Best Web Hosting Provider In India 2024
తార్కిక అంశాలపై ఆధారాలతో పోస్టులు
గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై సాక్ష్యాలతో ప్రజల ముందుకు..
సొంతూరికి వచ్చి ప్రతి గ్రామంలో ‘వైయస్ జగన్ మార్క్’ సెల్ఫీలు
ఎన్నికల తర్వాత మళ్లీ కొత్త జోష్
అక్రమ కేసులతో కూటమి సర్కార్ వేధించినా రెట్టించిన ఉత్సాహంతో యాక్టివ్
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా మళ్లీ పుంజుకుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఇబ్బడిముబ్బడిగా అక్రమ కేసులు నమోదు చేయిస్తోన్న సంగతి తెలిసిందే. కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ థర్డ్ డిగ్రీ సైతం ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలో వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. సొంతూళ్లకు వచ్చిన యువత 2019-24 మధ్య రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపుతూ సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ‘వైయస్ జగన్ మార్క్’ అంటూ ప్రజలకు వాస్తవాలను తెలిజేస్తున్నారు.
ఎన్నికల తర్వాత ప్రతికూల పరిస్థితులు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించారు. సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై కక్షగట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. అక్రమ కేసులు పెట్టడంతో పాటు నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగం కూడా చేసిన ఉదంతాలున్నాయి. ఇలా అక్రమ కేసులతో వేధించినా వైయస్ఆర్‌సీపీ యాక్టివిస్టులు తిరిగి పుంజుకున్నారు.
ఊరూరా ‘వైయస్ జగన్ మార్క్’ సెల్ఫీలు
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన యువత.. తమ తమ ఊళ్లలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై సెల్ఫీలు తీసుకుని వాటిని ’వైయస్ జగన్ మార్క్‘ హ్యాష్ ట్యాగ్ చేసి పోస్టులు చేశారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాలు, నాడు-నేడు స్కూళ్ల అభివృద్ధి, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, వేలాదిగా నిర్మాణంలో ఉన్న పేదల ఇళ్లు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీల వద్ద సెల్ఫీలు దిగి వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల నాడు-నేడు స్కూళ్లను పరిశీలించి అక్కడ తీసుకున్న సెల్ఫీలు, విద్యార్థుల యూనిఫాం, ట్యాబులు, కర్నూలు జిల్లాలోని సోలార్ పంప్డ్ ప్రాజెక్టు, రుషికొండ భవనాల వద్ద తీసుకున్న సెల్ఫీలు ఉటంకిస్తూ పోస్టులు చేశారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నందుకు పవన్ కు థ్యాంక్స్ చెప్పారు.
కూటమి నేతల ఉత్తుత్తి ప్రచారాలకు ఆధారాలతో చెక్
ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటిపోయినా సూపర్ సిక్స్ జాడ లేదు. పైగా ఎల్లో మీడియా, టీడీపీ కూటమి పార్టీల నేతలు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా ప్రచార ఆర్భాటాలు మిన్నంటుతున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని నిలిపేసిన చంద్రబాబును ఎల్లో మీడియా ఆకాశానికెత్తేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయకపోయినా విజన్, విస్తరాకుల కట్ట అంటూ ఊకదంపుడు కథనాలు ఎక్కువయ్యాయి. చంద్రబాబు హామీలు ఎగ్గొట్టిన తీరును, గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు సాక్ష్యాధారాలతో సహా వైయస్ఆర్‌సీపీ యాక్టివిస్టులు ట్వీట్లు, పోస్టులు పెట్టారు. దీంతో అధికార కూటమి నేతలు, కార్యకర్తల్లో రియాక్షన్ లేదు. అక్రమ కేసులకు వెరవకుండా ప్రభుత్వ తప్పిదాలను వాస్తవాలతో నెట్టింట కడిగేస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా తిరిగి పుంజుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ లో సరికొత్త జోష్ వచ్చింది.