Best Web Hosting Provider In India 2024
ACB Trap : ఏసీబీకి చిక్కిన మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ – మరో ఇద్దరు కూడా అరెస్ట్
ఐదు వేలు లంచం తీసుకుంటు జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ అసిఫోద్దీన్ ఏసీబీ అధికారులకు చిక్కారు. సబ్ రిజిస్ట్రార్ తో పాటు ఔట్ సోర్సింగ్ అటెండర్ బాణోతు రవి కుమార్, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవిని కూడా అరెస్టు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. లంచం తీసుకోందే పని చేయని అవినీతి అధికారులు ఉద్యోగుల భరతం పడుతున్నారు. తాజాగా ఐదు వేలు లంచం తీసుకుంటూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి సబ్ రిజిస్ట్రార్ అసిఫోద్దీన్ తో పాటు ఔట్ సోర్సింగ్ అటెండర్ బాణోతు రవి కుమార్, డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్ ఆర్మూర్ రవి ఏసిబి అధికారులకు చిక్కారు.
మార్టిగేజ్ కోసం డబ్బులు డిమాండ్….
కాసాయిరాంకాలనీలో 266 గజాల స్థలంను మార్టిగేజ్ చేయడానికి పదివేలు సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని బాధితుడు ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకే విష్ణు వేడుకున్నప్పటికి డబ్బులు ఇస్తే తప్ప మార్టిగేషన్ చేయనని స్పష్టం చేయడంతో ఐదు వేలు ఇస్తానని ఒప్పుకొని ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐదు వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. రూ. 5000 నగదు స్వాధీనం చేసుకొని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు రికార్డులను పరిశీలించారు.
గత నెలలో ఇద్దరు…
గత నెల డిసెంబర్ 16న మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అఫీసుద్దీన్ 4500 లంచంగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అ ఘటన మరిచి పోకముందే డిసెంబర్ 28న శంకరపట్నం డిప్యూటీ తహశీల్దార్ మల్లేశం రైతు నుంచి ఆరు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డాడు. నవంబర్ 19న అంతర్గాం తహశిల్దార్ ఉయ్యాల రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ 12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కారు. ఆగష్టు 3న కాల్వశ్రీరాంపూర్ తహశిల్దార్ జహేద్ పాషా, విఆర్ఏ కుమారుడు విష్ణు, డ్రైవర్ అంజద్ పది వేలు లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు. జూలై 4న కరీంనగర్ లో డిసిఎంఎస్ మేనేజర్ రేగులపాటి వెంకటేశ్వరరావు లక్షా రూపాయలు లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నెలకు ఒకరు, ఇద్దరు…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకు ఒకరు ఇద్దరు ఏసీబీకి చిక్కుకున్నారు. అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్నా జీతంతో పాటు గీతం తీసుకునే ఉద్యోగులు, అధికారుల్లో మార్పు మాత్రం కనిపించడం లేదు. లంచం ఇవ్వడం లంచం తీసుకోవడం నేరమని తెలిసినా యదేచ్చగా లంచావతారులు డబ్బులు తీసుకుంటున్నారు. ప్రతి నెల ఠంచన్ గా జీతం వస్తున్నా లంచానికి కక్కుర్తి పడి అడ్డంగా బుక్ కావడం వారి పాపం పండిందని ప్రజలు భావిస్తున్నారు. లంచగొండి అవినీతి అధికారులపై కఠినంగా వ్యవహరించాలని జనం కోరుతున్నారు.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్