండాటలు, జాతరలు నిర్వహిస్తారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇక్కడే వచ్చింది.
బరుల దగ్గర బరితెగింపు..
పండగకు సొంతూళ్లకు వచ్చేవారిని దోచుకునేందుకు కొందరు ప్లాన్ చేశారు. ముఖ్యంగా కోడి పందాలు చూడటానికి, పందెం కాయడానికి చాలామంది ఆసక్తి చూపించారు. అలా వచ్చిన వారు అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయారు. పందెం బరుల దగ్గర నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. అదే స్థాయిలో డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పార్కింగ్ ఫీజు రూ.200
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో కోడి పందాలు నిర్వహించే ఓ చోట.. కారు పార్కింగ్ పేరిట భారీగా డబ్బులు వసూలు చేశారు. ఒక్క కారుకు రూ.200 పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. అంతేనా కోడి పందాలు నిర్వహించే బరుల దగ్గర మద్యం మొదలు.. అన్నీ లభించాయి. కానీ సాధారణ రేట్ల కంటే.. దాదాపు 10 రెట్లు ఎక్కువ వసూలు చేశారు. గ్రామాలకు దూరంగా బరులు ఉండటంతో.. వచ్చినవారు కూడా ఏమీ చేయలేక డబ్బులు సమర్పించుకున్నారు.
వైసీపీ ఆరోపణలు..
అయితే.. ఈ వ్యవహారాన్ని వైసీపీ క్యాష్ చేసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్లు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. కానీ.. కూటమి నాయకుల ఆదాయం వందల రెట్లు పెరిగింది. ఇలాంటి దోపిడీల వల్ల’ అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రూ.200 పార్కింగ్ ఫీజు వసూలు చేసిన టికెట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది కాస్త వైరల్ అయ్యింది. చాలాచోట్ల కూటమి నేతలో దగ్గరుండి పందాలు నిర్వహించారని వైసీపీ ఆరోపిస్తోంది.
చేతులు మారిన కోట్లాది రూపాయాలు..
ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జోరుగా కోడి పందాలు నిర్వహించారు. ఈ జిల్లాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ప్రచారం జరుగుతోంది. పందాలు కాసేవారే కాకుండా.. నిర్వాహాకులు భారీగా డబ్బులు సంపాదించారనే టాక్ నడుస్తోంది. పందెం గెలిచిన వారి నుంచి పర్సంటేజీలు, ఇతర దుకాణాలు నిర్వహించినందుకు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి బాగా కూడబెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
టాపిక్