Best Web Hosting Provider In India 2024
Crime news: ‘‘పబ్లిక్ లో కన్నకూతురినే కాల్చి చంపేశాడు..’’
Crime news: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్ల తనూ గుర్జార్ అనే యువతిని ఆమె కన్నతండ్రే తుపాకీతో కాల్చి చంపేశాడు. తన కుటుంబం నుంచి తనకు ప్రాణ హాని ఉందని చనిపోవడానికి కొన్ని గంటలముందే ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.
Crime news: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన ఓ మహిళ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకోనందుకు తన తండ్రి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందే తన కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. కొన్ని గంటల తర్వాత ఆమెను ఆమె తండ్రి బహిరంగంగా కాల్చి చంపాడు.
బలవంతపు పెళ్లి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరవై ఏళ్ల తనూ గుర్జార్ వివాహాన్ని ఆమె తల్లిదండ్రులు కుదిర్చారు. మరో నాలుగు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఆ పెళ్లి తనకు ఇష్టం లేదని తనూ గుర్జార్ తన తల్లిదండ్రులకు పలుమార్లు చెప్పింది. ఆమె వేరే వ్యక్తిని ప్రేమిస్తుండడంతో ఆమె తండ్రి ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. అందుకు ఆమె కజిన్ కూడా సహకరించాడు. తనూక గుర్జార్ వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుందని, అయితే ఆమె తల్లిదండ్రులు ఈ వివాహాన్ని వ్యతిరేకించారని, మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు.
‘నా కుటుంబానిదే బాధ్యత’
తన హత్యకు కొన్ని గంటల ముందు ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని తన కుటుంబ సభ్యులు తనను బలవంతం చేస్తున్నారని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. తన తండ్రి మహేష్, ఇతర కుటుంబ సభ్యులను కూడా తను ప్రస్తావించి, వారు తనను వారు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారని ఆరోపించింది. తనకు ప్రాణభయం ఉందని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ‘నేను విక్కీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా కుటుంబం మొదట అంగీకరించింది, కానీ తరువాత నిరాకరించింది. రోజూ నన్ను కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే నా కుటుంబ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని తనూ ఆ వీడియోలో పేర్కొంది. విక్కీతో తాను గత ఆరేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నానని తెలిపింది.
పోలీసుల జోక్యం
తనూ గుర్జార్ షేర్ చేసిన వీడియోను సోషల్ మీడియా (social media) లో వైరల్ కావడంతో పోలీస్ సూపరింటెండెంట్ దర్మ్ వీర్ సింగ్ నేతృత్వంలో పోలీసు అధికారులు తనూ ఇంటికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులతో చర్చించారు. గ్రామంలో జరిగిన కమ్యూనిటీ పంచాయితీ సమావేశంలో కూడా ఈ విషయంపై చర్చించారు. ఆ సమయంలో కూడా తనకు తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని, ఇంట్లో ఉండనని, తనను ప్రభుత్వ నిర్వహణలో ఉన్న షెల్టర్ హోం కు మార్చాలని పోలీసు అధికారులను తనూ గుర్జార్ అభ్యర్థించారు.
ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి..
అయితే, అదే సమయంలో, తన కుమార్తెతో ఏకాంతంగా మాట్లాడేందుకు అనుమతించాలని ఆమె తండ్రి పంచాయతీ నాయకులు, పోలీసు అధికారులను కోరారు. తన కుమార్తెను ఒప్పించగలనని హామీ ఇచ్చారు. అనంతరం, తన కూతురిని పక్కకు తీసుకువెళ్లి, తన వద్ద ఉన్న నాటు తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపాడు. అతనితో పాటు మరో బంధువు కూడా ఆమె నుదుటి, మెడ, ముఖంపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన తనూ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తండ్రి, బంధువు అక్కడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులపై, ఇతర కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. అయితే పోలీసులు మహేష్ ను పట్టుకోగా, మిగతా నిందితుడు పరారీలో ఉన్నాడు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
Best Web Hosting Provider In India 2024
Source link