శంక‌ర్ రావు కార్యాల‌యంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

Best Web Hosting Provider In India 2024

గుంటూరు జిల్లా ఎస్‌పీకి వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఫిర్యాదు

గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని కోరుతూ ఎస్పీకి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. కొందరు తన కార్యాలయంలోకి చొరబడి ఫ్లెక్సీలు చింపి, అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని.. ఈ అంశంపై ఇవాళ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు నంబూరు శంకర్‌రావు తెలిపారు.

సహించం.. కచ్చితంగా తిప్పి కొడతాం: నంబూరు శంకర్‌రావు
మా కార్యాలయంపై దాడి చేసి తమ సిబ్బందిపై తిరిగి కేసులు పెట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. గత కొన్ని నెలల క్రితం పెదకూరపాడులో వైయ‌స్ఆర్‌సీపీ నేత సాంబిరెడ్డి కాళ్లు నరికారు. మా పార్టీ, కార్యకర్తలపై పెదకూరపాడులో దాడులు జరుగుతున్నాయి. గతంలో కొమ్మలపాటి శ్రీధర్, కన్నా లక్ష్మీనారాయణ, నేను పనిచేశాం. ఇలాంటి ఘటనలను ఇకపై మేము సహించేది లేదు.. కచ్చితంగా తిప్పి కొడతాం.

నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదు. తప్పకుండా ప్రశ్నిస్తాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. వచ్చిన పదవి అవకాశాన్ని మంచిగా ఉపయోగించాలి. నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి’’ అని నంబూరు శంకర్‌రావు పేర్కొన్నారు.

చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి: అంబటి రాంబాబు
మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని.. కూటమి నేతలు ఏడు నెలల్లో చేయకూడని అరాచకాలు చేశారని మండిపడ్డారు. ‘‘ఐదేళ్లు పాటు పెదకూరపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్‌రావుపై దాడి చేస్తామంటున్నారు. గతంలో నియోజకవర్గంలో రైతులను పరామర్శించేందుకు వెళ్లగా ఆయన కారుపై దాడికి పాల్పడ్డారు.. ఇది సహించరాని ఘటన. కచ్చితంగా పెదకూరపాడు వెళ్తాం.. కార్యకర్తల సమావేశం నిర్వహిస్తాం. పోలీసులే మాకు రక్షణ కల్పించాలి.

రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతుంది. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి. పిల్లిని గదిలో వేసి కొడితే పులి అవుతుంది ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో రోజు రోజుకీ సమస్యలు ముదురుతున్నాయి. పండుగ కూడా చేసుకోకుండా దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులను ఎదిరించి, ధైర్యంగా నిలబడతాం. టీడీపీ చేసే ప్రతి దాడిని, దౌర్జన్యాన్ని ప్రజలకు వివరిస్తాం’’ అని అంబటి రాంబాబు తెలిపారు.

Best Web Hosting Provider In India 2024