Best Web Hosting Provider In India 2024
AP Skill Development case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్
AP Skill Development case : సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఛార్జిషీట్ దాఖలైందని.. ఈ సమయంలో జోక్యం అవసరంలేదని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను అపెక్స్ కోర్టు కొట్టివేసింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టేసింది. ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి వివరించారు.
జోక్యం అవసరం లేదు..
ఛార్జిషీట్ దాఖలైనందున జోక్యం అవసరంలేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం అభిప్రాయపడింది. 2023 నవంబర్‌లో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో అప్పటి ఏపీ ప్రభుత్వం.. బెయిల్ రద్దు పిటిషన్‌ను దాఖలు చేసింది. దాన్ని తాజాగా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో చంద్రబాబు ఊరట లభించినట్టు అయ్యింది.
చంద్రబాబు అరెస్టు..
2023 సెప్టెంబర్ నెలలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంపై ఈడీ కూడా విచారణ జరిపింది. ఈ కేసులో పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. ఈ వ్యవహారంలో అటాచ్ మెంట్లు జరిగాయి. షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును అరెస్ట్ చేసింది ఏపీ సీఐడీ.
కేసు ఏంటీ..
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లకు సీమెన్స్ సంస్థ – డిజైన్‌టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10 శాతం నిధులు, మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది.
తప్పుదారి పట్టించి..
ప్రభుత్వం చెల్లించిన రూ.370 కోట్లలో రూ.240 కోట్లను సీమెన్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్‌టెక్ సంస్థకు బదలాయించారంటూ.. ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కేబినెట్‌ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి, డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై చాలా కాలంగా సీఐడీ లోతుగా విచారణ జరిపింది. పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ వ్యవహరాన్ని ఈడీ దృష్టికి కూడా తీసుకెళ్లగా.. ఆ సంస్థ అధికారులు కూడా దర్యాప్తు జరిపారు.
గతంలోనే ఫిర్యాదులు..
ఈ కుంభకోణం 2016- 2018 మధ్య జరిగింది. దీనిపై గతంలోనే ఏసీబీకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఒప్పందానికి సంబంధించిన అసలు ఫైళ్లను మాయం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను మేనేజ్ చేసే సమయంలో.. జీఎస్టీ అధికారుల దర్యాప్తులో అసలు కుట్ర బయట పడింది. ఈ స్కామ్‌పై ఆదాయపుపన్ను శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై అప్పటికే విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు.. ఈ సంస్థలన్నింటితో కో-ఆర్డినేట్ చేకుని విచారణ జరిపారు.
ఏ1గా చంద్రబాబు..
ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన దాదాపు 50 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది.
టాపిక్